అంతా అయిపోయిన తరువాత సంత అన్నట్లుంది నిర్మాత కమ్ హీరో రామ్ చరణ్ వ్యవహారం. సైరా రన్ సద్దు మణిగిపోయిన తరువాత, దాదాపు ఇద్దరు మినహా వరల్డ్ వైడ్ గా డిస్ట్రిబ్యూటర్లు అంతా నష్టాలు లెక్కలు వేసుకుంటున్న టైమ్ లో రామ్ చరణ్ మీడియా ముందుకు వచ్చి మళ్లీ మరోసారి సైరా సినిమా గురించి గొప్పలు పోయారు. సినిమా ఇంత హిట్ అంత హిట్, ఈసారి దీపావళి తమకు ముందే వచ్చేసింది అంటూ.
అంతే కాదు మరో ముచ్చట కూడా చెప్పారు. ఎనిమిది కోట్ల ఖర్చుతో చిరంజీవి-తమన్నాల మీద సాంగ్ పిక్చరైజ్ చేసామని, కానీ తరువాత తీసి పక్కన పెట్టేసామని చెప్పారు. సినిమాలో తమన్నాను చూసి మెగాస్టార్ కాస్త మెలికలు తిరిగి సిగ్గుపడే సీన్లు చూసే జనాలు సిగ్గుపడిపోయారు. ఈ వయసులో ఈయన కు ఈ సీన్లు అవసరమా? అన్న కామెంట్లు వినిపించాయి.
దీనికి తోడు తమన్నాతో ఆ డ్యూయట్ కూడా పెట్టి వుంటే భలేగా వుండేదేమో? సైరా సినిమా ఓ దేశభక్తుడి కథ అన్న పాయింట్ లేదా ట్యాగ్ లైన్ లేకుంటే మాస్ హిస్టీరియా లాంటి సమీక్షలు వచ్చి వుండేవు కాదు. అది వాస్తవం. చిరు-తమన్నాల డ్యూయట్ పెట్టి వుంటే, కచ్చితంగా సమీక్షల్లో తేడా వచ్చి వుండేది. పాటను తీసి, పక్కన పెట్టడం మంచిదయింది.
రామ్ చరణ్ ఏమో తమకు దీపావళి ముందే వచ్చిందని అంటున్నారు. కానీ సీడెడ్, ఈస్ట్, వెస్ట్, కృష్ణ, గుంటూరు, నెల్లూరు ఏరియాల బయర్లు సైరా ఇచ్చిన నష్టాలతో తమకు దీపావళి ఎగిరిపోయింది అంటున్నారు. ఇక ఓవర్ సీస్ బయ్యర్ అయితే చెప్పనక్కరే లేదు.
ఇలాంటి టైమ్ లో ఇలా కెలకడం అవసరమా? రామ్ చరణ్ కు?