మరికొన్ని రోజుల్లో భారత్ లోకి ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన ఈ వ్యాక్సిన్ కు ధరలు కూడా నిర్ణయించారు. ఆ విషయాలన్నీ ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇక అసలు విషయం ఏంటంటే.. ఈ వ్యాక్సిన్ ను ఎవరు తీసుకోవాలి? మరీ ముఖ్యంగా ఆల్రెడీ బూస్టర్ డోస్ తీసుకున్న వ్యక్తులు ఈ వాక్సిన్ ను తీసుకోవచ్చా?
ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ కేవలం పెద్దలకు మాత్రమే. చిన్నపిల్లలకు ఈ వ్యాక్సిన్ పనికిరాదు. ఇక రెండో విషయం ఏంటంటే, ఇది బూస్టర్ డోస్ మాత్రమే. ఇప్పటివరకు బూస్టర్ డోస్ తీసుకోని వ్యక్తులు మాత్రమే ఈ వ్యాక్సిన్ ను తీసుకోవాలి. ఆల్రెడీ బూస్టర్ డోస్ తీసుకున్నవాళ్లు, దీన్ని తీసుకోకూడదు. దీనికి కారణాల్ని కూడా వెల్లడించారు అధికారులు.
దేశంలో మరోసారి కరోనా భయాలు ముసురుకున్న వేళ… ఆల్రెడీ బూస్టర్ డోస్ తీసుకున్నవాళ్లు కూడా ఇంకోసారి ముక్క ద్వారా తీసుకునే ఈ కొత్త వ్యాక్సిన్ ను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి ఇప్పటికే బూస్టర్ డోస్ తీసుకున్నవాళ్లు మరో బూస్టర్ తీసుకోవడం మంచిది కాదు. కొవిడ్ పోర్టల్ కూడా టెక్నికల్ గా దీన్ని అనుమతించదు.
వ్యాక్సిన్ అనేది బయట నుంచి రోగనిరోధక శక్తిని తీసుకునే ప్రక్రియ. ఉన్నఫలంగా శరీరానికి యాంటీజెన్స్ ను అందించి రోగనిరోధక శక్తిని పెంచే పద్ధతి ఇది. ఇప్పటికే 2 డోసుల వ్యాక్సిన్ తో పాటు బూస్టర్ డోస్ కూడా తీసుకున్న వాళ్లు.. ఇప్పుడు నాలుగో సారి కూడా డోస్ తీసుకుంటే, శరీరం సహజంగా పెంపొందించుకునే రోగనిరోధక శక్తి సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. వయసు పెరిగే కొద్దీ దీని దుష్పరిణామాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి.
గతంలో వ్యాక్సిన్లు లాంగ్ గ్యాప్ లో ఇచ్చేవారు. కానీ కరోనా వల్ల మినిమం గ్యాప్స్ లోనే టీకాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా చేయడం వల్ల ఇప్పటికే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే సామర్థ్యం కాస్త సన్నగిల్లింది. ఇలాంటి టైమ్ లో ముక్కుతో తీసుకునే బూస్టర్ డోస్ కూడా వేసుకుంటే మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఇప్పటివరకు బూస్టర్ డోస్ తీసుకోని వాళ్లకు మాత్రం ముక్కతో తీసుకునే ఈ వ్యాక్సిన్ ను వాడడం చాలా సులభం. సూదిని ఒంట్లో గుచ్చాల్సిన పనిలేదు. జనవరి నాలుగో వారం నుంచి ఇంకోవాక్స్ అందుబాటులోకి వస్తోంది.