టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు వైసీపీ ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేలా కనిపిస్తోంది. లోకేశ్ పాదయాత్రపై మంత్రి మేరుగ నాగార్జున కీలక వ్యాఖ్యలు చేయడం చూస్తే… ఈ అభిప్రాయం కలుగుతోంది. వచ్చే నెల 27న కుప్పం నుంచి లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. దీనికి యువగళం అనే పేరు కూడా పెట్టారు. లోకేశ్ పాదయాత్రపై మంత్రి మేరుగ నాగార్జున నుంచి కౌంటర్ మొదలైంది.
ప్రతి పల్లెలో లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించడం గమనార్హం. రాష్ట్రంలో దళితులను నీచంగా, హీనంగా వాడుకునే వదిలేసే వ్యక్తి చంద్రబాబు అని మంత్రి ఘాటు విమర్శ చేశారు. లోకేశ్ పాదయాత్రను టార్గెట్ చేయాలనేది మంత్రి ఆలోచన లేక వైసీపీదా అనేది స్పష్టం కావాల్సి వుంది. లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటామనే హెచ్చరికతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెప్పు పొందేందుకే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి చర్యలతో లోకేశ్ పాదయాత్రకు వైసీపీనే పెద్ద ఎత్తున ఉచిత ప్రచారం ఇస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కుప్పంలో మొదలయ్యే పాదయాత్ర ఇచ్ఛాపురం వరకూ చేపట్టాలని లోకేశ్ నిర్ణయిం చారు. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు నడవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 100 నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగేలా టీడీపీ రోడ్ మ్యాప్‌ను తయారు చేసుకుంది. లోకేశ్ పాదయాత్ర చేస్తే వైసీపీకి నష్టమేంటి? అడ్డుకుంటే అధికార పార్టీకి తప్పకుండా రాజకీయంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు టీడీపీ నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురుకాలేదని గుర్తు చేస్తున్నారు.
మంత్రి నాగార్జున వ్యాఖ్యలను టీడీపీ తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలున్నాయి. క్షేత్రస్థాయిలో టీడీపీకి స్ట్రాంగ్ కేడర్ ఉన్న విషయాన్ని మరిచిపోకూడదు. రాజకీయంగా ఎవరి పని వారు చేసుకెళితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక పార్టీ కార్యకలాపాల్లో మరొక పార్టీ జోక్యం చేసుకుని అడ్డు తగిలితే ప్రజల్లో తప్పక వ్యతిరేకత ఏర్పడుతుంది. ఈ వాస్తవాన్ని గుర్తించి లోకేశ్ పాదయాత్ర గురించి పట్టించుకోకపోవడమే వైసీపీకి లాభం.