చంద్రబాబునాయుడు- దేశంలో వేసిన నేషనల్ హైవేలు అన్నీ తన ఘనతే అని చెప్పుకోగలరు కదా.. మరి ఆయనకు సందుగొందులు వెతుక్కోవాల్సిన ఖర్మం ఏమిటా? అని విస్తుపోతున్నారా? అవును ఖర్మే మరి! ఆయన నిజంగానే చిన్న చిన్న పట్టణాల్లో చిన్న చిన్న సందుగొందులు వెతుక్కోవాల్సి వస్తోంది. ‘ఇదేం ఖర్మ’ అంటూ జగన్ మీద బురద చల్లడానికి వేదికలుగా సందుగొందులు తప్ప మరో ప్రదేశమే దొరకదా అన్నట్టుగా సభలు నిర్వహిస్తున్న చంద్రబాబునాయుడు తీరు ఇప్పుడు ప్రశ్నార్థకం అవుతోంది. కందుకూరు లాంటి చిన్నపట్టణంలో సభఏమీ లేకపోయినా కూడా జనసమ్మర్దంగా ఉండే కూడలిలో సభ ప్లాన్ చేసుకున్నందువల్లనే.. తొక్కిసలాట 8 మంది మరణం జరిగాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన ఎందుకిలా చేస్తున్నారని ఆలోచిస్తున్నారు.
సభలు నిర్వహించడంలో రాజకీయ నాయకులకు కొన్ని ట్రిక్కులు, టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు ఉంటాయి. ఒక్కో ఊరిలో సభ పెడుతున్నప్పుడు.. అక్కడ తమ సభకు రాగల జనం ఎంతమంది అనేది వారికి ఒక అంచనా ఉంటుంది. లక్షమంది వచ్చే అవకాశం ఉన్నదంటే.. యాభైవేల మంది పట్టే మైదానాన్ని వేదికగా ఎంచుకుంటారు. అప్పుడు సభ పెడితే.. సభాప్రాంగణం మొత్తం కిటకిటలాడుతూ.. జనం ఆయన సభ కోసం ఎగబడుతున్నట్టుగా కనిపిస్తుందన్నమాట. ఇదొక రాజకీయ వ్యాపార రహస్యం.
చంద్రబాబునాయుడు ఈ విద్యలో ఇంకాస్త ఆరితేరిపోయారు. ఆయన మరీ జనసమ్మర్దంగా ఉండే రోడ్లు కూడళ్లనే సభావేదికలుగా ఎంచుకుంటున్నారు. సభలు లేకపోయినా జనం రద్దీ ఉండే ప్రాంతాల్లో, చిన్న చిన్న సందులు, గొందులు, ఇరుకైన రోడ్లలో సభలు పెడుతున్నారు. దానివల్ల జనం కొద్ది మంది పోగైనా సరే.. ఆ ప్రాంతం మొత్తం కిటకిటలాడుతూ కనిపిస్తుంది. జనం చంద్రబాబుసభ కోసం ఎగబడిపోతున్నట్టుగా.. జనం రద్దీతో పోటెత్తుతున్నట్టుగా పచ్చమీడియా టముకు వేయడానికి సిద్ధంగా ఉంటుంది. చిన్న రోడ్లలో సభ పెట్టి, జనం క్రిక్కిరిసిపోగానే.. డ్రోన్ కెమెరాలతో ఫోటోలు, వీడియోలు తీస్తుంటారు. దీని ఎఫెక్ట్.. జనసమూహం ఎక్కువగా ఉన్నట్టు భ్రమింపజేయడం సాధ్యం అవుతుంది.
తన ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని జనం పట్టించుకోరనే క్లారిటీ ఉన్నందువల్లనే.. అంతో ఇంతో తిరిగేచోట జనం కనిపించేలా బిల్డప్పులు ఇవ్వడానికి ఎంచుకున్న మార్గం ఇది. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనల ఫలితమే.. కందుకూరులో 8 ప్రాణాలు బలికావడంకూడా. చాలా చిన్న రోడ్డు కావడంతో జనం రద్దీ ఎక్కువైపోయింది. చంద్రబాబు కాన్వాయ్ తో పాటు వచ్చిన జనాలు కూడా ఎగబడడంతో తోపులాట, తొక్కిసలాట జరిగింది.
జనం తొక్కిసలాడుకుని చచ్చిపోతే.. తన ప్రసంగం ఆపేసిన చంద్రబాబునాయుడు ఆస్పత్రికి వెళ్లి వారిని పరామర్శించి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ తన ప్రసంగం కొనసాగించారు. జగన్ మీద బురద చల్లడం తప్ప మరో ఎజెండా అంశం ఉండని ప్రసంగాన్ని వారి మరణాలపట్ల సానుభూతితో ముగిస్తే ఏమౌతుంది. కానీ.. దానిని కొనసాగించడంలోనే.. చంద్రబాబులోని మసకబారుతున్న మానవత్వం మనకు కనిపిస్తుంది.