నాయకుల వారసులే రాజకీయాల్లో సక్సెస్ అయ్యే రోజులివి. అడపాదడపా జగన్ వంటి నేతలు.. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని గోరంట్ల మాధవ్ వంటి పోలీస్ ఆఫీసర్స్ ని, గురుమూర్తి లాంటి డాక్టర్లను, నందిగం సురేష్ వంటి నిరుపేద దళితుల్ని తెరపైకి తెచ్చి వారిని ప్రోత్సహించారు. వివిధ కులాల కార్పొరేషన్లకు చైర్మన్లుగా డైరెక్టర్లుగా కూడా యువతకి అవకాశాలిచ్చి ప్రోత్సహించారు.
కొత్తతరం నాయకులకు జగన్ అలా బాటలు వేశారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం దాదాపుగా రాజకీయాల్లోకి రావాలనుకునే ఔత్సాహికుల ఆశల్ని నీరుగార్చారు. వారి ఆశల్ని ఆదిలోనే తుంచేశారు. ఇక జీవితంలో మాకు ఈ రాజకీయాలు వద్దు బోబోయ్ అని పారిపోయేలా చేశారు.
ఔత్సాహికులంతా ఔట్
అవును, పవన్ ని నమ్ముకుని రంగంలోకి దిగిన డాక్టర్లు, లాయర్లు, ఇతర వృత్తులవారు గత ఎన్నికల్లో నిండా మునిగిపోయారు. పొత్తులు లేవు కాబట్టి, అడిగినవాళ్లకి కాదనకుండా పవన్ టికెట్లు పంచారు. చాలా చోట్ల ఆయన ప్రచారానికి వస్తారనుకుని ఆశగా ఎదురు చూసిన అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ ఓడిపోయారు.
రాజకీయాలంటే భయపడిపోయారు, కనీసం భవిష్యత్తు అయినా ఉంటుందా అంటే అదీ లేదు. పవన్ ఎప్పుడు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో, ఎవరితో ఉంటారో తెలియదు కాబట్టి.. దాదాపు 50శాతం మంది ఔత్సాహికులు 2019 ఎన్నికల తర్వాత జనసేన నుంచి బయటకు వచ్చేశారు. ఇక మిగిలిన వాళ్లకు పవన్ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం.
సోకాల్డ్ మేథావులని చెప్పుకునేవారు కూడా పవన్ ని ఎన్నికలకు ముందు, ఆ తర్వాత వీడిపోయారు. ఇక తమ పనులు మానుకుని మరీ రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయాలని కలలుగన్న యువత కూడా పూర్తిగా నిరాశలో మునిగిపోయి రాజకీయాలకు దూరమైంది.
కొంతమంది మాత్రమే ఇంకా పవన్ పై నమ్మకం ఉంచుకుని రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అలాంటి వారంతా మరింత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటారని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారబోతోంది. 2024 తర్వాత రాజకీయాల్లో రాణించాలనే యువతరం కాస్తా పవన్ పుణ్యాన తిరిగి వెనక్కి వెళ్లిపోయే అవకాశముంది.
పవన్ ఈక్వేషన్స్ మారాయి..
ఒకప్పుడు రాజకీయాలతో సంబంధం లేని యువతకు పిలిచి మరీ అవకాశాలిచ్చారు పవన్ కల్యాణ్. సరికొత్త రాజకీయాలకు, అవినీతి రహిత రాజకీయాలకు నాంది పలుకుతామని చెబితే అంతా నిజమే అనుకున్నారు. కానీ ఇప్పుడు పవన్ వ్యవహారశైలి పూర్తిగా మారిపోయింది. ఆయన ప్రస్తుతం కులాల లెక్కలేస్తున్నారు. ఆ ఈక్వేషన్స్ పైన జనసేన బండిని పరుగులు పెట్టించాలనుకుంటున్నారు. కాబట్టి ఎన్నికల్లో టిక్కెట్లు కూడా ఆ ప్రాతిపదికనే ఇచ్చే అవకాశం ఉంది.
మరోవైపు 2024 కోసం ఇప్పట్నుంచి పొత్తు ప్రయత్నాల్లో ఉన్నారు పవన్. ఆల్రెడీ బీజేపీతో అలయెన్స్ నడుస్తోంది. ఎన్నికల నాటికి టీడీపీ కూడా ఈ పొత్తులోకి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే జరిగితే, జనసేన తరఫున టిక్కెట్ కోసం ఆశలు పెట్టుకున్న ఔత్సాహికులకు పెద్ద దెబ్బ తగలడం ఖాయం.
పవన్ రాజకీయాలతో ప్రజలకి వచ్చే నష్టమేమీ లేదు కానీ.. ఆయన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చిన ఆశావహులు మాత్రం పూర్తిగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది.