బీజేపీ అంటే అందరికీ తెలిసినది భారతీయ జనతా పార్టీ. కానీ బీ ఫర్ బాబు. జే ఫర్ జగన్, పీ ఫర్ పవన్ అంటున్నారు పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు. కొత్త పదవి రాగానే ఆయన మాటలు కూడా దూకుడు చేస్తున్నారు. ఏపీలో బీజేపీ అన్నదే లేదని, కానీ ఈ మూడు పార్టీలూ బీజేపీయే అని ఆయన అంటూ మొత్తం విపక్షం మీదనే భారీ పంచ్ వేశారన్న మాట.
పీసీసీ ప్రెసిడెంట్ అయి నెల రోజులు అయిందో లేదో కానీ ఏపీలో కాంగ్రెస్ వైభవం బాగా ఉందని గిడుగు అంటున్నారు. దేశంలో రాహుల్ పాదయాత్ర ధూం ధాం గా సాగుతోంది. ఏపీలో కూడా కాంగ్రెస్ కి మంచి రోజులే వస్తాయని ఆయన అంటున్నారు. దేశంలో అభివృద్ధికి కేరాఫ్ కాంగ్రెస్ అయితే ప్రభుత్వ పరిశ్రమలను తెగనమ్మడానికి బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ అని గిడుగు ఘాటైన విమర్శలు చేశారు.
విశాఖలో అనేక కేంద్ర పరిశ్రమలు వచ్చాయంటే కాంగ్రెస్ చలువ మాత్రమే అని కాంగ్రెస్ దశాబ్దాల పాటు అధికారంలో ఉండడం వల్లనే ఇవన్నీ సాధ్యపడ్డాయని ఆయన అంటున్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేయడమే కాదు అవి ఉనికిలో లేకుండా చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే విశాఖ అభివృద్ధి సాధించిందని ఆయన గుర్తు చేస్తున్నారు
కాంగ్రెస్ ఉంటేనే దేశానికి సుభిక్షం అని ఆ సంగతి దేశ ప్రజలు ఇపుడిపుడే తెలుసుకుంటున్నారని రానున్న రోజులలో హస్తవాసికి తిరుగులేదని కొత్త పీసీసీ ప్రెసిడెంట్ జోస్యం చెప్పారు ఉత్తరాంధ్రా టైగర్ ద్రోణం రాజు సత్యనారాయణ స్పూర్తితో మళ్ళీ కాంగ్రెస్ ఆ ప్రాంతంలో పుంజుకోవడం ఖాయమని గిడుగు అంటున్నారు. .కొత్త ప్రెసిడెంట్ ఆశలు ఆకాంక్షలు ఎవరూ తప్పుపట్టడంలేదు కానీ కాంగ్రెస్ విభోగం ఆ స్థాయిలో ఒక్క గిడుగుకు తప్ప ఎవరికీ కనిపించకపోవడమే కాస్తా వింతగా ఉంది.