భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ.. పెద్దగా ప్రజల మధ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ పాపులర్ కాకపోయినప్పటికీ.. పార్టీలోని పెద్దతలకాయలకంటె కీలకంగా ఉండే నాయకులు కొందరు ఉంటారు. ఆరెస్సెస్ విధినిర్దేశాల మేరకు విధులు నిర్వర్తిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తుంటారు. పార్టీ నాయకులకంటె వారి ప్రాధాన్యం చాలా ఎక్కువగా ఉంటుంది గానీ.. లోప్రొఫైల్ లో ఉంటారు. బయటపడి మాట్లాడడమూ, సంచలనాలు సృష్టించాలనే ఆరాటమూ వారిలో కనిపించదు.
ప్రస్తుతం బిజెపిలో అలాంటి పెద్ద తలకాయ నాయకుడు బొమ్మరబెట్టు లక్ష్మీజనార్దన సంతోష్. అందరికీ ఆయన బీఎల్ సంతోష్ గా పరిచితులు. తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు పుణ్యమా అని తెలుగు ప్రజల వరకు పాపులర్ కూడా. నిత్యం ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలతో టచ్ లో ఉంటూ పార్టీని ముందుకు నడిపిస్తూఉండే బీఎల్ సంతోష్ ఇప్పుడు డైరెక్ట్ ఎటాక్ మోడ్ లోకి మారుతూఉన్నారు. పార్టీ నాయకులకు శిక్షణ ఇవ్వడానికి హైదరాబాదుకు వచ్చిన ఆయన.. తనపై ఆరోపణలు చేసిన వారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
మొయినాబాద్ పాంహౌస్ లో తెరాస ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించినట్లుగా కేసు నమోదైన తర్వాత.. బిఎల్ సంతోష్ పేరు ప్రధానంగా వార్తల్లోకి వచ్చింది. అరెస్టు అయిన నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజి తదితరుల ఫోను సంభాషణల ఆడియోల్లో.. బిఎల్ సంతోష్ పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. ఆయన సూచనల మేరకే తెరాస ప్రభుత్వాన్ని కూల్చడానికి రంగం సిద్ధం అవుతున్నట్లుగా, ఆ ఎమ్మెల్యేలకు భారీ ఆఫర్లు ఇస్తున్నట్టుగా కూడా ఆడియోలో ఉంది.
మూడో వ్యక్తులు ఆయన పేరును ప్రస్తావించినట్టు ఆడియోలో ఉండడం తప్ప వేరే స్పష్టమైన ఆధారాలు లేకపోయినప్పటికీ.. పోలీసులు బిఎల్ సంతోష్ ను విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపారు. ఆయన వాటిని ఖాతరు చేయలేదు. ఆ తర్వాత.. హైకోర్టు ఆ నోటీసులను కూడా నిలిపివేసింది. గూడుపుఠాణీని నడిపిస్తున్న వ్యక్తిగా బిఎల్ సంతోష్ పేరు చాలా రోజులు వార్తల్లో నలిగింది.
అలాంటిది ఇప్పుడు సంతోష్ నేరుగా తన పేరును ప్రస్తావించిన వారికి హెచ్చరికలు జారీచేస్తున్నారు. నేను ఎవరికీ తెలీకపోయినా నా పేరును ప్రతి ఇంటికీ తీసుకువెళ్లారని ఆగ్రహించారు. అయితే తన మీద విమర్శలు చేసిన వారు పర్యవసానాలు అనుభవిస్తారని సంతోష్ అనడం అంటే.. ఎలాంటివి.. పైలట్ రోహిత్ రెడ్డి మీద ఈడీ విచారణ లాంటివా? లేదా, మరోరకంగా ఉంటాయా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కానీ, అసలే లోప్రొఫైల్ లో ఉంటే బీఎల్ సంతోష్ వంటి నేత.. మెయిన్ స్ట్రీమ్ రాజకీయ నాయకుల్లాగా తన మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించి.. ‘పర్యవసానాలు ఎదుర్కోక తప్పదు’ లాంటి కౌంటర్లు ఇవ్వడం పార్టీలో కూడా చాలా మందికి జీర్ణం కావడం లేదు.