రాహుల్ జోడో రిజల్ట్స్.. యూపీలో కాంగ్రెస్ ఒంటరే!

జోడో అంటే అతికించుకుంటూ వెళ్లాలి. రాజకీయాలకు నా యాత్రకు సంబంధం లేదు. కుల మతాలకు అతీతంగా ప్రేమను పంచి, దేశంలోని ప్రజలందరినీ కలపడానికే ఈ యాత్ర చేస్తున్నాను అని రాహుల్ ఎంతగా చెప్పుకున్నప్పటికీ.. జోడో…

జోడో అంటే అతికించుకుంటూ వెళ్లాలి. రాజకీయాలకు నా యాత్రకు సంబంధం లేదు. కుల మతాలకు అతీతంగా ప్రేమను పంచి, దేశంలోని ప్రజలందరినీ కలపడానికే ఈ యాత్ర చేస్తున్నాను అని రాహుల్ ఎంతగా చెప్పుకున్నప్పటికీ.. జోడో యాత్ర లక్ష్యం.. రాజకీయమేనని, కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్త మద్దతు కూడగట్టడం, మిత్రపక్షాలను మళ్లీ సమీకరించుకోవడమేనని అందరికీ తెలుసు. 

అయితే.. ఈ లక్ష్యాలు అందుకున్నారో లేదో.. ఎన్నికల తరుణం వచ్చినప్పటికీ గానీ బయటపడదు. ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్ ను నమ్మి రాహుల్ వెంట నిలుస్తున్నాయా? తమ దారి తాము చూసుకుంటున్నాయా? ఇప్పుడే తేలే అవకాశం లేదు. కానీ యూపీలో మాత్రం రాహుల్ జోడో యాత్ర రిజల్ట్ అప్పుడే, అక్కడ యాత్ర ముగియకముందే, తెలిసిపోతోంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరి అవుతోంది.

బిజెపి అప్రతిహత విజయాలు నమోదుచేస్తున్న ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఘనమైన చరిత్ర ఉంది. దారుణమైన వైఫల్యాలు కూడా ఉన్నాయి. తమ కుటుంబాన్ని కొన్ని తరాల పాటు నెత్తిన పెట్టుకున్న అమేథీనుంచి రాహుల్ ఓడిపోయిన రికార్డు కూడా ఉంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కు గతంలో ఎస్పీ, ఆర్ఎల్డీ, బిఎస్పీ లతో కలిసి పనిచేసిన ట్రాక్ రికార్డు ఉంది. కాబట్టి.. ఆయా మిత్రపక్షాలను మళ్లీ ఒకసారి, ఈ యాత్ర రూపేణా దువ్వి దారిలోకి తెచ్చుకోవడం అనేది ఒక టార్గెట్. కాగా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రయత్నాలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. 

బిజెపి హవాకు చెక్ పెట్టడానికి కాంగ్రెస్ తో జట్టుకట్టే అవసరం ఎక్కువగా ఉండే ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా విముఖంగానే మాట్లాడుతున్నారు. కేవలం విముఖత అయితే అదొక రకం.. బిజెపి- కాంగ్రెస్ రెండు పార్టీలూ ఒకటే అంటూ దాదాపు తిడుతున్నారు. తమ పార్టీది భిన్నమైన సిద్ధాంతం అంటున్నారు. ఈ మూడు పార్టీలను పాదయాత్రలో పాల్గొనాల్సిందిగా తాము ఆహ్వానించాం అని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. కానీ ఆ పార్టీల నుంచి స్పందన శూన్యం. మాయావతి పట్టించుకోకపోగా, ఆర్ఎల్డీనేత జయంత్ చౌధురి తాను బిజీగా ఉన్నానని సెలవిచ్చారు. అఖిలేష్ యాదవ్ ఏకంగా తనకు అసలు ఆహ్వానమే అందలేదని అంటున్నారు. 

ఆయనను పిలవకుండానే.. పిలిచినట్టుగా కాంగ్రెస్ చెప్పుకుంటున్నదా? లేదా వారి ఆహ్వానాన్ని అఖిలేష్ అసలు గుర్తించడమే లేదా? అని చర్చ నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ.. దేశంలో అతిపెద్ద రాష్ట్రంలో ఎవరో ఒకరి మద్దతు లేకుండా మనుగడ సాగించలేని స్థితికి ఎన్నడో దిగజారిపోయిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతానికి ఒంటరి అయిపోయినట్లుగా రాహుల్ జోడో యాత్ర తేల్చిచెబుతోంది.