ఎమ్బీయస్‌: వేధింపులా? కర్తవ్యనిర్వహణా?

ప్రభుత్వం నడిచేటప్పుడు ఎంతో కొంత అవినీతి జరగక మానదు. దాన్ని ప్రతిపక్షం కొండంతలు చేసి అల్లరి చేస్తుంది. ఆ ఆరోపణలు నమ్మో, లేక పరిపాలనతో విసిగిపోయో ప్రజలు ప్రతిపక్షాన్ని గద్దె మీద కూర్చోబెడతారు. ప్రతిపక్షం…

ప్రభుత్వం నడిచేటప్పుడు ఎంతో కొంత అవినీతి జరగక మానదు. దాన్ని ప్రతిపక్షం కొండంతలు చేసి అల్లరి చేస్తుంది. ఆ ఆరోపణలు నమ్మో, లేక పరిపాలనతో విసిగిపోయో ప్రజలు ప్రతిపక్షాన్ని గద్దె మీద కూర్చోబెడతారు. ప్రతిపక్షం తన గతంలో చేసిన ఆరోపణలపై విచారణ చేయడం మొదలుపెట్టగానే మాజీ అధికారపక్షం, ప్రస్తుత ప్రతిపక్షం అయిన పార్టీ దీన్ని రాజకీయపరమైన వేధింపుగా చిత్రీకరిస్తుంది. అధికారంలోకి వచ్చిన పార్టీ 'చట్టం తన పని చేసుకుపోతోంది' అంటుంది. తమ ప్రయోజనాల బట్టి పని చేసే మీడియా ఏదో ఒక పక్షాన్ని బలపరుస్తుంది. ఏది నిజమో, ఏది కాదో తెలియక ప్రజలు గందరగోళానికి గురవుతారు. కొందరు మేధావులు, పరిశీలకులు 'ప్రజలకు చేయవలసిన పనులు అనేక వుండగా అవన్నీ మానేసి, ప్రభుత్వం పాతవి తవ్వడంలో కాలక్షేపం చేస్తోంది' అని వ్యాఖ్యానిస్తూ ఉంటారు.

మొదటగా మనం తేల్చుకోవలసినది గత తప్పిదాలపై విచారణ చేయాలా వద్దా అని. వీళ్లు విచారణ చేయించకపోతే గతంలో ఉత్తుత్తినే ఆరోపణలు చేశామని ఒప్పుకున్నట్లేగా! ప్రతిపక్షంలో ఉండగా, ఎన్నికల సమయంలో 'ప్రభుత్వం చేసిన అవినీతిని బయటపెట్టి, వాళ్లు మింగిన ప్రభుత్వధనాన్ని కక్కించి ఖజానాకు జమ చేయిస్తాం' అని హామీలు గుప్పించి, యిప్పుడు దాని గురించి ఏమీ చేయకపోవడం పొరపాటే కదా! విచారణ చేయించడం ప్రభుత్వ కర్తవ్యంలో భాగం అనుకోవాలి, ప్రజల పట్ల బాధ్యత నిర్వర్తిస్తున్నారని అనుకోవాలి. అయితే ప్రజలు ఎక్కడ నిరుత్సాహ పడతారంటే ఆ విచారణ చప్పున ముగియదు. దాంతో విషయం లేకుండానే కేసు పెట్టారన్న భావం కలుగుతుంది వారికి.

ఇక్కడ గ్రహించవలసిన దేమిటంటే – అధికారంలో ఉన్న నేతలను కేసుల్లో పట్టుకోవడం అంత సులభమేమీ కాదు. ఎందుకంటే వాళ్లు తమకు కావలసినవన్నీ అధికారుల చేత చేయిస్తారు. ఫైళ్ల మీద అధికారుల సంతకాలే ఉంటాయి. ఏదైనా అర్జీ రాగానే ప్లీజ్‌ డిస్కస్‌ అనో, మే బీ కన్సిడర్‌డ్‌ అనో మంత్రుల నోట్‌ ఉంటుంది. 'అన్ని విషయాలూ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోమని అధికారులకు ఆదేశమిచ్చాను, అన్నీ ఆలోచించి వాళ్లు అంతిమంగా చేసిన సూచనను అంగీకరించాను.' అని తప్పుకుంటారు వాళ్లు. తనే నిర్ణయం తీసుకున్న సందర్భాల్లో కూడా 'ఆ పరిస్థితుల్లో అదే సబబైన నిర్ణయంగా తోచింది' అంటే కాదనడం కష్టం. పర్శనల్‌ డిస్క్రెషన్‌ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఒకే సమస్యపై మీకు తోచే పరిష్కారం వేరు, నాకు తోచే పరిష్కారం వేరు అవుతుంది. నీకెందుకు అలా తోచింది అని అడగలేము.

ఆంధ్ర ప్రభుత్వం చేసుకున్న పవన విద్యుత్‌ ఒప్పందాలున్నాయి. టెక్నాలజీ పెరుగుతూ, ధరలు తగ్గుతూ వస్తున్న యీ రోజుల్లో పాతికేళ్ల దీర్ఘకాలానికి ఒకే రేటు యిస్తామని రాసుకోవడమేమిటి? అని వైసిపి ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. దానికి సమాధానం చెప్పకుండా టిడిపి 'ఆ ఒప్పందాలను మీరు రద్దు చేయలేరు' అంటోంది. దానితో భాగస్వామిగా చాలా ఏళ్లున్న బిజెపి 'అవును రద్దు చేస్తే డొక్క చీలుస్తాం' అంటోంది. టెక్నికల్‌గా ఆ ఒప్పందాన్ని రద్దు చేయడానికి కోర్టులు కూడా అంగీకరించక పోవచ్చు. అది వేరే విషయం. దీనిపై వైసిపి కేసు పెడితే 'అసలు పాతికేళ్లకు అంత అధిక రేటుకి ఎందుకు రాసుకున్నారు?' అని టిడిపి మంత్రిని రేపు ఏ కోర్టయినా అడిగితే 'పోనుపోను రేటు పెరుగుతుందని నా వ్యక్తిగత అంచనా' అని జవాబు వస్తే ఎవరూ ఏమీ చేయలేరు. ఎందుకలా భావించావు? అని అడిగే వీలులేదు.

అలాటి అంచనాకు రావడానికి లంచం తీసుకున్నాడు, ఏదో వ్యక్తిగతమైన లబ్ధి పొందాడు అని నిరూపించ గలిగినప్పుడే కేసు నిలుస్తుంది. కానీ లంచం యిచ్చినట్లు రుజువులు ఎలా వస్తాయి? లోకేశ్‌పై తను చేసిన ఆరోపణలను నిరూపించమని పవన్‌ కళ్యాణ్‌ను అడిగినప్పుడు అతను 'లంచాలకు రసీదు యిస్తారా?' అని అడిగాడు. ఇచ్చినవాడు ఒప్పుకోడు. పుచ్చుకున్నవాడు  రుజువు అడుగుతాడు. లంచాలకు ఆడియో, వీడియో సాక్ష్యాలుండవు. రేవంత్‌ రెడ్డి కేసులో లాగ వీడియో సాక్ష్యం దొరికినా, అసలు సూత్రధారి తప్పించుకోవచ్చు. మంత్రికి లంచం యిచ్చాడంటే డైరక్టుగా యిచ్చాడని కాదు, అతని పిఏకో, బావమరిదికో, అనుచరుడికో యిస్తారు. అలా యిచ్చినట్లు నిరూపించినా, దానికీ ఫలానా ఫైలు మీద సంతకానికీ సంబంధం ఉందని నిరూపించడం ఎలా? తీసుకున్నవాడు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి దడుస్తాడు.

ప్రభుత్వం మారినప్పుడు సాధారణంగా కొన్ని కీలకమైన ఫైళ్లు మాయమయి పోతూ ఉంటాయి. వేరే డిపార్టుమెంటుకు చేరి అక్కడ సమాధి అయిపోతూంటాయి. విచారణకు వచ్చే సమయానికి అధికారులు రిటైరయిపోతూ ఉంటారు, వేరే సర్వీసుకి వెళ్లిపోతూ ఉంటారు. విచారణకు పిలిస్తే మర్చిపోయామంటారు. ఫైళ్లు చూడందే గుర్తు రాదంటారు. మినహాయింపులు యిచ్చేందుకు రూల్సు ప్రకారం తమకు అధికారం ఉందంటారు. ఇలాటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడ్డారని రుజువు చేయడం కష్టం. అందుకనే స్వాతంత్య్రం వచ్చిన యిన్ని దశాబ్దాలలో అవినీతికై శిక్ష పడిన నాయకులు అతి తక్కువ. వాళ్ల ఆస్తులు జప్తు చేసిన సందర్భాలు అంతకంటె తక్కువ. అయినా నాయకులు ఆ మేరకు హామీలు గుప్పిస్తూనే ఉంటారు.

కొన్ని సందర్భాల్లో ఇర్రెగ్యులారిటీల విషయంలో దొరుకుతారు. కోడెల కుమారుడి మోటార్‌బైక్‌ షో రూం సంగతే చూద్దాం. అమ్మిన 576 బైకులపై లైఫ్‌ టాక్సు , రిజిస్ట్రేషన్‌ ఫీ ఎగ్గొట్టాడాతను. ఎగ్గొట్టిన్నంత కాలం కళ్లు మూసుకున్న రవాణా శాఖ ప్రభుత్వం మారాక 41 లక్షల పన్నుతో బాటు కోటి రూ.ల జరిమానా కూడా   కట్టాలంది. విధిలేక అతను కట్టాడు. అంటే తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లేగా! అలా యిప్పటి ప్రభుత్వం ఖజానాకు 1.41 కోట్ల రూ.ల ఆదాయాన్ని సమకూర్చింది. కానీ దాన్ని ప్రతిపక్షం వేధింపుగా చిత్రీకరిస్తుంది. అదీ దౌర్భాగ్యం. ఇన్నాళ్లూ ఎందుకు వసూలు చేయలేదు అని రవాణా శాఖ అధికారులనో, ఆ శాఖకు అప్పటి మంత్రినో సంజాయిషీ అడిగితే, యిక చెప్పనే అక్కరలేదు – గోలగోల అయిపోతుంది.

అన్ని కేసులూ యిలా వుండవు. లంచం తిన్నారని తెలుసు, కానీ రుజువు చేయడం కష్టం. అయినా వాళ్ల మీద కేసు మోపి, జైలుకి పంపాలనే కక్ష ఉంటుంది. తమిళనాడులో జయలలిత, కరుణానిధి వ్యవహారం అలాటిదే. కరుణానిధి, ఎంజీఆర్‌ ఒకరి మీద మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకుని రాజకీయ లబ్ధి పొందారు. కానీ జైళ్లకు పంపుకోలేదు. జయలలిత దగ్గరకు వచ్చేసరికి అలాటి కక్ష సాధించుకున్నారు. చివరకు జయలలిత కొంతకాలం జైల్లో ఉండి వచ్చి, చనిపోయే దశలో కోర్టు నుంచి ఊరట పొందింది. కరుణానిధి అయితే అన్నాళ్లు జైల్లో ఉండకుండా తప్పించుకున్నాడు. అతని కూతురు మాత్రమే జైలుపాలైంది.

సోనియా జగన్‌కు బుద్ధి చెప్పాలనుకుంది. కేసులు పెట్టించి 16 నెలలు జైల్లో పెట్టించింది. అవి యిప్పటిదాకా రుజువు కాలేదు. ఆధారాలు చాలక కేసులు వీగిపోతున్నాయి. అంటే బలమైన ఆధారాలు దొరికే వరకు ఆగకుండానే సోనియా తొందర పడిందన్నమాట. కేసులు పెట్టడంతో ఆగలేదు, బయట ఉంటే సాక్ష్యాలు తారుమారు చేస్తాడంటూ జైల్లో కూర్చోబెట్టింది. ఆ స్థాయి మనుషులు జైల్లో కూర్చున్నా సాక్షులను ప్రభావితం చేయగలరన్న సంగతి కోర్టులకు ఎందుకు తట్టదో నాకు అర్థం కాదు. ఇప్పుడు శుక్రవారం కోర్టుకి హాజరీ విషయంలో సిబిఐ వింత వాదనలు చేస్తూ ఉంది. శుక్రవారం కోర్టుకి రాకపోతే సాక్షులను ప్రభావితం చేస్తాడట! అంటే మిగతా రోజుల్లో చేయడా?

ఇప్పుడు చిదంబరం విషయంలో కూడా సిబిఐ అలాటి వాదనే చేస్తూ బెయిలు రాకుండా చేస్తోంది. కేంద్రంలో అనేక ముఖ్య పదవులు నిర్వహించిన చిదంబరం సాక్షులను తిప్పుకోవడానికి స్వయంగా వెళ్లాలా? కాకి చేత కబురు పెట్టి పని జరిగేట్లు చేయలేడూ? మామూలు రౌడీలే బెదిరించడానికి స్వయంగా వెళ్లరు.  'అన్న చెప్పమన్నాడు' అని ఎవడినో పంపించి చెప్పిస్తారు. అలాటిది వీళ్లు చేయలేరా? అందరికీ తెలుసు – ఇష్రత్‌ జహాన్‌ కేసులో అమిత్‌ షాను గతంలో చిదంబరం జైలుపాలు చేశాడు కాబట్టి యిప్పుడు అమిత్‌ బదులు తీర్చేస్తున్నాడని! జగన్‌కు అలాటి ఛాన్సు వస్తే సోనియాను పంపడం ఖాయం. సోనియా దిల్లీ స్థాయి మనిషి కాబట్టి, కనీసం ఆమెకు సహకరించిన బాబునైనా జైలుకి పంపాలని జగన్‌ ఉవ్విళ్లూరుతూ ఉండవచ్చు. అందుకే వచ్చిన దగ్గర్నుంచీ ప్రతీ పాత ఫైలును భూతద్దం వేసి చూస్తూండవచ్చు.

నిజంగా ఏదైనా దొరికి, శిక్ష పడేట్లు చేయగలిగితే సరే, కోడెల కుమారుడి విషయంలోలా సొమ్ము రాబట్టగలిగితే మహ బాగు. కానీ ఏదీ దొరక్కుండా ఉత్తినే కసి తీర్చుకోవడానికి జైలుకి పంపితే మాత్రం చాలా తప్పు. ఎందుకంటే యిలాటి వ్యక్తిగత కావేషాల చేత ప్రజాధనం వ్యర్థమౌతోంది. జగన్‌ విషయమే తీసుకుంటే సిబిఐ విచారణ ఖర్చు, కోర్టు విచారణ ఖర్చు, జైల్లో 16 నెలలు ఉంచిన ఖర్చు, యిదంతా మన దగ్గరే కదా రాబట్టారు! నిందితుడికి శిక్ష పడితే ఆ వ్యయానికి ఒక అర్థముంటుంది. లేకపోతే కక్ష వాళ్లది, ఖర్చు మనది అవుతుంది. ఇప్పుడు తాజాగా నడుస్తున్న చిదంబరం కేసే తీసుకుందాం. చిదంబరం సచ్ఛీలుడని నేనెంత మాత్రం అనను, అనుకోను. కానీ అతనిపై కేసు నిరూపించే అవకాశం ఉందా అన్నదే నా చింత.

అతను స్వయంగా లాయరు. ఉపద్రవమైన తెలివితేటలున్నవాడు. పుట్టుకతోనే ధనికుడు. తన ప్రాక్టీసు ద్వారా విపరీతంగా ఆర్జించాడు. అనేక ప్రభుత్వాలలో పని చేసి, నెగ్గుకు వచ్చాడు. పొరబాటుగా సంతకం పెట్టి దొరికిపోతాడంటే నమ్మబుద్ధి కాదు. సిబిఐ కేసు – ఐఎన్‌ఎక్స్‌ మీడియా విషయంలో అక్టోబరు 18న సిబిఐ చిదంబరం, కార్తీ, కార్తీ ఆడిటరు, పీటర్‌ ముఖర్జీతో సహా 14 మందిపై కేసు పెట్టింది. అప్రూవర్‌గా మారిన ఇంద్రాణీ ముఖర్జీని వదిలేసింది. పీటర్‌ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీలకు చెందిన ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థ 2007లో విదేశీ పెట్టుబడులు తెచ్చుకోవడానికి, ఆ పెట్టుబడులలో రూ.40.91 కోట్లను ఐఎన్‌ఎక్స్‌ న్యూస్‌ అనే సహచర సంస్థకు మళ్లించదలచుకుంది.

అలా తెచ్చుకోవడానికి, అటువంటి మళ్లింపుకి ఎఫ్‌ఐపిబి (ఫారిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్‌) అనుమతి యిచ్చింది. అది అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం అజమాయిషీలో పని చేస్తుంది. ఈ అనుమతి రావడానికి, ఐఎన్‌ఎక్స్‌ మీడియా 2008లో నాలుగు కంపెనీలకు రూ.3.20 కోట్లు చెల్లించడానికి (?) లింకు ఉందని సిబిఐ అభియోగం. అతని కొడుకు కార్తీకి ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం ఉన్న అడ్వాంటేజ్‌ స్ట్రాటజిక్‌ కన్సల్టింగ్‌ ప్రై.లి. (ఎఎస్‌సిపిఎల్‌), దాని సింగపూరు విభాగం, నార్త్‌ స్టార్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రై.లి., గ్రీసుకి చెందిన జెబెన్‌ ట్రేడింగ్‌ లి. అనే కంపెనీలకు యీ సొమ్ము ముట్టిందని సిబిఐ అంటోంది. దాన్ని కన్‌ఫమ్‌ చేసుకోవడానికి విదేశాలకు లెటర్‌ రొగేటరీ పంపింది కానీ యింకా జవాబు రాలేదు. అంటే ప్రస్తుతానికి చాలినన్ని ఆధారాలు లేవన్నమాట. అయినా చిదంబరానికి జైలువాసం ప్రాప్తించిందన్నమాట.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా 2007 మార్చిలో తమకు మారిషస్‌కు చెందిన మూడు కంపెనీల నుంచి ఎఫ్‌డిఐ (విదేశీ పెట్టుబడులు) వస్తున్నాయని, దానికి అనుమతించమని ఎఫ్‌ఐపిబికి అప్లికేషన్‌ పెట్టుకుంది. డ్యునియర్న్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, న్యూ సిల్క్‌ రూట్‌, న్యూ వెర్నాన్‌ ప్రైవేట్‌ ఈక్విటీ లి. అనే ఆ మూడు కంపెనీలకు ఆ పెట్టుబడులకు గాను తమ కంపెనీ నుంచి 14.99 లక్షల ఈక్విటీ షేర్లను షేరు ధర రూ.10 చొ.న యిస్తానని తెలిపింది. కానీ అంతిమంగా షేర్లను రూ.862.15ల ప్రీమియంతో విడుదల చేసింది. సిబిఐ అనేదేమిటంటే – పైకి రూ.4.62 కోట్లు మాత్రమే వచ్చినట్లు చూపినా, అసలు వచ్చినది రూ.403.07 కోట్లని! ఎఫ్‌ఐపిబి అనుమతి యిస్తూ ఆ నిధులు ఐఎన్‌ఎక్స్‌ న్యూస్‌కు మళ్లించడానికి వేరే అభ్యర్థన పెట్టుకోమని సూచించింది. ఆ అనుమతిలో వస్తున్న విదేశీ పెట్టుబడుల మొత్తమెంతో చెప్పకుండా 'కంపెనీ యొక్క జారీ చేసిన ఈక్విటీ షేర్లలో 46.2%' అని మాత్రం పేర్కొన్నారు. అయినా చిదంబరం ఆ ఫైలుపై సంతకం చేశాడు.

ఐఎన్‌ఎక్స్‌ న్యూస్‌కు అక్రమంగా నిధులు వచ్చాయని, ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై 300% జరిమానా వేయాలని, కొందరు మీడియా ప్రతినిథులు 2008లో ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆయన డిపార్ట్‌మెంటు ఆఫ్‌ రెవెన్యూకు దాన్ని పంపించాడు. అదే సమయంలో ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో పని చేసి ముఖర్జీలతో విభేదించిన వీర్‌ సంఘ్వీ అనే సీనియర్‌ జర్నలిస్టు, కొందరు ఎంపీలతో కలిసి చిదంబరాన్ని కలిసి యిదే ఫిర్యాదు చేశారు. చిదంబరమూ దాన్నీ రెవెన్యూ శాఖకు పంపాడు. ఈ లోగా ఇన్‌కమ్‌టాక్స్‌ డిపార్టుమెంటు ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు అదనంగా డబ్బు ఎలా వచ్చిందని, దానిలో కొంత భాగాన్ని ఐఎన్‌ఎక్స్‌ న్యూస్‌కు ఎలా మళ్లించిందని, దాన్ని ఎందుకు అనుమతించారని ఎఫ్‌ఐపిబిని వివరణ కోరింది. ఎఫ్‌ఐపిబిలో పని చేసే కొందరు అధికారులు (వారిపై యిప్పుడు సిబిఐ కేసు నడుపుతోంది) తమ సంస్థ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ఆదాయపు పన్ను శాఖకు లేఖరాశారు.

లేఖ రాయడానికి ముందు పీటర్‌ ముఖర్జీ చిదంబరాన్ని కలిశాడని, అతని సలహాపై అతని కొడుకు కార్తీ చిదంబరాన్ని 2008లో హోటల్‌ హయాత్‌లో కలిశాడని సిబిఐ అంటోంది. విషయాన్ని మాఫ్‌ చేయడానికి కార్తీ మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 7 కోట్లు) అడిగాడని, అడ్వాన్సుగా రూ. 9.96 లక్షలు యిస్తే పుచ్చుకున్నాడనీ సిబిఐ అంటోంది. అతనికి చెందిన ఎఎస్‌సిపిఎల్‌కి కన్సల్టెన్సీ ఫీజు రూపంలో 9.96 లక్షల్ని చెక్కు ద్వారా ఐఎన్‌ఎక్స్‌ మీడియా చెల్లించింది. ఇన్‌కమ్‌టాక్స్‌ శాఖకు ఎలా జవాబు యివ్వాలో కార్తీకి చెందిన ఛెస్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ యిచ్చిన సూచన మేరకు లేఖ రాసి ఎఫ్‌ఐపిబి అధికారి చేతికిచ్చింది. అతను ఆ విషయాన్ని అక్కడితో సమాధి చేశాడు. ఐఎన్‌ఎక్స్‌ సంస్థపై ఏ చర్యా తీసుకోలేదు – ఇదీ సిబిఐ కథనం.

అయితే దీనిలో వచ్చే అనుమానం ఏమిటంటే రూ. 7 కోట్ల లంచానికి కేవలం పది లక్షల అడ్వాన్సా? కనీసం 10%యైనా లేదా? తక్కిన సొమ్ములో రూ. 3.20 కోట్లు పై నాలుగు కంపెనీలకు యిచ్చారంటున్నారు. ఇతర దేశాలు కన్‌ఫమ్‌ చేస్తే దానికి రుజువులు దొరకవు. ఆధారాలు యివ్వండి అంటూ యుకె, సింగపూరు, మారిషస్‌, బెర్ముడా, స్విజర్లండ్‌ దేశాలకు మన కోర్టు నుంచి లెటర్‌ రొగేటరీలు పంపించారు. కానీ జవాబులు రాలేదు. రాకుండానే సిబిఐ ఆరోపణలు చేస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ 2018 అక్టోబరులో చెప్పినదాని ప్రకారం ఆ కంపెనీలు ఐఎన్‌ఎక్స్‌పై ఇన్‌వాయిస్‌లు (బిల్లులు) జారీ చేశాయి కానీ ఐఎన్‌ఎక్స్‌ వాటికి చెల్లింపులు చేయలేదు. ఇక లంచం యిచ్చినట్లు ఎలా అనగలరు?

సిబిఐ చేతిలో ఉన్న ఆధారమల్లా రూ.9.96 లక్షల చెల్లింపు మాత్రమే. అదీ చెక్కు రూపంలో. చెక్కుగా యిచ్చినదాన్ని లంచం అంటే కోర్టు ఒప్పుకుంటుందా? ఎఎస్‌సిపిఎల్‌కి కార్తీకి సంబంధం ఉందని చెప్పడానికి సిబిఐ దాని షేర్‌హోల్డర్లు చిదంబరం కుటుంబసభ్యుల పేర విల్లులు రాసిచ్చారని ఎత్తి చూపుతోంది. వాళ్లు చచ్చిపోతే కానీ అవి అమల్లోకి రావు కదా! అది సరే, ఎలా చూసినా 7 కోట్ల లంచంలో 3.20 కోట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయింది. అదీ విదేశాలు ఆధారాలు యిచ్చాకనే! మిగతాది ఎలా చెల్లించారో సిబిఐ యింకా చెప్పలేదు. ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు డైరక్టరుగా పని చేసిన ఇంద్రాణి తనూ, తన భర్తా చిదంబరాన్ని 2007 మార్చి/ఏప్రిల్‌లో కలిశామని, ఏకంగా 2007-08లో 5 మిలియన్‌ డాలర్లు (రూ. 35 కోట్లు), (2008-09లో నాలుగున్నర లక్షల డాలర్లు  లంచం కూడా యిచ్చామని చెప్పిందని కొన్ని పత్రికలు రాస్తున్నాయి)  దాన్ని సిబిఐ ఎలా సమర్థించగలుగుతుందో వేచిచూడాలి.

2017లో సిబిఐ తొలిసారి ఎఫ్‌ఐఆర్‌ పెట్టినపుడు చిదంబరం పేరు లేదు. అమిత్‌ షా హోం మంత్రి అయ్యాక ఆ ముచ్చటా తీరింది. జులైలో ఇంద్రాణి ముఖర్జీకి క్షమాభిక్ష యిచ్చి, ఆమెను అప్రూవర్‌గా మార్చి, ఆమె స్టేటుమెంటు ఆధారంగా చిదంబరం పేరు కూడా చేర్చారు. సొంత కూతుర్ని చెల్లెలుగా చెప్పుకుంటూ వచ్చి చివరకు ఆమెను క్రూరంగా చంపేసిన ఇంద్రాణి వ్యక్తిత్వం ఘోరమైనదన్న విషయం ఆమె కోర్టులో చెప్పే సాక్ష్యాన్ని కొంతవరకు ప్రభావితం చేస్తుంది. పైగా ఇంద్రాణి అప్రూవరుగా మారింది కానీ ఆమె అప్పటి భర్త పీటర్‌ మారలేదు. నిందితుడుగా ఉన్న అతను ఇంద్రాణి చెప్పినది అబద్ధమనవచ్చు. దీర్ఘ కారాగారవాసం చేత ఆమె మతి చెదిరి, తప్పులు చెపుతోందనవచ్చు. డబ్బు చెల్లించినట్లు చేసిన ఆరోపణకు ఆధారాలు చూపితేనే ఇంద్రాణి మాట నమ్ముతారు.

ఈ ఐఎన్‌ఎక్స్‌ కేసుతో బాటు చిదంబరంపై ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ కేసు కూడా నడుస్తోంది. దీనిలో బెయిలు వస్తే దాన్ని చూపించి మళ్లీ జైలుకి పంపవచ్చు. సిబిఐ ప్రకారం దానిలో తీసుకున్న లంచం ఎంతో తెలుసా? రూ. 26 లక్షలు! చిదంబరం లెవెలుకి యింత తక్కువ లంచం అంటే కోర్టుని నమ్మించడం కష్టం. అంతిమంగా కేసు నిలవకపోవచ్చు. అయితే యీ లోపున అమిత్‌ షా పగ తీరుతుంది కదా! చిదంబరంపై మనం జాలి పడనక్కరలేదు కానీ మనపై మనం జాలి పడాలి.

ఎందుకంటే యీ గొడవల్లో మన డబ్బే ఖర్చయిపోతోంది. ఖర్చయితే అయింది, అవినీతిపరులకు శిక్ష పడింది అనే సంతోషమైనా మిగల్చరు వీళ్లు. 'సరైన ఆధారాలు సేకరించనందుకు కోర్టు సిబిఐకు అక్షింతలు వేసింది' అనే వార్తతో యీ కథ ముగియవచ్చు. ఆ అక్షింతలు దులిపేసుకుని, రాజకీయ ప్రేరితమైన యింకో కేసు పెట్టడానికి వాళ్లు సిద్ధపడతారు. వాళ్లకు శిక్ష వేయడం మొదలుపెట్టినప్పుడే యీ నాటకాలు ఆగుతాయి.
– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2019)
[email protected]

ఎమ్బీయస్‌: యూజ్‌ అండ్‌ త్రో కెసియార్‌