ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఆ రకంగా అద్భుతమైన మార్కులే వేయించుకుంటున్నారు. కానీ.. జట్టుగా బరిలో ఉన్నప్పుడు ఒక్కడు ఆడితే సరిపోతుందా? కెప్టెన్ ఎంతటి టేలెంట్ ఉన్నవాడైనా, ఎంత కష్టపడి ఆడినా.. విజయాన్ని ఆ కష్టం నిర్దేశిస్తుందా? జట్టుమొత్తం నీరసించి పడుకుని ఉంటే.. ఫలితం ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిణామాలను గమనిస్తే అలాగే అనిపిస్తోంది.
పెన్షన్ల విషయంలో నిబంధనలను అమలుచేస్తూ.. కొందరికి నోటీసులు జారీచేసిన వైనం.. దానికి సంబంధించి రేగుతున్న దుమారంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చక్కగానే ప్రభుత్వనిర్ణయాన్ని సమర్థించగలుగుతున్నారు. మరి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ కూడా విపులంగా అర్థమయ్యేలా ప్రభుత్వ నిర్ణయం గురించి తెలియజెప్పాల్సిన పార్టీ శ్రేణులు ఏంచేస్తున్నాయి. నాయకులు ఎందుకు మొహం చాటేస్తున్నారు? కొందరు నాయకులు వ్యవస్థకంటె తమ వ్యక్తిగత ఓటు బ్యాంకు ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా ఎందుకు మూర్ఖంగా మాట్లాడుతున్నారు? అనే సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి.
పెన్షన్ పొందడానికి ఒక అర్హత ప్రమాణాలు ఉంటాయి. వెయ్యి అడుగులకు మించని ఇంటిలో ఉండడం, 300 యూనిట్లకు మించని కరెంటు వినియోగం అలాంటి నిబంధనల్లో కొన్ని. ఈ నిబంధనలు బాగా సంపన్నులను పెన్షన్ లబ్ధి నుంచి మినహాయించడానికి, తద్వారా నిజమైన పేదలకు ఎక్కువ మేలు జరిగేలా చూడడానికి ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు మాత్రమే. ఇక్కడ కీలకంగా గమనించాల్సిన మరో సంగతి ఏంటంటే.. ఈ నిబంధనలు ఇవాళ కొత్తగా వచ్చినవి కాదు. గతంలో కూడా ఉన్నాయి.
గతంలో కూడా ఇదే నిబంధనల మేరకు పెన్షన్లను ఆపు చేయడం అంటూ జరుగుతూ వస్తోంది. కానీ.. ఇప్పుడు పచ్చమీడియా దుష్టప్రచారం చేస్తోంది. నిబంధనలు అంటూ ఉన్న తర్వాత ఒక నిర్ణీత కాలవ్యవధిలో ఆ ప్రమాణాల మేరకు అర్హతలను సమీక్షించి ఉంచడమో తీసేయడమో ఖచ్చితంగా జరగాల్సిందే. అలాంటి ప్రయత్నంలోనే కొందరికి నోటీసులు ఇచ్చారు. తమకు ఇచ్చిన నోటీసులోని విషయాలు నిజం కాదని, అంత పెద్ద ఇల్లు లేదని, 300 యూనిట్ల కరెంటు ఎన్నడూ దాటలేదని నిరూపించుకుంటే వారి పెన్షనుకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఈ నిబంధనల్లో పార్టీలను బట్టి తొలగించడం అనేది లేనేలేదు. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీ ఓటర్లయినా సంక్షేమ పథకాలు అర్హులకు అంది తీరాల్సిందే అని జగన్ పలు సందర్భాల్లో చెప్పారు. అదే పాటిస్తున్నారు.
కానీ సహేతుకమైన ఈ నిబంధనల గురించి జగన్ పెద్ద పెద్ద సమావేశాల్లో మాట్లాడుతున్నారు గానీ.. ఈ వాస్తవాల్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాల్సిన పార్టీ కేడర్ పట్టించుకోవడం లేదు. పచ్చమీడియా ప్రచారానికే ప్రాచుర్యం లభిస్తోంది. నోటీసులు అన్నీ తొలగిస్తున్నట్టు కాదు. ఆ సంగతి కూడా ప్రచారానికి నోచుకోవడం లేదు. కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు ఈ భరోసాను లబ్ధిదారుల్లోనే కలిగించాలి. నాయకులు ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యపరచాలి. అలా జరగడం లేదు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి కొందరు ఎమ్మెల్యేలు నిబంధనలను, అందులో సహేతుకతను పట్టించుకోకుండా.. తొలగింపులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా గమనించకుండా.. నా నియోజకవర్గంలో ఒక్కటైనా తొలగించడానికి వీల్లేదు అని రంకెలు వేయడం మూర్ఖత్వం. ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుంది. ఇలాంటి పరిణామాలు గమనించినప్పుడే.. జగన్ సీఎంగా కెప్టెన్ ఇన్నింగ్స్ బాగానే ఆడుతున్నప్పటికీ.. టీమ్ ఫెయిలవుతోందని అనిపిస్తుంది.