బాలీవుడ్ చరిత్రలోనే బ్యాడ్ ఇయర్ గా మారిపోయింది 2022 సంవత్సరం. హిందీ హీరోలు జీవితాంతం చెప్పుకొని బాధపడేలా తయారైంది ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి. ఇప్పుడీ ఏడుపును రెట్టింపు చేసింది తాజాగా వచ్చిన సర్కస్ సినిమా.
రోహిత్ శెట్టి లాంటి స్టార్ డైరక్టర్.. రణ్వీర్ సింగ్ లాంటి స్టార్ హీరో.. కాసులు కురిపించే క్రిస్మస్ సీజన్.. అందాలు ఒలికించే ఇద్దరు హీరోయిన్లు.. ఇలా ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ సర్కస్ సినిమా నిరాశపరిచింది. ఇంకా చెప్పాలంటే.. నిరాశ అనే పదం చాలా చిన్నది.
దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి రోజే డిజాస్టర్ టాక్ వచ్చేసింది. ఆ తర్వాత నుంచి సినిమా ఏ మాత్రం కోలుకోలేదు. అలా 5 రోజుల్లో ఈ సినిమాకు కేవలం 25 కోట్ల రూపాయల నెట్ మాత్రమే వచ్చింది.
ఇక ఈ సినిమా కోలుకోవడం అసంభవం అని ట్రేడ్ తేల్చేసింది. అటు యూనిట్ కూడా ప్రచారం ఆపేసింది. రెండో వారం నుంచి ఇవ్వాల్సిన ప్రమోషనల్ బడ్జెట్ ను కూడా పూర్తిగా ఆపేసింది. ఈ సినిమాతో 200 కోట్ల రూపాయల వసూళ్లు ఆశించింది యూనిట్. కానీ వాళ్ల ఆశలు చెల్లాచెదురయ్యాయి. చివరికి దీపికా పదుకోన్, అజయ్ దేవగన్ ప్రత్యేక ఆకర్షణలు కూడా ఈ సినిమాను కాపాడలేకపోయాయి.
పాపం పఠాన్ పరిస్థితి ఏంటో..
బాలీవుడ్ లో థియేట్రికల్ వ్యవస్థ ఘోరంగా తయారైంది. అక్కడి ప్రేక్షకుల అభిరుచులు పూర్తిగా మారిపోయాయి. దీనికితోడు నెపొటిజం చర్చలు, బాయ్ కాట్ ట్రెండ్ లు సరేసరి. ఇవన్నీ కలిసి హిందీ సినిమాను దారుణంగా దెబ్బతీశాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వస్తోంది పఠాన్ మూవీ. షారూక్ హీరోగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే వివాదాలు ముసురుకున్నాయి. జనవరి 25న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా అయినా బాలీవుడ్ బాక్సాఫీస్ కు కళ తీసుకొస్తుందా లేక కొట్టుకుపోతుందా అనేది చూడాలి.