2022 రౌండప్: హీరోయిన్లు కూడా మెరిశారు

“సర్కారువారి పాట సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్ ఇరగదీశాడు. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్-రామ్ చరణ్ అదరగొట్టారు. భీమ్లానాయక్ లో పవన్ కల్యాణ్ విశ్వరూపం చూపించాడు.” ఇలా ఎంతసేపూ హీరోల గురించేనా.. హీరోయిన్లు ఏం చేయలేదా..…

“సర్కారువారి పాట సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్ ఇరగదీశాడు. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్-రామ్ చరణ్ అదరగొట్టారు. భీమ్లానాయక్ లో పవన్ కల్యాణ్ విశ్వరూపం చూపించాడు.” ఇలా ఎంతసేపూ హీరోల గురించేనా.. హీరోయిన్లు ఏం చేయలేదా.. వాళ్లు మెరుపులు మెరిపించలేదా? హీరోలు మాత్రమే కాదు, 2022లో మెరుపులు మెరిపించిన హీరోయిన్లు కూడా ఉన్నారు.

యశోద సినిమాతో సమంత దుమ్ముదులిపింది. వన్ విమెన్ షో చూపించింది. లేట్ అయినా లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాకు ప్రాణం సమంత యాక్టింగ్ మాత్రమే. సమంత లేకపోతే యశోద లేదు.

సరిగ్గా ఇలాంటి ప్రశంసల్నే సాయిపల్లవి కూడా అందుకుంది. ఆమె లేకపోతే విరాటపర్వం లేదు. వెన్నెల పాత్రలో సాయిపల్లవి నటన ఆ సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. సినిమా బాక్సాఫీస్ బరిలో ఫెయిల్ అయినా, సాయిపల్లవి మాత్రం అందర్నీ ఫిదా చేసింది.

తాజాగా మృణాల్ ఠాకూర్ కూడా ఎట్రాక్ట్ చేసింది. సీతారామం సినిమాలో నూర్జహాన్ అలియాస్ సీతామహాలక్ష్మిగా ఆమె నటన అందర్నీ కట్టిపడేసింది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ లో ప్రామిసింగ్ హీరోయిన్ గా మారిపోయింది. సినిమాకు దుల్కర్ ఎంత ప్లస్ అయ్యాడో, మృణాల్ కూడా అంతే ప్లస్ అయింది.

ఇక కమర్షియల్ గా సక్సెస్ అయిన సర్కారువారి పాట, అంటే సుందరానికి సినిమాల్లో కూడా హీరోయిన్ పాత్రలు మెరిశాయి. సర్కారువారి పాటలో కళావతిగా కీర్తిసురేష్ చేసిన యాక్టింగ్ చాన్నాళ్ల పాటు గుర్తుండిపోతుంది. ఏకంగా మహేష్ బాబు వైపు వేలెత్తి చూపిస్తూ 'బోగ్గాడు' అనే డైలాగ్ చెప్పడం ఆమెకే సాధ్యమైంది. ఇటు అంటే సుందరానికి సినిమాలో నజ్రియా పోషించిన లీలా థామస్ పాత్ర, నాని చేసిన సుందర ప్రసాద్ క్యారెక్టర్ కంటే కాస్త ఎక్కువే హైలెట్ అయింది.

కృతి శెట్టి, నేహా శెట్టి, పూజాహెగ్డే కూడా ఈ ఏడాది మెరిశారు. డీజే టిల్లూలో నేహా పోషించిన రాధిక పాత్రను కుర్రాళ్లు మరిచిపోలేరు. ఇప్పటికీ చాలామంది నేహాను రాధిక అని పిలుస్తుంటారు. ఇక రాధేశ్యామ్ లో పూజాహెగ్డే చేసిన ప్రేరణ పాత్ర కూడా బాగుంటుంది. సినిమా హిట్టయితే, ఆ పాత్రకు మరింత పేరొచ్చి ఉండేది. కృతి శెట్టి ఈ ఏడాది ఏకంగా 4 సినిమాలు చేసింది. అయితే వీటిలో బంగార్రాజు సినిమాలో ఆమె పోషించిన సర్పంచ్ నాగలక్ష్మి పాత్ర చాలామందికి నచ్చింది.

ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో అలియా భట్ ట్రెడిషనల్ గా కనిపించింది. కాకపోతే సినిమాలో స్క్రీన్ టైమ్ చాలా తక్కువగా ఉండడం వల్ల తన మార్క్ చూపించలేకపోయింది. గాడ్ ఫాదర్ లో నయనతార పాత్ర కూడా దాదాపు ఇలాంటిదే. ఇక మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాలో సన్నీ లియోన్ తన యాక్టింగ్ టాలెంట్ చూపించింది. ఇన్నాళ్లూ ఐటెం భామగా మాత్రమే అందరికీ తెలిసిన సన్నీ లియోన్, తనలో మంచి నటి కూడా ఉందని నిరూపించుకుంది.