ఓటమికి కారణాలు వెదుక్కుంటున్న బీజేపీ..!

బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం గ్యారెంటీ అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే వైసీపీకి వచ్చే మెజార్టీ ఎంత, బీజేపీకి ఈసారైనా డిపాజిట్ వస్తుందా అనే విషయాలపై క్లారిటీ కోసం అందరూ వేచి…

బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం గ్యారెంటీ అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే వైసీపీకి వచ్చే మెజార్టీ ఎంత, బీజేపీకి ఈసారైనా డిపాజిట్ వస్తుందా అనే విషయాలపై క్లారిటీ కోసం అందరూ వేచి చూస్తున్నారు. ఎన్నికల నుంచి తప్పించుకున్న టీడీపీ, జనసేన.. పూర్తిగా ఈ ఉప-సమరం జోలికే రావడం లేదు.

జనసేన ప్రచారం చేస్తుందనుకున్నా అది బీజేపీ భ్రమేనని తేలిపోయింది. దీంతో బీజేపీ సీనియర్లు పరాభవాన్ని ముందే ఊహించి.. దానికి కారణాలు వెదుక్కుంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖాస్త్రాలు సంధించుకుంటూ వాటిని మీడియా, సోషల్ మీడియాలో హైలెట్ చేస్తూ హడావిడి చేస్తున్నారు.

బీజేపీలో చేరికలా.. హవ్వ..

సోము వీర్రాజు బద్వేల్ ఉప ఎన్నికలను అన్నీ తానై నడిపిస్తున్నారు. ఆయన ఎక్కడ ఏ ప్రచార సభకు వెళ్లినా.. ముందు కండువాలు కప్పేస్తున్నారు. 

వైసీపీ, టీడీపీ నుంచి తమ పార్టీలోకి కార్యకర్తలు వస్తున్నారంటూ వలసలకు స్వాగతం చెబుతున్నారు. ఇదంతా అందరికీ కామెడీ అనిపిస్తుంది. వైసీపీనుంచి బీజేపీలో చేరికలేంటని ప్రశ్నిస్తున్నారు, కానీ వీర్రాజు మాత్రం కండువాలు కప్పడం ఆపడంలేదు.

వైసీపీ దౌర్జన్యాలు.. ఇది మరో కామెడీ..

బద్వేల్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందట. ఈ మాట బీజేపీ నేతలు పదే పదే కేంద్ర ఎన్నికల సంఘానికి చెబుతున్నారు. స్థానిక బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారట. పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా మారారని, ఎస్సై స్థాయి నుంచి, డీఎస్పీ స్థాయి అధికారి వరకు అందరినీ బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సోము వీర్రాజు తాజాగా ఫిర్యాదు చేశారు. 

గతంలో కూడా కేంద్ర బలగాలను ఎన్నికల కోసం పంపాలని కోరారు వీర్రాజు. అసలు బీజేపీని వైసీపీ లెక్కలోకే తీసుకోలేదని, బీజేపీ అభ్యర్థి గెలుస్తారని వైసీపీ భయపడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఇది మరో కామెడీ అంటున్నారు.

ఓటమికి ముందే ప్రిపేర్ అయ్యారా..?

బద్వేల్ లో బీజేపీకి గెలిచేంత సీన్ లేదు. కనీసం డిపాజిట్లు వస్తాయని కూడా నమ్మకం లేదు. ఈ క్రమంలో తమపై దౌర్జన్యాలు చేస్తున్నారని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారంటూ.. పదే పదే వైసీపీపై నిందలేస్తూ కాలం గడుపుతున్నారు బీజేపీ నేతలు. డిపాజిట్లు దక్కించుకున్నా అదే పదివేలని అనుకుంటున్నారు. 

ఓటమికి ముందుగానే కారణాలు వెదికి పెట్టుకుంటున్నారు. ఫలితాల తర్వాత చెప్పాల్సిన మాటల్ని ముందే ప్రిపేర్ అవుతున్నారు.