సరిగ్గా గత ఏడాది మే నెల నుంచి, ఇప్పటి వరకూ చూసుకుంటే.. దేశంలో పెట్రోల్ లీటర్ కు పెరిగిన ధర రూ.36 రూపాయలు! అటు ఇటుగా లీటర్ పెట్రోల్ ధర 110 గా అనుకుంటే, ఇందులో ఏకంగా మూడో వంతు కేవలం ఏడాదిన్నరలో పెరిగిందే! ఏడాదిన్నర కిందట కరోనా భయంతో లోక్ సభ నిరవధిక వాయిదా పడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం పెట్రో సర్ చార్జీల పరిమితి పెంపుకు అనుగుణంగా చట్టం చేసుకుంది.
అప్పటి వరకూ పెట్రో ఉత్పత్పులపై విధించడానికి ఉన్న సర్ చార్జీలకు ఉన్న పరిమితిని మోడీ సర్కారు పెంచింది. ట్యాక్స్ రూపంలో కాకుండా, సర్ చార్జీల రూపంలో ధరను పెంచుకుంటూ పోయే మార్గాన్ని పట్టుకుంది. దీని వల్ల రాష్ట్రానికి వాటాను ఇవ్వనక్కర్లేదు. పెరిగిన ధరలంతా కేంద్రం ఖాతాలోకే వెళ్లిపోతాయి.
మోడీ భక్తులు పెట్రో ధరల మాటెత్తితే, రాష్ట్రాలకు వాటా పోతోందని, రాష్ట్రాలు పన్నులు తగ్గించోవాలనే వాట్సాప్ యూనివర్సిటీ వాదన వినిపిస్తూ ఉంటారు. అయితే మోడీ గారొచ్చాకా.. రాష్ట్రాలకు మిగిలింది బొచ్చే, సర్ చార్జీల రూపంలో అంతా కేంద్రం బొక్కసానికే వేసుకుంటున్నారని, దీని కోసం లోక్ సభలో చట్టాలను చేసి సర్ చార్జీల పరిమితులను పెంచుకుంటున్నారనే మాటను కన్వీన్సింగ్ గా దాచేస్తూ ఉంటారు.
అయినా.. మోడీలాంటి మహనీయ పాలకుడు ఉన్నాకా.. అన్నింటికీ సాకులు చెప్పడమేనా! చరిత్ర ఎరగని స్థాయిలో ధరల పెరుగుదల అంటే, ఈ విషయంలో రాష్ట్రాలు, అంతర్జాతీయం అంటూ కహానీలు చెప్పడమేనా! అవన్నీ ఎప్పుడూ ఉంటాయి.
మరి మోడీ ఏం చేస్తున్నారనేది కదా.. ప్రశ్న! అంతర్జాతీయ పరిస్థితులు, రాష్ట్రాల వాటాలు.. అనే పోచికోలు వాదనలు చేయాల్సింది అసమర్థులు కదా! అయినా అంతర్జాతీయంగా క్రూడ్ ఏనాడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయినప్పుడే కదా.. మోడీ మహాశయులంగారు రోజువారీగా పెట్రోల్ బాదుడు పెంచుతూ పోయింది!
ఏడాదిన్నరలో లీటరుకు 36 రూపాయలు పెంచారు. అరవై యేళ్ల కాంగ్రెస్ హయాంలో లీటర్ కు 60 రూపాయలకు గరిష్టంగా అమ్మిన లీటర్ పెట్రోల్ ను ఆరేళ్లలోనే రెట్టింపు ధరకు చేర్చారు. బహుశా బీజేపీ లెక్కలో ఇదే కాబోలు అభివృద్ధి అంటే. ఇంతటితో ఆగేలా కూడా లేదు. రోజువారీగా బాదుతూనే ఉన్నారు కాబట్టి.. అతి త్వరలోనే లీటర్ పెట్రోల్ ధర 150 రూపాయలకు చేరుకున్నా ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు.
బహుశా ఇంకో ఏడాది, ఏడాదిన్నర లేదా రెండేళ్లలో.. మోడీకి ఈ సారి టర్మ్ పూర్తయ్యే సరికి… లీటర్ పెట్రోల్ రూ.150 కు చేరుతుందని ముందుగానే ప్రజలు ప్రిపేర్ అయి ఉండాలి. ఈ మేరకు భక్తులు వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా జనాలను ప్రిపేర్ చేయడం మొదలుపెడితే మంచిదేమో!