ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం అత్యుత్సాహం

ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం విప‌రీత ధోర‌ణుల‌తో జ‌గ‌న్ స‌ర్కార్‌కు చెడ్డ పేరు వ‌స్తోంది. గోటితో పోయేదాన్ని గొడ్డ‌లి వ‌ర‌కు తెచ్చేలా ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం వ్య‌వ‌హార శైలి ఉన్న‌ట్టు ఆరోప‌ణలున్నాయి. అంతేకాకుండా,…

ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం విప‌రీత ధోర‌ణుల‌తో జ‌గ‌న్ స‌ర్కార్‌కు చెడ్డ పేరు వ‌స్తోంది. గోటితో పోయేదాన్ని గొడ్డ‌లి వ‌ర‌కు తెచ్చేలా ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం వ్య‌వ‌హార శైలి ఉన్న‌ట్టు ఆరోప‌ణలున్నాయి. అంతేకాకుండా, జ‌గ‌న్ స‌ర్కార్‌కు, ఏపీ హైకోర్టుకు మ‌ధ్య దూరాన్ని పెంచేలా ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం ప్ర‌క‌ట‌న ఉంద‌నే విమ‌ర్శ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

క‌రోనా నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కోత పెట్టిన జీతాల‌ను 12 శాతం వ‌డ్డీతో క‌లిపి చెల్లించాల‌ని హైకోర్టు తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీనిపై స‌హ‌జంగానే భిన్న వాద‌న‌లున్నాయి. కానీ అంతిమంగా న్యాయ‌స్థాన తీర్పును అంద‌రూ గౌర‌విం చాల్సిందే. హైకోర్టు తీర్పుపై  ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు వెంక‌ట్రామిరెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న‌పై ఉద్యోగులు ఆశ్చ‌ర్యం, అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

అలాగ‌ని 12 శాతం వ‌డ్డీతో స‌హా 50 శాతం జీతాన్ని చెల్లించాల‌ని ఏ ఒక్క‌రూ కోరుకోవ‌డం లేదు. ఉద్యోగుల అభ్యంత‌రం ఒక్క‌టే…తీర్పును పునఃస‌మీక్షించాల‌ని తిరిగి హైకోర్టు మెట్లు ఎక్కుతామ‌ని ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం ప్ర‌క‌టించ‌డంపై అభ్యంత‌రం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల మొత్తం ఉద్యోగులంద‌రూ అప్ర‌తిష్ట‌పాలు అయ్యే అవ‌కాశం లేక‌పోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఒక వైపు హైకోర్టు తీర్పును గౌర‌విస్తూనే, మ‌రోవైపు ప్ర‌భుత్వంపై భారం ప‌డ‌కుండా చేయ‌వ‌చ్చ‌నేది ఉద్యోగుల వాద‌న‌. అదెలాగో ఉద్యోగుల వాద‌న వినే ముందు, ఈ నెల 13న ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో రెండు మూడు ముఖ్య అంశాల‌ను ప‌రిశీలిద్దాం.

‘క‌రోనా సంక్షోభం కార‌ణంగా వాయిదా వేసిన మార్చి, ఏప్రిల్ నెల‌ల 50 శాతం జీతాన్ని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు 12 శాతం వ‌డ్డీతో చెల్లించాల‌ని చెప్పిన జ‌డ్జిమెంట్‌ను తాము ఎన్న‌డూ కోరుకోలేదు. ఈ విష‌య‌మై క‌మిటీలో చ‌ర్చించి అప్పీల్‌కు వెళ్తాం. ప్ర‌భుత్వం ఉద్యోగ సంఘాల‌తో చ‌ర్చించిన త‌ర్వాతే 50 శాతం జీతాన్ని వేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యం వ‌ల్ల కొంద‌రు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు. ఎవ‌రికైనా ఇబ్బందులు ఉన్నాయ‌ని కోర్టును లేదా ప్ర‌భుత్వాన్ని ఆశ్ర‌యిస్తే వారికి జీతాలు చెల్లించాల‌ని కోర్టు చెప్ప‌వ‌చ్చు. కానీ అంద‌రికీ 12 శాతం వ‌డ్డీతో చెల్లించాల‌ని మా త‌ర‌పున కోర్టుకు వెళ్లే అధికారాన్ని ఎవ‌రికీ ద‌ఖ‌లు ప‌ర‌చ‌లేదు ’ అని ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం ఇచ్చిన  ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

ఈ వాక్యాలు చాలు ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం ఎంత అజ్ఞానంలో ఉందో అర్థం చేసుకోడానికి. జ‌డ్జిమెంట్ ఎక్క‌డైనా తాము కోరుకున్న‌ట్టు న్యాయ‌మూర్తులు ఇస్తారా?  కేసు స్వ‌భావాన్ని బ‌ట్టి తీర్పులుంటాయే త‌ప్ప‌, మ‌న ఆలోచ‌న‌లు, భావాల‌ను అనుస‌రించి ఉండ‌వ‌నే విష‌యం కూడా తెలియ‌దా? ఈ ప్ర‌క‌ట‌న‌లో మ‌రో ముఖ్య విష‌యం. అంద‌రికీ 12 శాతం వ‌డ్డీతో చెల్లిం చాల‌ని త‌మ త‌ర‌పున కోర్టుకెళ్లే అధికారాన్ని ఎవ‌రికీ ద‌ఖ‌లు ప‌ర‌చ‌లేద‌ని చెప్ప‌డం మ‌రీ అన్యాయం. కోర్టులేమైనా ఒక్కొక్క‌రికి బొట్టు పెట్టి….పేరుపేరునా తీర్పు ఇస్తుందా? ఇదో ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు వెంక‌ట్రామిరెడ్డి కోసం మాత్ర‌మే ఈ తీర్పు అని న్యాయ‌మూర్తులు చెబుతారా? అస‌లు తామేం మాట్టాడుతున్నారో తెలుస్తోందా?

ఈ తీర్పుపై ఉద్యోగుల మ‌నోభావాల విష‌యానికి వ‌స్తే ప్ర‌శంస‌నీయంగానే ఉంది. ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం చెబుతున్న‌ట్టుగా ఉద్యోగులెవ‌రూ 12 శాతం వ‌డ్డీతో 50 శాతం జీతాల్ని చెల్లించాల‌ని కోరుకోవ‌డం లేదు. కానీ ఎటూ హైకోర్టు ఆ విధంగా తీర్పు చెప్పిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం నుంచి ఆ మేర‌కు జీతాలు తీసుకుని…తిరిగి 12 శాతం వ‌డ్డీ కింద ఎంత సొమ్ము వ‌చ్చిందో ఆ మొత్తాన్ని కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కు కేటాయించే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ట్యాక్స్ మిన‌హాయింపు కూడా ఉండ‌డంతో ఆ మేరకు ల‌బ్ధి చేకూరుతుంద‌నే ఆలోచ‌న‌తో ఉద్యోగులున్నారు.

ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం నిజంగా జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఏదైనా సాయం చేయ‌ద‌లిస్తే…12 శాతం వ‌డ్డీతో జీతం చెల్లించేలా ఒప్పించి, ఉద్యోగుల‌తో చ‌ర్చించి, 12 శాతం వ‌డ్డీని తిరిగి ప్ర‌భుత్వానికి విరాళం కింద అందించేలా చ‌ర్య‌లు తీసుకోవాలి. ఇలా చేస్తే ఎలాంటి స‌మ‌స్యా ఉత్ప‌న్నం కాదు. ఒక‌వేళ హైకోర్టులో త‌మ‌కు 12 శాతం వడ్డీ వ‌ద్ద‌ని ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం పిటిష‌న్ వేస్తే… ధ‌ర్మాస‌నం ఎలా స్పందిస్తుందో తెలియ‌దు.

అస‌లే న్యాయ‌స్థానంలో కాలం క‌లిసి రాని ప‌రిస్థితి గురించి తెలిసి కూడా…మ‌ళ్లీ హైకోర్టుకు వెళ్తామంటే జ‌గ‌న్ స‌ర్కార్‌పై రెండు, త‌మ‌పై రెండు మొట్టికాయ‌లు వేయించుకోవాల‌ని ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం భావిస్తోందా? ఇప్ప‌టికైనా ప‌ర్య‌వ‌సానాల‌పై లోతుగా చ‌ర్చించి, ఉద్యోగుల మ‌నోభావాల‌కు త‌గ్గ‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తే ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘానికి గౌర‌వం ద‌క్కుతుంది. అలా కాని ప‌క్షంలో ప‌రిణామాల‌కు బాధ్య‌త వ‌హించేందుకు సిద్ధంగా ఉండాల్సిందే.

స్వర్ణ ప్యాలెస్.. మన వాళ్ళే