అబద్ధాలను నిజాలుగా నమ్మించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మించిన వారు లేరు. గతంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా టీఆర్ఎస్కే ఓటు వేస్తానని చెప్పినట్టు ప్రకటించి కేసీఆర్ తన చతురతను ప్రదర్శించారు. అప్పట్లో కేసీఆర్ సరదా కామెంట్స్‌పై చర్చ జరిగింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్ఎస్ను పెట్టాలనే డిమాండ్లు వస్తున్నాయని చెప్పడంతో పాటు గెలిపించుకుంటామని ప్రజలు అంటన్నారని కేసీఆర్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను పదో సారి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేశారు.
2001 ఏప్రిల్ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ సమక్షంలో జలదృశ్యంలో టీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభమైందని చెప్పారు. అనేక ఆటు పోట్లను ఎదుర్కొంటూ తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వ హయాంలో అమలువుతున్న సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకం అయ్యాయన్నారు.
ఇటీవల దళితబంధు ప్రకటించాక ఆంధ్రప్రదేశ్ నుంచి వేల విజ్ఞాపనలు వస్తున్నాయన్నారు. ఆంధ్రాలో పార్టీ పెట్టండి గెలిపించుకుంటామని అక్కడి ప్రజలకు తనకు సందేశం పంపుతున్నారని అన్నారు. తెలంగాణ పథకాలు తమకు కావాలని ఆంధ్రా ప్రజలు కోరుతున్నట్టు కేసీఆర్ చెప్పారు. ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో కూలీలు తెలంగాణకు వచ్చి పని చేస్తున్నారన్నారు.
తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలంటూ పొరుగు రాష్ట్రాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయన్నారు. నాందేడ్, రాయచూర్ జిల్లాల నుంచి ఈ డిమాండ్లు వచ్చినట్టు కేసీఆర్ తెలిపారు. నిజానిజాలతో సంబంధం లేకుండా రాజకీయ ఎత్తుగడలు వేయడంలో కేసీఆర్ దిట్ట. దళిత బంధు పథకం గురించి ఆంధ్రా నుంచి విజ్ఞాపనల అంశం కూడా గతంలో భువనేశ్వరి టీఆర్ఎస్కు ఓటు వేస్తానని చెప్పినట్టుగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రా తర్వాతే… ఏ రాష్ట్రమైనా అనే అభిప్రాయాలు విస్తృతంగా ప్రచారమవుతున్న నేపథ్యంలో కేసీఆర్ గిల్లుడు వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందోననే చర్చకు దారి తీసింది.