టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి దేశం దాటి వెళ్లిపోయారు. మాల్దీవుల్లో ఆయన ప్రత్యక్షమయ్యారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలతో పట్టాభి వివాదాస్పదమయ్యారు.
పట్టాభి దూషణలు ఏపీలో రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులను సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలించారు. అనంతరం 24 గంటలు కూడా గడవకనే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
జైలు నుంచి విడుదలైన తర్వాత విజయవాడకు వస్తూ… మార్గమధ్యంలో ఆయన అదృశ్యమయ్యారు. దీన్ని కూడా ఎల్లో బ్యాచ్ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసింది.
పోలీసులు మళ్లీ అరెస్ట్ చేస్తారనే భయంతో పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఒక వైపు ఈ ప్రచారం కొనసాగుతుండగానే, ఇవాళ సాయంత్రం పట్టాభి విమానంలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. హైదరాబాద్ నుంచి మాల్దీవులకు తప్పించుకెళ్లారనే ప్రచారం తెరపైకి వచ్చింది.
ఆయన విమానంలో కూచున్న సీటు మొదలుకుని మాల్దీవుల్లో విమానాశ్రయంలో దిగిన ఫొటోల వరకూ అన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం గమనార్హం.
ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో ప్రమాదం పొంచి ఉందనే ఉద్దేశంతో పట్టాభిని టీడీపీ నేతలే విదేశాలకు పంపినట్టు ప్రచారం జరుగుతోంది.