చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. తన స్వగ్రామం, సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో వైసీపీ తరపున వరుసగా రెండుసార్లు చెవిరెడ్డి గెలుపొందడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకున్నారు. 2014లో టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి గల్లా అరుణను చెవిరెడ్డి ఓడించి అందరి దృష్టి ఆకర్షించారు. 2019కి వచ్చే సరికి చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి మారారు. ఆ పార్టీ తరపున పులపర్తి వెంకట మణిప్రసాద్ (నాని) నిలబడ్డారు.
ఈ దఫా చెవిరెడ్డి మెజార్టీ అనూహ్యంగా పెరిగింది. ఏకంగా 41,755 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థిపై చెవిరెడ్డి గెలుపొందారు. 2024లో సార్వత్రిక ఎన్నికలను టీడీపీ చావుబతుకుల సమస్యగా పరిగణిస్తోంది. దీంతో ప్రతి నియోజకవర్గంలోనూ గెలుపే ప్రామాణికంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని ఇప్పటి నుంచే టీడీపీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రగిరిపై టీడీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఇందులో భాగంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నానీని మార్చి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలో దింపాలని టీడీపీ ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. తిరుపతి రూరల్‌లో రెడ్డి సామాజిక వర్గంలో బలమైన పట్టున్న దివంగత తిరుపతి మాజీ ఎమ్మెల్యే కుమారుడిని బరిలో నిలపాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. సదరు నాయకుడు తిరుపతి సీటు కావాలని అడగ్గా అది బలిజ సామాజిక వర్గానికే కేటాయిస్తామని స్పష్టం చేసినట్టు సమాచారం.
గతంలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తిరుపతి రూరల్ ఉండేది. అప్పట్లో పలు దఫాలు తిరుపతి ఎమ్మెల్యేగా కొనసాగిన కుటుంబానికి చెందిన వ్యక్తికి, తిరుపతి రూరల్‌తో పాటు చంద్రగిరి నియోజకవర్గంలోని రెడ్ల కుటుంబాలతో సన్నిహిత సంబంధాలున్నాయని టీడీపీ భావిస్తోంది.
టీడీపీ సంప్రదాయ ఓట్లకు రెడ్ల ఓట్లు తోడైతే చంద్రగిరిలో సులువుగా గెలుపొందొచ్చని టీడీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరి ఈ వ్యూహం ఎన్నికల నాటికి ఏ మలుపు తిరుగుతుందో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.