బూతు కూతలు కూయడం ఎందుకు? ఆ తర్వాత ప్రాణభయంతో ద్వీపాంతర యాత్రలెందుకు? అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ ట్రోలింగ్ ఎవరి గురించో అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను దూషించిన కేసులో జైలు నుంచి విడుదలైన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి… విజయవాడలోని తన ఇంటికి కూడా రాకుండానే మాల్దీవులకు పలాయనం చిత్తగించారు. దీన్ని బట్టి ఆయన ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. తప్పు చేసినప్పుడే మనిషిలో భయం పుడుతుందనే సంగతి తెలిసిందే.
ప్రశాంతత కోసం కొన్నిరోజులు విహారయాత్రకు తీసుకెళ్లాలని భార్య చందన ఆయనను కోరినట్టు ఎల్లో మీడియా ఓ వాదనను తెరపైకి తెచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవులకు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. తనకు తానుగా ప్రశాంతతను విచ్ఛిన్నం చేసుకునే దుందుడుకుతనం పట్టాభి సొంతం. ఇలాంటి వాళ్లకి జీవితంలో ఎప్పుడైనా ఇబ్బందులు తప్పవు. సీఎంను బోసడికే అంటూ తీవ్ర అభ్యంతరకర భాషలో నోరు పారేసుకోవడంపై చంద్రబాబు మొదలుకుని ఎల్లో గ్యాంగ్ అంతా సమర్థించిన సంగతి తెలిసిందే.
బోసడికే అనే బూతు పదానికి ఎల్లో బ్యాచ్ అనేక అర్థాలను తెరపైకి తెచ్చింది. బాగున్నారా, పాడై పోవడం …తదితర అర్థాలని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. మరి ముఖ్యమంత్రిని అంత ప్రేమగా పట్టాభి పిలిచి ఉంటే…. జైలు నుంచి విడుదల కాగానే మాల్దీవులకు పంపాల్సిన అవసరం ఏంటి? సీఎంపై ప్రయోగించిన బూతు మాట ఎంత ఘోరమైందో పట్టాభి మాల్దీవులకు పలాయనం చిత్తగించడమే నిదర్శనం.
కొంచెం అటుఇటుగా సీఎం, వైసీపీ నేతలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా అవాకులు చెవాకులు పేలుతున్నారని పౌర సమాజం గుర్తు చేస్తోంది. ఈయన తన నియోజకవర్గం మొహం చూడక ఎన్ని నెలలవుతున్నదో ఆయనే మరిచిపోయి వుంటారు. రకరకాల సమీకరణలతో వైసీపీ తరపున టికెట్ తెచ్చుకుని, జగన్ పుణ్యమా అని గెలుపొందిన రఘురామ… ఆ తర్వాత అధినేతపైనే నోరు పారేసుకోవడం నిత్యకృత్యమైంది.
చివరికి తన సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లలేని దుస్థితి. ఒక ప్రజా ప్రతినిధికి ఇంతకంటే శిక్ష, సిగ్గుచేటు మరేదైనా ఉందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా ఒక బతుకేనా? అని ప్రశ్నించే వాళ్లు లేకపోలేదు. సీఎంపై అవాకులు చెవాకులు పేలడం పెద్ద సమస్య కాదు. ఆ తర్వాత సొంతూళ్లో మనుగడ సాగించడం గొప్ప. ఆ పని చేయలేక పోతున్నారంటే… తామెంత తప్పు చేస్తున్నామో నోటి దురుసు ప్రదర్శిస్తున్న నేతలు ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది!