రాజకీయ నాయకులు కొన్ని రొటీన్ డైలాగులు చెబుతుంటారు. ప్రధానంగా హామీల గురించి మాట్లాడుతుంటారు. ఏదైనా హామీ ఇచ్చి నెరవేర్చలేదనుకోండి. ఎందుకు నెరవేర్చలేకపోయామో సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతుంటారు. ఆ హామీ తీర్చలేమని, తీరేది కాదని చెప్పే నాయకుడికీ తెలుసు. వినే ప్రజలకూ తెలుసు. ఇదొక తంతు అంతే.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యవహారమూ అలాగే ఉంది. ఆయన అధికారంలోకి రావడం కోసం ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. వాటిల్లో ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తీరుతాననేది ఒకటి. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో. దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఊరూ వాడా తిరిగి ప్రచారం చేశారు. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో సదస్సులు పెట్టి విద్యార్థులకు నూరిపోశారు.
ప్రత్యేక హోదా సాధించలేని చంద్రబాబును విపరీతంగా విమర్శించారు. మీ ఎంపీలు, మా ఎంపీలు పదవులకు రాజీనామాలు చేస్తే చచ్చినట్లు ప్రత్యేక హోదా వస్తుందన్నారు. అప్పట్లో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి నిరాహార దీక్షలు చేశారు కూడా. అప్పట్లో వైసీపీకి ఐదుగురు ఎంపీలు ఉండేవారు. వైసీపీ, టీడీపీ ఎంపీలు కలిసి పాతికమంది ఒకేసారి రాజీనామా చేస్తే కేంద్రం దిగొచ్చి ప్రత్యేక హోదా ఇచ్చితీరుతుందని అప్పట్లో జగన్ గట్టిగా వాదించారు.
ప్రత్యేక హోదా కోసం జగన్ తీవ్రంగా పోరాటం చేయడంతో చంద్రబాబు భయపడిపోయారు. అప్పట్లో ప్రత్యేక హోదాను జగన్ సెంటిమెంటుగా తయారు చేశారు. దీంతో చంద్రబాబు కూడా కేంద్రాన్ని ప్రత్యేక హోదా డిమాండ్ చేయడమే కాకుండా తగాదా పెట్టుకొని చివరకు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. ప్రజలు చంద్రబాబును ఓడించి జగన్ కు అధికారం అప్పగించడానికి ప్రత్యేక హోదా హామీ కూడా ప్రధాన కారణం.
కానీ జగన్ అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది. అధికారం చేపట్టిన తొలి రోజుల్లో ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన జగన్ బీజేపీకి కేంద్రంలో సంపూర్ణ మెజారిటీ వచ్చింది కాబట్టి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని, దానికి సీట్లు తక్కువగా వచ్చిఉంటే తాము మద్దతు ఇవ్వడం కోసం ప్రత్యేక హోదా డిమాండ్ చేసేవాళ్లమని చెప్పారు.
బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావడం మన దురదృష్టమన్నారు. అయినప్పటికీ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఉంటామని, దాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఇదే డైలాగ్ చెబుతూనే ఉన్నారు. నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూడా ఇదే డైలాగ్ రిపీట్ చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక జనం ప్రత్యేక హోదా మర్చిపోయారు.
బాబు హయాంలో హోదా కోసం పోరాటం చేసిన, ఆరాట పడిన కొందరు నాయకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. ప్రత్యేక హోదాను జనం మర్చిపోయినా తాను మర్చిపోలేదని జగన్ గుర్తు చేస్తుంటారు. వచ్చే ఎన్నికల వరకూ కూడా కేంద్రంలో బీజేపీకి వచ్చే గండం ఏమీ లేదు కాబట్టి మద్దతు ఇచ్చే అవసరం జగన్ కు రాదు. ప్రత్యేక హోదా కూడా రాదు. తాము అడుగుతూనే ఉన్నామని జగన్ జనానికి చెబుతూనే ఉంటారు.