జీవితంలో పెళ్లి చేసుకోవాలనే కోరిక ప్రతి మగవాడికి, ఆడపిల్లకూ ఉంటుంది. వైవాహిక జీవితాన్ని అనుభవించాలని ఉంటుంది. ఇందుకు భిన్నంగా కొందరు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారు. అందుకు అనేక కారణాలు ఉండొచ్చు. పెళ్లి అనేది వ్యక్తిగతం కాబట్టి చేసుకోవడం, చేసుకోకపోవడం అనేది వారిష్టం. సామాన్యులు పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యుల తప్ప ఎవరూ పట్టించుకోరు. కానీ ప్రముఖులు అంటే రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, హీరోయిన్లు పెళ్లి చేసుకోకపోతే ప్రజలు దాన్ని గురించి తప్పకుండా చర్చించుకుంటారు. ఇది సహజమైన మానవాసక్తి. ఇదే ఆసక్తి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ, రాజీవ్- సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ గురించి కూడా ఉంది.
చాలా ఏళ్ళు జనం రాహుల్ గాంధీ పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. కానీ క్రమంగా మాట్లాడటం మానేశారు. ఆయనకు యాభై ఏళ్ళు దాటాక క్రమంగా జనాలకు ఆసక్తి తగ్గిపోయింది. కానీ రాహుల్ గాంధీలో మాత్రం పెళ్లంటే ఆసక్తి చనిపోలేదని ఆయన మాటలనుబట్టి అర్ధమవుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 50 ఏళ్లు దాటినా ఇంకా ఓ ఇంటివాడు కాలేదు. ఆయన పెళ్లి గురించి గతంలో అనేక పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా, భారత్ జోడో యాత్రపేరుతో దేశవ్యాప్త పాదయాత్ర చేస్తున్న రాహుల్.. తనకు కాబోయే భార్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. తన నానమ్మ ఇందిర వంటి మంచి లక్షణాలున్న అమ్మాయి అయి ఉండాలని, అమ్మ, నానమ్మలోని మిశ్రమ లక్షణాలుంటే మరీ మంచిదని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ గురించి ప్రముఖంగా ప్రస్తావించిన కాంగ్రెస్ ఎంపీ.. నానమ్మ అంటే తనకెంతో ప్రేమని, ఆమె తనకు మరో మాతృమూర్తిలాంటి వారన్నారు. జీవిత భాగస్వామి ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు ‘ఇది ఆసక్తికర ప్రశ్న.. నానమ్మ వంటి సుగుణాలున్న మహిళ అయితే నాకు అభ్యంతరం లేదు. కానీ, అమ్మ, నానమ్మలో ఉన్న మిశ్రమ లక్షణాలు కలిగినవారైతే ఇంకా మంచిది’ అంటూ సమాధానం ఇచ్చారు.
తమిళనాడులో పాదయాత్ర చేసినప్పుడు మేధావులు, సమాజంలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులతో ముచ్చటించారు. వారితో మాటల అనంతరం దారిలో ఒక పొలంలో పనిచేస్తున్న కూలీలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఒక మహిళా కూలీ లేచి ” రాహుల్ జి.. ఇంతకీ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు” అని అడిగింది. దీంతో ఒక్కసారిగా రాహుల్ గాంధీ మౌనం వహించారు. సిగ్గు పడిపోయారు. ” మా తమిళనాడులో చాలామంది అమ్మాయిలు ఉన్నారు. మీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి. మీకు అలాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసే బాధ్యత మేము తీసుకుంటామని” ఆ మహిళ కూలి చెప్పడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు.
ఇటీవల కర్ణాటకలోనూ ఇదే ప్రశ్న రాహుల్ గాంధీకి ఎదురయింది. అవును ఈ ప్రశ్నకు చాలా తరచుగా ఎదురవుతూ ఉంటుంది. మీరు మాత్రమే కాదు. మల్లికార్జున ఖర్గే వంటి వారు కూడా నన్ను తరచుగా ఇదే అడుగుతూ ఉంటారని” రాహుల్ నవ్వుల మధ్య సమాధానం ఇచ్చారు. తమిళనాడులో, కర్ణాటకలో పెళ్లి గురించే ప్రశ్నలు ఎదురవుతున్నా సరైన సమాధానం రాహుల్ గాంధీ నుంచి రాలేదు. బ్రహ్మచారి ముద్ర అనేది ప్రధానమంత్రిగా కూర్చునేందుకు దగ్గర దారి అని ఆయన విశ్వసిస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేసిన తర్వాత చాలామంది యువకులు “సోలో బతుకే సో బెటరు” అని అర్థం వచ్చేలా కామెంట్లు చేశారు. రాహుల్ ఒక విదేశీ అమ్మాయిని ప్రేమించాడని, కానీ వారి పెళ్లి తల్లి సోనియా గాంధీ ఒప్పుకోలేదని, అందుకే రాహుల్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడని చాలా ఏళ్ళ క్రితం జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కారణాలు ఏవైనా రాహుల్ మాత్రం యాభై ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. ఇప్పుడైనా ఆయన సీరియస్ గా మాట్లాడాడో, సరదాగా అన్నాడో తెలియదు.