నెల్లూరు జిల్లా కందుకూరులో చోటు చేసుకున్న విషాదంపై ప్రధాని మోదీ కలత చెందారు. బుధవారం రాత్రి చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందడంతో పాటు పలువురు క్షతగాత్రులయ్యారు. ఈ విషయమై ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులకు కేంద్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతగా అండగా నిలిచింది.
కందుకూరులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే మృతి చెందిన ఒక్కో కుటుంబానికి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు ప్రధాని ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేలు ఇవ్వనున్నట్టు మోదీ వెల్లడించడం విశేషం.
మానవతా దృక్పథంతో ప్రధాని మోదీ సహాయం ప్రకటించడం ప్రశంసలు అందుకుంటోంది. మృతులు, క్షతగాత్రులంతా టీడీపీ కార్యకర్తలే అయినప్పటికీ, పార్టీలు. రాజకీయాలు చూడకుండా సాయం అందించడం విశేషం. ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య రాజకీయంగా వైరం నడుస్తోంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో మోదీని గద్దె దింపేందుకు చంద్రబాబు దేశ వ్యాప్తంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలోనే ప్రజలు తిరస్కరించడంతో మళ్లీ మోదీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.