కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖకు తరలించొద్దనే డిమాండ్లు వస్తున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ నుంచి విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది.
కృష్ణా బేసిన్‌తో ఏ మాత్రం సంబంధం లేని విశాఖకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని తరలించేందుకు వచ్చే నెలలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు జనవరి 11న జరిగే బోర్డు సమావేశంలో కార్యాలయ తరలింపునకు సంబంధించి అజెండాగా చేర్చడం గమనార్హం.
కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖకు తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయితే ఆ కార్యాలయాన్ని గతంలో విజయవాడలో ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అధికారం మారిన నేపథ్యంలో పరిపాలన రాజధానిగా ఎంచుకున్న విశాఖలో ఏర్పాటు చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ఆ కార్యాలయాన్ని కృష్ణా నది ప్రవహించే రాయలసీమలో ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఆ ప్రాంత ప్రజాసంఘాలు, ఉద్యమకారుల నుంచి వస్తున్నాయి.
విశాఖకు తరలింపు ఏ మాత్రం మంచిది కాదని వారంతా అంటున్నారు. ఈ అభిప్రాయాల్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. కనీస హక్కుగా ఉన్న దాన్ని విశాఖకు తరలించడం ఏంటనే నిలదీతలు ఆ ప్రాంతం నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖకు తరలించాలనే పట్టుదల ప్రభుత్వానికి ఎందుకో అర్థం కావడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.