తాను జగన్మోహన్ రెడ్డిని ఓడించదలచుకున్నాడు కాబట్టి.. ప్రభుత్వం ఏం చేసినా సరే.. అందులో లోపాలు వెతకడం అనేది జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాపకంగా మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. కాకపోతే ఈ సారి ఆయన చాలా పద్ధతిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ కూడా రాశారు. పెన్షన్ల విషయంలో ప్రభుత్వం చెబుతున్న నిబంధనలు పేదలను ఇబ్బందుల పాల్జేసేలా ఉన్నాయని ఆయన అందులో సీఎంకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు.
విషయం ఏంటంటే.. పెన్షన్ల విషయంలో మీరు ఈ రూపంలో నిబంధనలను మించి సంపన్నులుగా ఉన్నారు గనుక.. మీకు పెన్షను ఎందుకు తొలగించకూడదు అంటూ ప్రభుత్వం కొందరు పెన్షనర్లకు నోటీసులు ఇచ్చింది. ఇవి కేవలం నోటీసులు. పెన్షను తొలగించడం కాదు. ఆ నోటీసులకు వారు సంజాయిషీ ఇస్తే, నిబంధనలకు లోబడే తాము ఉన్నామని, తాము అన్ని రకాలుగా అర్హులమేనని చెప్పుకుంటే సరిపోతుంది. కానీ.. ఏదో పెన్షనర్లలో కోత పెడుతున్నట్టుగా పచ్చమీడియా నానా రాద్ధాంతం చేసింది. ఆ రచ్చను చూసి.. హఠాత్తుగా నిద్ర మేల్కొన్న పవన్ కల్యాణ్ మీరు పేదలను, వృద్ధులను ఆందోళనకు గురిచేస్తున్నారు. వారికి విచిత్రమైన నిబంధనలు పెడుతున్నారు.. అంటూ గుర్రుమంటున్నారు.
నిజానికి ఇవన్నీ కూడా ఇదివరకటి నుంచి ఉన్న నిబంధనలే. వాటి ఆధారంగా కొత్తగా కొందరికి నోటీసులు మాత్రమే ఇచ్చారు. ఇంటివిస్తీర్ణం ఎక్కువైందని, విద్యుత్తు బిల్లు పెరిగిందని పెన్షను రద్దుచేయడం పవన్ కల్యాణ్ కు విచిత్రంగా కనిపిస్తున్నదట. విద్యుత్తు బిల్లు 300 యూనిట్లు దాటితే పింఛను తొలగించాలనేది నిబంధన. ఇందులో విచిత్రం ఏం ఉన్నదో ఎవ్వరికీ అర్థం కాని సంగతి.
ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, గీజర్, మిక్సి లాంటి గృహఉపకరణాలన్నీ వాడినా కూడా అంత కరెంటు బిల్లు రాదు. ఏసీ ఉంటే తప్ప అంత బిల్లు రావడం అసాధ్యం. ఇంట్లో ఏసీ ఉండేవాళ్లను కూడా పేదల కింద పరిగణించి.. వారికి పెన్షన్లు ఇస్తూ పోతే.. ప్రభుత్వం చెబుతున్న పేదల సంక్షేమం అనే పదానికే అర్థం లేకుండా పోతుంది. కాబట్టి.. సంపన్నులను లబ్ధిదారులనుంచి తొలగించడానికి ఈ నిబంధనలను అప్పుడప్పడూ సమీక్షిస్తూ ఉండడం ప్రాసెస్ లో భాగం. అయితే ఈ వాస్తవాలేమీ తెలియకుండా పెన్షన్లు తీసేస్తున్నారో అంటూ యాగీ చేయడం పవన్ కు మాత్రమే చెల్లిన విద్య.
శ్రీకాకుళం జిల్లాలో కొందరు వృద్ధులకు వేల ఎకరాల భూములున్నట్టుగా, మరో వృద్ధురాలికి 158 ఇళ్లు ఉన్నట్టుగా నోటీసుల్లో పేర్కొన్నారని పవన్ ప్రస్తావించారు. అలాంటివి నోటీసులు జారీ చేయడంలో దొర్లిన పొరబాట్లు. నిజంగా పవన్ కల్యాణ్ ప్రతిపక్షనాయకుడిగా నిర్వర్తించవలసిన పాత్ర అది. అలాంటి పొరబాట్లను అధికార్ల దృష్టికి తీసుకువస్తే వారు సరిచేస్తారు. నిజానికి ఆయన అక్కర్లేదు, అలాంటి అసంబద్ధ గణాంకాలతో నోటీసులు అందిన వారు నేరుగా ఆశ్రయించినా వారికి న్యాయం జరుగుతుంది. అలాంటివి చెప్పాలే తప్ప.. అసలు నిబంధనలే కరెక్టు కాదు, అవి విచిత్రం అంటూ మాట్లాడితే.. ప్రభుత్వ పథకాలు, నిబందనలు, అర్హతల విషయంలో పవన్ కు తలాతోకా తెలియదని అనిపిస్తుంది.