టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రపై స్పష్టత వచ్చింది. ఎట్టకేలకు ఆయన పాదయాత్రకు టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లోకేశ్ పాదయాత్రకు ‘యువగళం’ అనే పేరు ఖరారు చేశారు. కార్యక్రమాలకు పేర్లు పెట్టడంలో టీడీపీ క్రియేటివిటీని తప్పక అభినందించాలి. బహుశా టీడీపీ సుదీర్ఘ ప్రస్థానంలో ‘ఇదేం ఖర్మ’ అనే పేరొక్కటే తీవ్ర విమర్శలకు దారి తీసింది.
2023, జనవరి 27న లోకేశ్ తన తండ్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్రకు సంబంధించి ఎజెండాను ప్రకటించారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో యువగళం జెండాను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు ఆవిష్కరించారు.
ఇచ్ఛాపురం వరకు నిర్వహించనున్న పాదయాత్రలో ప్రధానంగా యువతను ఆకర్షించేందుకు కార్యాచరణ రూపొందించారు. నిరుద్యోగంతో పాటు యువత ఎదుర్కొంటున్న సమస్యలను లోకేశ్ అడ్రస్ చేయనున్నారు. నిజానికి ఈ పాదయాత్రపై టీడీపీలో భయం వుంది. అసలే లోకేశ్ రాజకీయ ప్రస్థానం నెగెటివిటీతో ప్రారంభమైంది. ఆయన గురించి ప్రత్యర్థులు చేసే కామెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తనపై ప్రత్యర్థులు ఏ విధమైన నెగెటివ్ ముద్ర వేశారో అందరికంటే లోకేశ్, టీడీపీ శ్రేణులకే బాగా తెలుసు. మొదటగా తనపై వ్యతిరేక అభిప్రాయాన్ని పోగొట్టుకోవడమే లోకేశ్ ముందున్న అతిపెద్ద సవాల్. అప్పుడే లోకేశ్ చెప్పింది జనాలు వింటారు. లేదంటే ఆయన పాదయాత్ర అభాసుపాలవుతుంది. ప్రజల సమస్యల్ని తెలుసుకోవడం, వారితో మమేకం కావడంలో సహజత్వం కనిపించాలి. మాటల్లో తడబాటు పోవాలి. ప్రజలకు భరోసా ఇచ్చేలా లోకేశ్ మాటతీరు ఉండాలి.
పాదయాత్ర ప్రారంభించనున్న లోకేశ్‌పై తీవ్ర ఒత్తిడి, బాధ్యత వుంది. ఎందుకంటే టీడీపీ భవిష్యత్‌ను లోకేశ్ పాదయాత్ర నిర్ణయించనుంది. వైఎస్ జగన్ పాదయాత్ర సూపర్ హిట్ అయిన విషయాన్ని లోకేశ్ దృష్టిలో పెట్టుకోవాలి. జగన్‌ను మించి ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నప్పుడే సక్సెస్ అవుతాననే కఠిన వాస్తవాన్ని లోకేశ్ గమనంలో ఉంచుకోవాలి. తన వల్ల పార్టీకి పాజిటివ్ కాకపోయినా, కనీసం నెగెటివ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత లోకేశ్‌దే. ఇప్పటికే చంద్రబాబు యాత్రలకు జనం పెద్ద ఎత్తున వస్తున్నారు.
పాదయాత్రలో లోకేశ్ అడుగులు అటుఇటుగా తడబడితే మాత్రం వైసీపీ రాజకీయంగా సొమ్ము చేసుకోడానికి సిద్ధంగా వుంటుంది. అప్పుడు తాను పార్టీకి గుదిబండ అవుతాననే విషయాన్ని మరిచిపోవద్దు. జగన్‌తో తాడోపేడో తేల్చుకోడానికి టీడీపీ సిద్ధమైన తరుణంలో లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టడం సాహసమే. ఈ నేపథ్యంలో తనతో పాటు టీడీపీ భవిష్యత్‌కు లోకేశ్ పాదయాత్ర ఓ అగ్నిపరీక్ష అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్‌తో జూదమాడుతారా? లేక జనానికి భరోసా కల్పిస్తారా? అనేది లోకేశ్ చేతల్లో వుంది. మరి ఆయన ఏం చేస్తారో చూద్దాం.