వారాహి రెడీయేగా.. లేటెందుకు పవన్?

పాదయాత్ర రూపంలో నడవడానికి తగిన ఫిట్ నెస్ ఉంది. కానీ.. షూటింగులు స్టోరీ సిటింగుల మధ్యలో జనంతో మమేకం అయి పాదయాత్రగా వెళ్లడానికి అవసరమైనంత టైం లేదు. అయితే, రాష్ట్రమంతా తిరగాలి.. యాత్ర చేసిన…

పాదయాత్ర రూపంలో నడవడానికి తగిన ఫిట్ నెస్ ఉంది. కానీ.. షూటింగులు స్టోరీ సిటింగుల మధ్యలో జనంతో మమేకం అయి పాదయాత్రగా వెళ్లడానికి అవసరమైనంత టైం లేదు. అయితే, రాష్ట్రమంతా తిరగాలి.. యాత్ర చేసిన ఫీలింగ్ రావాలి. రాష్ట్రమంతా తనను కోరుకుంటున్నారని డప్పుకొట్టుకోవాలి. ఇదో పెద్ద కోరిక. వారం పొడవునా సినిమాలు చేయాలి, వీకెండ్ లో రాజకీయం చేయాలి.. రెండింటికీ ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నట్టు బిల్డప్ ఇవ్వాలి. అవ్వా కావాలి బువ్వాకావాలి అనే పరిస్థితి పాపం జనసేనాని పవన్ కల్యాణ్ ది. 

రాష్ట్రమంతా తిరగడానికి, జగన్ సర్కారును దుమ్మెత్తిపోయడానికి ఆయన వారాహి వాహనాన్ని సిద్ధంచేసుకున్నారు. దానికి వేసిన మిలిటరీ గ్రీన్ కలర్ ద్వారా.. చిన్న వివాదం కూడా రేకెత్తించి.. తన యాత్రకు కాదు కదా.. తన సినిమాలకు చేసినట్టుగానే తన వాహనానికి కూడా చిన్న బజ్ క్రియేట్ చేసుకున్నారు పవన్ కల్యాణ్. వాహనం రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. మరి అంతా సిద్ధంగానే ఉన్నది కదా..? వారాహి యాత్ర ఎందుకు మొదలెట్టడం లేదు? అనేది జనసైనికుల సందేహం. 

ఒకవైపు తెలుగుదేశం నారాలోకేష్ పాదయాత్ర ‘యువగళం’ మరోనెలలో ప్రారంభం కాబోతోంది. లోకేష్ కంటె ఎంతో గొప్ప ఫిట్ నెస్ తో ఉండే తమ నాయకుడు పాదయాత్రగా కాకుండా, వారాహి ఎక్కి రావడం అభిమానులకు కొంత అసంతృప్తి అయినప్పటికీ.. సర్దుకుంటున్నారు. కాకపోతే.. లోకేష్ యాత్ర మొదలయ్యాక తమ నాయకుడు యాత్రచేస్తే.. అతని ఫుట్ స్టెప్స్ ను అనుసరించినట్లుగా ఉంటుందని, అది తమకు చిన్నతనం అని వారు భావిస్తున్నారు. లోకేష్ యాత్రకు ముందే.. కనీసం తమ నాయకుడు రూట్ మ్యాప్ అయినా ప్రకటిస్తే బాగుంటుందని వారు కోరుకుంటున్నారు. 

నిజానికి పవన్ కల్యాణ్ కు కూడా రాయలసీమనుంచే యాత్ర ప్రారంభించాలని కోరిక. తిరుపతిలో తొలిసభ పెట్టే ఆలోచన ఉన్నట్టుగా పార్టీలో ఒక ప్రచారం ఉంది. అయితే లోకేష్ వెళ్లే మార్గంలోనే పవన్ కూడా వెళ్తారా.. ఇతర ప్రాంతాలను టచ్ చేస్తూ వెళ్తారా అనేది కీలకం. ఎలా చేసినా.. పవన్ కు పరువునష్టం తప్పదు. లోకేష్ ను ఫాలో అయ్యారని, లేదా, చంద్రబాబు పుత్రుడు ఒకవైపునుంచి- దత్తపుత్రుడు మరొకవైపునుంచి యాత్రలు చేస్తున్నారని వారి రాజకీయ ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తారు. 

చంద్రబాబు కోసం అలాంటి ఎగతాళి మాటలు మోయడానికి పవన్ కల్యాణ్ సిద్ధమే గానీ.. ఆయన వారాహి యాత్ర విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కించడమే ఆశ్చర్యంగా ఉంది. ఆలస్యం చేసే కొద్దీ తమ నాయకుడి యాత్రను ప్రజలు పట్టించుకోరేమో అనే ఆందోళన జనసైనికుల్లో ఉంది. 

లోకేష్ యాత్ర, వైసీపీ నాయకులు స్థానికంగా చేస్తున్న గడపగడపకు కార్యక్రమం దగ్గరినుంచి ఇతర యాత్రలు ప్రజలకు అప్పటికే ఎక్కువైపోయిఉంటాయనేది వారి భయం. నిజానికి ‘యాత్ర’ అనే పేరు పెట్టకపోయినప్పటికీ.. ఇదేంఖర్మ పేరుతో చంద్రబాబు ఊరూరా తిరుగుతున్నది కూడా బస్సుయాత్ర లాంటిదే. మరి ఎలాంటి కొత్తదనమూ లేకుండా.. తమ నాయకుడా వారాహి యాత్రను ప్లాన్ చేసినప్పటికీ.. అందులో ఇంకా జాప్యం ఎందుకో, ప్రజలు యాత్రలతో మొహం మొత్తి నీరసించిపోయేదాకా ఆయన ఇంట్లోంచి బయటకు కదలరో ఏమో అని జనసైనికులు భావిస్తున్నారు.