‘‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’’ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నెల్లూరు జిల్లా కందుకూరులో సభలో అపశృతి చోటుచేసుకుంది. సభా ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటికి ఎనిమిది మంది కార్యకర్తలు చనిపోయారు.
కందుకూరులో ఏర్పాటు చేసిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి సభలో చంద్రబాబు మాట్లాడుతుండగా తొక్కిసలాటలో చాలామంది ఒక్కసారిగా కాల్వలో పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ మొదటి ఇద్దరు చనిపోయారు. ఆ తర్వాత మరో ఆరుగురు మృతిచెందినట్టు సమాచారం అందుతోంది.
ప్రమాదం జరిగిన వెంటనే.. బాధితుల యోగక్షేమాలు తెలుసుకున్నాకే ప్రసంగం చేస్తానంటూ కార్యక్రమాన్ని నిలిపేసి చంద్రబాబు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. గాయపడిన కార్యకర్తలను పరామర్శించారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కాగా తొక్కసలాటలో కార్యకర్తల మరణం బాధాకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.