కాపులంటే కాంగ్రెస్ కి అంత కామెడీ అయిపోయారా..?

ఆలూ లేదు, చూలూ లేదు అల్లుడు పేరు సోమలింగం.. ఇది పాత సామెత. ఓటు లేదు, సీటు లేదు.. కాపు నాయకుడే సీఎం. ఇదీ ఏపీలో కాంగ్రెస్ కొత్త మాట. అవును, 2024 ఎన్నికలకు…

ఆలూ లేదు, చూలూ లేదు అల్లుడు పేరు సోమలింగం.. ఇది పాత సామెత. ఓటు లేదు, సీటు లేదు.. కాపు నాయకుడే సీఎం. ఇదీ ఏపీలో కాంగ్రెస్ కొత్త మాట. అవును, 2024 ఎన్నికలకు వెళ్లే ముందు ఏపీ కాంగ్రెస్ తమ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా ఓ మచ్చలేని కాపు నాయకుడి పేరు ప్రకటిస్తుందట. ఆ మేరకు అధిష్టానానికి ప్రతిపాదన కూడా వెళ్లింది. 

ఇక అక్కడి నుంచి ప్రకటన రావడమే తరువాయి, ఏపీలోని కాపు నాయకుల్లో సీఎం కావాలని అనుకుంటున్న ఔత్సాహికులంతా కాంగ్రెస్ పెద్దల వద్ద లాబీయింగ్ చేసుకోవాలన్నమాట. ఇంతకంటే కామెడీ ఇంకోటి ఉందా..?

అసలు కాపులంటే కాంగ్రెస్ కి ఎలా కనిపిస్తున్నారు. ఏపీలో జీవచ్ఛవంలా ఉన్న కాంగ్రెస్.. కాపు బలంతో ఓట్లు, సీట్లు సంపాదించాలనుకుంటుందా..? కాపుల ఓట్ల కోసం ఓవైపు బీజేపీ, జనసేన పోట్లాడుకుంటే.. మధ్యలో కాంగ్రెస్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటుందా..? గతంలో ఏపీలో రెడ్డి కాంగ్రెస్ అని పేరుపడిన ఆ పార్టీ ఇప్పుడు కాపు కాంగ్రెస్ గా మారాలనుకుంటుందా..? అసలీ ప్రతిపాదనతో ఏపీలో చచ్చిపోయిన కాంగ్రెస్ మళ్లీ ప్రాణం పోసుకుంటుందా..?

కాపులను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడుతుందని మాజీ ఎంపీ చింతా మోహన్ ప్రకటించారు. ఈమేరకు అధిష్టానం కూడా ఆలోచిస్తోందని సెలవిచ్చారు. ఆయన మాటల్ని, కాంగ్రెస్ పార్టీని ఎవరూ లెక్కలోకి తీసుకోకపోయినా.. అసలు కాపులంటే ఆయా పార్టీలకు ఎంత అలుసైపోయారో.. వారి ఓట్లంటే వారికి ఎంత అవసరమైపోయాయో అర్థమవుతుంది.

అవసరానికి వాడుకునేవారే తప్ప..

చంద్రబాబు హయాంలో కాపులను రాజకీయ అవసరాలకు వాడుకున్నారే తప్ప వారికి సరైన గుర్తింపు ఇవ్వలేదు. కాపు రిజర్వేషన్లను కూడా రాజకీయ స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు. అదే విషయంలో జగన్ రిజర్వేషన్లు ఇవ్వలేమని తెగేసి చెప్పినా, మంత్రి మండలిలో కాపులకు సరైన గుర్తింపు ఇచ్చి అండగా నిలిచారు. 

ఇక ఇప్పుడు కొత్తగా కాపు ఓట్ల కోసం బీజేపీ, జనసేన పాకులాడుతున్నాయి. ఏకంగా కాపు మంత్రుల్నే దూషిస్తూ.. కాపుల ఓట్ల కోసం పవన్ కల్యాణ్ ఆశపడుతున్నారు. సరికొత్తగా కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాపు నాయకుడిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామంటూ కామెడీ చేస్తోంది.