జనసేనాని పవన్‌కల్యాణ్ తీరుపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అంతిమంగా బీజేపీ-జనసేన కూటమి రాజకీయంగా లాభపడేలా పవన్‌కల్యాణ్‌తో నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారా? అనే కోణంలో టీడీపీ ఆలోచిస్తోంది. నిజానికి గతంలో మోడీ విధానాలకు ఆకర్షితుడినై బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు పవన్‌కల్యాణ్ ప్రకటించారు. అయితే బీజేపీతో టీడీపీ పొత్తు కుదుర్చుకోవడం వల్ల 2014లో పవన్‌కల్యాణ్ ప్రచారం చంద్రబాబు సీఎం కావడానికి దోహదపడింది.
2019లో బీజేపీ, టీడీపీలతో పవన్‌కల్యాణ్ విభేదించారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మళ్లీ ఆయన బీజేపీకి దగ్గరయ్యారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అనంతరం బీజేపీకి దూరమవుతున్నారనే ప్రచారం బలంగా జరుగుతోంది. అలాగని టీడీపీతో పవన్‌కల్యాణ్ చెట్టపట్టాలేసుకుని తిరగడం లేదు. తాజాగా విశాఖ ఉక్కు ఉద్యమానికి పవన్‌కల్యాణ్ మద్దతు ప్రకటించారు.
ఈ నెల 31న స్టీల్ ప్లాంట్ వద్ద ఉక్కు పరిరక్షణ సమితి ప్రతినిధులు నిర్వహించే సభలో పవన్‌కల్యాణ్ పాల్గొననున్నారు. ఈ సభలో పవన్ ఏం మాట్లాడ్తారనే అంశంపై ఉత్కంఠ నెలకుంది. ఎందుకంటే జనసేన మిత్రపక్షమైన బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు శరవేగంగా పనిచేస్తోంది. కార్మికులకు అండగా నిలవాలంటే, మోడీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి. ఆ పని పవన్ చేయగలరా?
టీడీపీ అనుమానం ఏంటంటే… పవన్ మాత్రం మంచివాడనిపించుకుని, రానున్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా రాజకీయంగా లాభం పొందుతారని. ఇదంతా పవన్ వెనక బీజేపీ ఉండి ఆడిస్తున్న నాటకమని టీడీపీ అంతర్గత సంభాషణల్లో వెల్లడవుతున్న అభిప్రాయాలు. తమపై వ్యతిరేకతను తగ్గించుకునేందుకు పవన్‌ను బీజేపీ రక్షణ కవచంగా వాడుకుంటోందనేది టీడీపీ ఆరోపణ.
పవన్‌ను గుడ్డిగా నమ్మితే మరోసారి మోసపోతామనే ఆందోళన టీడీపీలో నెలకుంది. పవన్ నమ్మదగిన నాయకుడు కాదనేది టీడీపీ ముఖ్య నేతల అభిప్రాయం. అందుకే విశాఖ ఉక్కు ఉద్యమంలో పవన్ అడుగులను టీడీపీ జాగ్రత్తగా గమనిస్తోంది.