ఇయర్ ఎండ్ స్పెషల్.. ఏకంగా 10 సినిమాలు

ఓవైపు క్రిస్మస్ సినిమాలు నడుస్తున్నాయి. అంతలోనే మరో 10 సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఏడాది చివరి వారంలో ఇలా ఇన్ని సినిమాలు రిలీజ్ అవ్వడం కాస్త ఆసక్తికరమే. ఎందుకంటే, ప్రతి ఏటా క్రిస్మస్ సినిమాలతోనే…

ఓవైపు క్రిస్మస్ సినిమాలు నడుస్తున్నాయి. అంతలోనే మరో 10 సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఏడాది చివరి వారంలో ఇలా ఇన్ని సినిమాలు రిలీజ్ అవ్వడం కాస్త ఆసక్తికరమే. ఎందుకంటే, ప్రతి ఏటా క్రిస్మస్ సినిమాలతోనే సందడి ముగుస్తుంది. కానీ ఈసారి కొసరు ఇంకా మిగిలే ఉంది.

ఈ శుక్రవారం ఏకంగా 10 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో స్టార్ ఎట్రాక్షన్ ఉన్న మూవీ ఖుషి. ఏళ్ల కిందట పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాను ఇప్పుడు మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈమధ్య కాలంలో వచ్చిన రీ-రిలీజెస్ కు భిన్నంగా పద్ధతి ప్రకారం ప్రచారం చేసి మరీ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

ఈ మూవీతో పాటు ఆది సాయికుమార్ హీరోగా నటించిన టాప్ గేర్ సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. కనీసం ఏడాది చివర్లోనైనా ఆది హిట్ కొడతాడేమో చూడాలి.

ఇక బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ నటించిన లక్కీ లక్ష్మణ్, తారకరత్న-ప్రిన్స్ కలిసి చేసిన ఎస్5 అనే మరో రెండు సినిమాలు కూడా ఈ ఏడాది చివరినాటికే వస్తున్నాయి. సోహెల్ కెరీర్ ను డిసైడ్ చేసే సినిమా ఇది. ఈ సినిమా రిజల్ట్ పైనే అతడి మూవీ మార్కెట్ ఆధారపడి ఉంది. ఎందుకంటే, మరో 2 సినిమాలు అతడి నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ఇక చాన్నాళ్లుగా వాయిదా పడుతున్న డ్రైవర్ జమున అనే సినిమా కూడా 30వ తేదీకే థియేటర్లలోకి వస్తోంది. ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్ పోషించిన సినిమా ఇది. ఇందులో ఆమె క్యాబ్ డ్రైవర్ గా నటించింది.

ఈ సినిమాలతో పాటు.. రాజయోగం, కొరమీను, నువ్వే నా ప్రాణం, ఉత్తమ విలన్ కేరాఫ్ మహదేవపురం లాంటి సినిమాలన్నీ ఈ వీకెండ్ కు క్యూ కట్టాయి. ఆల్రెడీ ధమాకా, 18-పేజెస్ సినిమాలు థియేటర్లలో ఉన్నాయి. రీ-రిలీజ్ అయినప్పటికీ ఖుషీకి మంచి సంఖ్యలో స్క్రీన్స్ దొరికాయి. సో.. ఉన్నంతలో దొరికిన థియేటర్లలో ఈ సినిమాలన్నీ వచ్చేస్తున్నాయి.

ఈ శుక్రవారం దాటితే చిన్న సినిమాకు ఇక దారి లేనట్టే. సంక్రాంతి సినిమాల హంగామా మొదలైపోతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి-మార్చి నెలల్లో కొన్ని మీడియం రేంజ్ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఏప్రిల్ నుంచి సమ్మర్ సినిమాల సందడి ఉండనే ఉంటుంది. వీటికి తోడు చిన్న సినిమా నిర్మాతలకు ఫైనాన్స్ సమస్యలు ఎప్పుడూ ఉండేవే. అందుకే రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ, 30వ తేదీకే క్యూ కట్టాయి చాలా సినిమాలు.