వైఎస్సార్ జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలో బీజేపీకి టీడీపీ నాయకుడు అండగా నిలిచారు. బీజేపీ అభ్యర్థి పనతల సురేష్‌తో కలిసి ఆయనకు మద్దతుగా టీడీపీ బద్వేల్ నియోజకవర్గ నాయకుడు కర్ణాటి వెంకటరెడ్డి ప్రచారం నిర్వహించడం గమనార్హం. కాశినాయన మండలం నరసాపురం నివాసి, టీడీపీ నాయకుడు వెంకటరెడ్డి బద్వేల్ నియోజక వర్గంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నాయకుడు.
ఈయన తండ్రి శివారెడ్డి గతంలో మండలాధ్యక్షుడు. వెంకటరెడ్డి సతీమణి కర్ణాటి శ్వేతారెడ్డి ప్రస్తుతం కడప పార్లమెంట్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు. భార్య టీడీపీలో కీలక పదవిలో కొనసాగుతుండగా, భర్త వెంకటరెడ్డి బీజేపీతో అంటకాగడంపై బద్వేల్ నియోజకవర్గ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
బద్వేల్‌లో బీజేపీకి కార్యకర్తలు లేరు. దీంతో ఏజెంట్ల కోసం ఆ పార్టీ నానా యాతన పడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి గతంలో తన పరిచయాలను గుర్తు చేస్తూ టీడీపీ నాయకులను తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కేవలం ఏజెంట్లను పెట్టుకుంటే చాలు డిపాజిట్ దక్కించుకోవచ్చని ఆదినారాయణరెడ్డి పావులు కదుపుతున్నారు.
ఈ క్రమంలో బీజేపీ ఎరకు టీడీపీ నాయకుడు కర్ణాటి వెంకటరెడ్డి చిక్కినట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ తాయిళాలకు ఆయన తలొగ్గినట్టు బద్వేల్ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల వెంకటరెడ్డి ఇంటికి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వెళ్లి చర్చించారు.
ఆ చర్చలు సత్ఫలితాలను ఇచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థి సురేష్ వెంట వెంకటరెడ్డి ప్రచారం నిర్వహిస్తుండడం విశేషం. వెంకటరెడ్డి భార్య శ్వేతారెడ్డి మాత్రం టీడీపీలోనే కొనసాగుతుండడం గమనార్హం. వెంకటరెడ్డి వ్యవహారంపై టీడీపీ అధిష్టానం ఏమంటుందో మరి!