టీడీపీ యువనేత నారా లోకేశ్ వచ్చే నెల 27 నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ విషయాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధికారికంగా ఇవాళ ప్రకటించారు. ఈ సందర్భంగా లోకేశ్ పాదయాత్ర గురించి అచ్చెన్నాయుడు చెప్పిన విశేషాలు… కొందరికి వెటకారమనే భావన కలిగిస్తున్నాయి.
వచ్చే నెల 27న కుప్పంలో తమ యువనాయకుడు లోకేశ్ పాదయాత్ర ప్రారంభిస్తున్నట్టు అచ్చెన్న తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎంతో మంది పాదయాత్ర చేశారన్నారు. కానీ ఇలాంటి సాహస పాదయాత్ర గతంలో ఎవరూ చేయలేదని సగర్వంగా చెబుతున్నానని అచ్చెన్నాయుడు అన్నారు. గమనార్హం. 400 రోజులు, 4 వేల కిలోమీటర్లు చొప్పున పాదయాత్ర సాగుతుందని ఆయన తెలిపారు. లోకేశ్ పాదయాత్రపై అచ్చెన్న వ్యాఖ్యలకు నెటిజన్లు, ప్రత్యర్థులు తమవైన భాష్యం చెబుతున్నారు. ఇంత వరకూ కనీసం క్షేత్రస్థాయిలో పది కిలోమీటర్లు కూడా తిరగని లోకేశ్, వచ్చే నెలలో ఏకంగా సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారనే ద్వంద్వార్థాలు ప్రత్యర్థులు తీస్తున్నారు.
గతంలో పార్టీ లేదు, బొక్కా లేదని అచ్చెన్నాయుడు లోకేశ్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. తాజాగా సాహస యాత్ర అనడం వెనుక అచ్చెన్న అసలు ఉద్దేశం…. లోకేశ్ అసలు నడుస్తారా? లేదా? అనే అనుమానం అచ్చెన్న మనసులో మెదలడం వల్లే సాహసయాత్రగా వెటకరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకేశ్ పాదయాత్ర స్టార్ట్ కాకముందే, ఆయనపై సోషల్ మీడియాలో పంచ్‌లు ప్రారంభమయ్యాయి.
ఇవాళ్టి మీడియా సమావేశంలో లోకేశ్ నాయకత్వంపై అచ్చెన్నాయుడు మరో జోక్ పేల్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు లోకేశ్ బాబు నాయకత్వం వహించడం అదృష్టమని అచ్చెన్నాయుడు అభివర్ణించడం గమనార్హం. టీడీపీకి అనధికారికంగా లోకేశ్ నాయకత్వం వహిస్తున్నారని, ఆ పార్టీ కార్యకర్తలు ఎంత అదృష్టవంతులో అని వ్యంగ్య కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి వచ్చే నెల నుంచి నెటిజన్లకు చేతినిండా పని వుంటుందని చెప్పక తప్పదు.