సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎరువులు, విత్తనాల డీలర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఒక రాజకీయ నాయకుడిలా కలెక్టర్ మాట్లాడ్డంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. సీఎం కేసీఆర్‌కు దగ్గరివాడిగా గుర్తింపు పొందిన కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
యాసంగిలో వరి విత్తనాలు విక్రయిస్తే ఊరుకునేది లేదంటూ కలెక్టర్ హెచ్చరించారు. తమ ఆదేశాలు కాదని ఎవరైనా డీలర్లు విత్తనాలు అమ్మితే సంబంధిత ఏఈవోలు, వ్యవసాయాధికారులను సస్పెండ్ చేస్తామని తీవ్రంగా హెచ్చరించడం రాజకీయంగా దుమారం రేపుతోంది. కేవలం హెచ్చరికతో ఆయన ఊరుకోలేదు.
యాసంగిలో ఎవరైనా ఒక్క కేజీ వరి విత్తనాలు విక్రయించినా ఊరుకునేది లేదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అమ్మితే షాపుని సీజ్ చేస్తామని తేల్చి చెప్పారు. ఒకవేళ డీలర్లు సుప్రీంకోర్టుకెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నా…ఎట్టి పరిస్థితుల్లోనూ దుకాణాన్ని తెరిచేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సులు చేయించినా పట్టించుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఒకవేళ ఎవరైనా పలుకుబడి ఉంది కదా అని ఫోన్ చేయిస్తే మళ్లీ మూతపడుతుందని డీలర్లను గట్టిగా హెచ్చరించడం గమనార్హం. తాను కలెక్టర్‌గా ఉన్నంత వరకూ ఆ షాపు తెరవనివ్వనని ఆయన తేల్చి చెప్పారు.