చినబాబు నారా లోకేష్ పాదయాత్ర చేసేలోగా ఎన్ని అవాంతరాలు వస్తాయో ఏమో గానీ.. దాని గురించి టీడీపీ నాయకులు డప్పు కొట్టడం చాలా ఎక్కువైపోయింది. తాజాగా తెలుగుదేశం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు.. తమ యువనేత చేయబోయే పాదయాత్రకు పెట్టిన పేరును ప్రకటించారు.
పాదయాత్రకు సంబంధించి ప్రెస్ మీట్ అని రెండు రోజులుగా హడావుడి చేసి.. తీరా పేరు మాత్రం ప్రకటించారు. సరిగ్గా మరో నెల రోజుల్లో యాత్ర ప్రారంభం అవుతుందనగా.. ఇవాళ వివరాలు అంటే.. రూట్ మ్యాప్ మొత్తం ప్రకటిస్తారని కార్యకర్తలు ఎదురుచూశారు. కానీ అలా ఏం జరగలేదు. కేవలం యాత్ర పేరు మాత్రం ప్రకటించారు. ‘యువగళం’ ఆ యాత్ర పేరు.
సాధారణ జనానికి ఈ పేరు ఎలా ధ్వనిస్తోంది? అనేది తాజా చర్చ! ఎందుకంటే.. యువగళం అనే పేరు ఏదో సంగీత కచేరీకి, యంగ్ సింగర్స్, యంగ్ టేలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి నిర్వహించే టీవీ కార్యక్రమంలాగా ఉన్నదనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. లోకేష్ బాబు పాదయాత్ర అంటే సంగీతకచేరీ అనుకుంటున్నారా అని జనం జోకులు వేసుకుంటున్నారు.
నవతరం చినబాబు కంటె దాదాపు పదేళ్ల కిందట ఆయన తండ్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన పాదయాత్ర పేరే బాగుంది. ‘వస్తున్నా మీకోసం’ అనే టైటిల్ తో చంద్రబాబు పాదయాత్ర చేశారు. ఏడాదికంటె ఎక్కువకాలం.. 2018 మొత్తం సాగిన జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు అప్పట్లో ‘ప్రజాసంకల్ప యాత్ర’ అని పేరు పెట్టారు. నిజానికి ఈ రెండు టైటిల్స్ లో ఒక ప్రాపర్ మెసేజీ ఉంది. ప్రజల కోసం పనిచేస్తున్నారనే సెన్స్ ఉంది. సూటిగా ఉంది. ప్రజలకు కనెక్ట్ అయ్యేలా ఉంది. కానీ.. నారా లోకేష్ యువగళం అంటూ.. ఏదో సంగీత కచేరీకి పేరు పెట్టుకున్నట్టుగా యాత్రకు పేరు పెట్టుకోవడంతో కామెడీ అయిపోయింది.
నాయకుడిలో బేసిగ్గా ప్రజల పట్ల కన్సర్న్ ఉండాలి, ఒక ఫైర్ ఉండాలి. ఒక తపన ఉండాలి. అవేమీ లేకుండా.. ఏదో పాదయాత్ర చేయడం అనేది అధికార పీఠానికి సెంటిమెంట్ దారి అని నమ్మినట్టుగా యాత్ర చేస్తే ఇలాగే ఉంటుంది. అవకతవకలుగా పేరు పెట్టేసి.. ఆ తర్వాత నాలిక్కరుచుకుని పేరు మార్చుకోవడం తెలుగుదేశానికి కొత్త సంగతి ఎంత మాత్రమూ కాదు. ‘ఇదేం ఖర్మ’ అనే కార్యక్రమం ప్రకటించి.. జనం మరీ ఛీకొట్టేలా ఉన్నదని గ్రహించి, అయ్యన్నపాత్రుడి సూచనతో ‘.. రాష్ట్రానికి’ అనే తోక దానికి తగిలించారు.
ఇప్పుడు కూడా.. ఈ సంగీత కచ్చేరీ టైటిల్ మార్చుకుని.. ‘గళం’ అనేది లోకేష్ కంపల్సరీ అనుకుంటే గనుక.. ప్రజాగళం, జనగళం లాంటిదో.. ఇంకేదైనా ప్రజల కోసం పాటుపడుతున్న అర్థంతో, సామాన్యులకు కనెక్ట్ అయ్యే టైటిల్ పెట్టుకుంటే బాగుంటుందని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.