30 శాతం తగ్గిన ఆర్ఆర్ఆర్ మార్కెట్ విలువ?

ఇండియాలోనే అతిపెద్ద మూవీగా వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి మార్కెట్ రేట్లను సవరించారు. మరీ ముఖ్యంగా ఆంధ్రా ఏరియాలో ఆర్ఆర్ఆర్ మార్కెట్ విలువను 30శాతానికి అటుఇటుగా కుదించారు. ఏపీలో టిక్కెట్ రేట్లు, కరోనా తర్వాత…

ఇండియాలోనే అతిపెద్ద మూవీగా వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి మార్కెట్ రేట్లను సవరించారు. మరీ ముఖ్యంగా ఆంధ్రా ఏరియాలో ఆర్ఆర్ఆర్ మార్కెట్ విలువను 30శాతానికి అటుఇటుగా కుదించారు. ఏపీలో టిక్కెట్ రేట్లు, కరోనా తర్వాత మారిన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబాలు థియేటర్లకు రాకపోవడం కూడా ఈ నిర్ణయం వెనక ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఆంధ్రా, సీడెడ్ లో ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. ఉదాహరణకు ఈస్ట్ ఏరియానే తీసుకుంటే 18 కోట్ల రేషియోలో డీల్ సెట్ అయింది. ఇప్పుడు దీన్ని 13 కోట్ల రూపాయలకు తగ్గించారు. అటు ఉత్తరాంధ్ర ఏరియాకు సంబంధించి ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ రైట్స్ ను 26 కోట్ల రూపాయలకు తీసుకున్నారు. మారిన పరిస్థితుల వల్ల అంత బ్రేక్ ఈవెన్ అవుతుందనే నమ్మకం ఎవ్వరికీ లేదు. దీంతో ఆ మొత్తాన్ని కూడా 19 కోట్ల రూపాయలకు కుదించారు.

ఓవరాల్ గా ఆంధ్ర+సీడెడ్ కలిపి 98 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరగగా.. ఇప్పుడా మొత్తాన్ని 68 కోట్ల రూపాయలకు తగ్గించుకున్నారు మేకర్స్. నైజాం బిజినెస్ లో ఎలాంటి మార్పుల్లేవు. ఓవర్సీస్ ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎమౌంట్ ను కాస్త తగ్గించమంటున్నారు. దానిపై ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. నాన్-థియేట్రికల్ డీల్స్ లో ఎలాంటి మార్పుల్లేవు.

కేవలం ఆర్ఆర్ఆర్ సినిమాపైనే కాదు.. ఆంధ్ర ఎఫెక్ట్ దాదాపు మిగతా అన్ని పెద్ద సినిమాలపై పడింది. పుష్ప, అఖండ, ఆచార్య సినిమాలు కూడా ఇంతకుముందు కుదుర్చుకున్న బిజినెస్ ఒప్పందాల్ని మరోసారి సమీక్షించుకుంటున్నాయి.

ఇక సినిమా అప్ డేట్స్ విషయానికొస్తే.. ఆర్ఆర్ఆర్ కు సంబంధించి రఫ్ ఎడిట్ సిద్ధమైంది. ఈ నిడివి దాదాపు 3 గంటలు వచ్చింది. దీన్ని 2 గంటల 45 నిమిషాలకు కుదించాలని నిర్ణయించారు. అంటే ఆర్ఆర్ఆర్ రన్ టైమ్ అటుఇటుగా 2 గంటల 45 నిమిషాలు ఉండబోతోందన్నమాట. ఇక దీపావళికి ఈ సినిమా నుంచి మరో టీజర్ రాబోతోంది. 29న టీజర్ ఎనౌన్స్ మెంట్ ప్రకటన రానుంది. దీపావళి టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే ఉంటుంది. ఎలాంటి డైలాగ్స్ ఉండవు.

వచ్చే నెల నుంచి ఈ సినిమా ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నారు. ముంబయి, పూణె, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చిన్ లాంటి కీలకమైన నగరాల్లో ఓ రౌండ్ ప్రచారం పూర్తి చేయాలనుకుంటున్నారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ సినిమా బడ్జెట్ 400 కోట్ల రూపాయలు.