ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడైన తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈడీ విచారణను నిలుపుదల చేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే విచారణకు సంబంధించి ఈడీ సమన్లపై స్టే ఇవ్వాలన్న రోహిత్‌రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించడం గమనార్హం. రోహిత్‌రెడ్డి కేసును ఏపీ అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ లాయర్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించడం గమనార్హం.
పార్టీ మారాలని తనకు వంద కోట్ల ఆఫర్ ఇచ్చారని రోహిత్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే డబ్బు ఇవ్వలేదని , కేవలం ఆఫర్ మాత్రమే చేశారని రోహిత్ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఆర్థిక లావాదేవీలు లేవని, కావున కేసు ఈడీ పరిధిలోకి రాదని రోహిత్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఈడీ ఈసీఐఆర్ మనీలాండరింగ్ చట్టానికి విరుద్ధమని కోర్టుకు విన్నవించారు. వ్యక్తిగత వివరాల కోసం తన క్లయింట్‌ను ఈడీ వేధిస్తున్నట్టు నిరంజన్‌రెడ్డి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈడీ అడిగిన అన్ని వివరాలను ఇప్పటికే ఇచ్చారన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం స్టే విధించేందుకు నిరాకరించింది. దీంతో ఆయన తిరిగి ఈడీ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇటీవల విచారణకు రావాలని ఈడీ రోహిత్‌రెడ్డికి నోటీసులు పంపింది. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ విషయమై న్యాయపోరాటం చేస్తుండడాన్ని ఈడీ దృష్టికి ఆయన తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. న్యాయ స్థానంలో తీర్పును బట్టి విచారణకు వచ్చే విషయమై ఆలోచిస్తానని రోహిత్‌రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో ఈడీ విచారణపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసు విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేశారు. ఈ లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఈడీని ఆదేశించింది. రోహిత్‌రెడ్డి తదుపరి ఎత్తుగడపై ఉత్కంఠ నెలకుంది.