డైరెక్టర్ రాసిచ్చిన డైలాగ్స్ మాత్రమే హీరోలు చెబుతారని తెలిసి. కానీ ఎవరో రాసిచ్చిన నాలుగు వాక్యాలను ట్వీట్లు చేస్తారని ఇప్పుడే తెలిసొస్తోంది. ఆ పని టాలీవుడ్ హీరో రామ్ పోతినేని చేశాడు. ఏకంగా ఆయన ముఖ్యమంత్రి జగన్‌పై ట్విటర్ వేదికగా అక్కసు వెళ్లగక్కాడు. వరుస ట్వీట్లతో తన బుద్ధి బయట పెట్టుకున్నాడు. కనీసం పది మంది చనిపోయారనే బాధ ఆయనలో ఇసుమంత కూడా కనిపించలేదు.
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనపై హీరో రామ్ పోతినేని స్పందిస్తూ… పెద్ద కుట్ర జరుగుతోందంటూ సీఎం జగన్‌పై ట్వీట్ చేశాడు. ఆయన ట్వీట్లు వివాదాస్పదంగా ఉన్నాయి. ఇంతకూ రామ్ ట్వీట్లు ఏంటో, వాటి కథేంటో చూద్దాం.
‘హోటల్ స్వర్ణ ప్యాలస్‌ని రమేశ్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్‌గా మార్చక ముందు, ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు?’ అని ఆయన ప్రశ్నించాడు. అలాగే మరో ట్వీట్లో ఫైర్ + ఫీజు = ఫూల్స్ అంటూ కామెంట్ పెట్టాడు. అందరినీ ఫూల్స్ చేయడానికే విషయాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మళ్లిస్తు న్నారా? అని ఘాటుగా ప్రశ్నించాడు. దీనివెనక పెద్ద కుట్ర జరుగుతున్నట్టుందని ఆయన అనుమానం వ్యక్తం చేశాడు.
‘మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ రెప్యుటేషన్‌కీ, మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది. వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం’ అని ట్వీట్ చేశాడు. ముఖ్యమంత్రిపై నిందలన్నీ వేసి…చివర్లో ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నామంటూ కొసమెరుపు మాటలు రామ్‌కే సొంతమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పది మంది కాలి బూడిదైతే స్పందించని హీరో గారు…ఇప్పుడు తగదునమ్మా అంటూ ట్వీట్లు చేసి తానెవరి పక్షమో చెప్పకనే చెప్పాడు. రామ్ ట్వీట్లపై మృతుల బాధితులు, వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మనుషుల ప్రాణాలంతే అంత లెక్కలేని తనమా? అసలు ఆ సంఘటనకు, రామ్‌కు ఉన్న సంబంధం ఏంటో వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదేం సినిమా కాదని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, హీరో అని ఊరికే విడిచి పెట్టరనే విషయాన్ని గుర్తించుకోవాలని వైసీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి.