చంద్రబాబు జూమ్ లోకి వస్తున్నారంటే చాలు.. సోషల్ మీడియా మొత్తం హడలి పోతోంది. బాబుగారి కొత్త థియరీ వినడానికి టీడీపీ నేతలే జంకుతున్న పరిస్థితి. ఈసారి తన పైత్యాన్ని మరింతగా జనంపైన రుద్దేందుకు ముందుకొచ్చారు బాబు. అసలు ఏం చెబుతున్నారో, ఎందుకు చెబుతున్నారో ఆయనకు కూడా తెలియని పరిస్థితి. చివరికి “ఈనాడు” కూడా చంద్రబాబు జూమ్ మీటింగ్ పూర్తైపోయి గంటలు గడుస్తున్నా.. ఏ పాయింట్ మీద వార్త ఇవ్వాలో ఆలోచించి అసలు ఏదీ ఇవ్వకుండానే సరిపెట్టిందంటే బాబు ఏం చెప్పారనే విషయాన్ని ఈజీగా జనం అర్థం చేసుకోవచ్చు.
10 రోజుల్లో ఇది నా ఐదో ప్రెస్ కాన్ఫరెన్స్.. అంటూ మొదలుపెట్టిన బాబు.. ఆంధ్రప్రదేశ్ కోసమే అమరావతి, అమరావతికోసం ఆంధ్రప్రదేశ్ కాదు అంటూ కొత్త థియరీ చెప్పారు. అమరావతి అనేది స్వయం సమృద్ధి గల ప్రాజెక్ట్ అని, అక్కడ ఖర్చు పెట్టే ప్రతి రూపాయిపై పదిరూపాయలు ఆదాయం వస్తుందని, ఆ ఆదాయాన్ని మొత్తం వైసీపీ ప్రభుత్వం కాలరాసిందని మండిపడ్డారు. తాను అనుకున్న విధంగా అమరావతిని అభివృద్ధి చేసి ఉంటే 2లక్షల కోట్లనుంచి 3లక్షల కోట్ల సంపాదన వచ్చేదని కాకి లెక్కలు చెప్పారు.
2లక్షల కోట్లకి, 3 లక్షల కోట్లకి మధ్య లక్ష కోట్ల రూపాయల తేడా ఉంది. అంటే బాబు ఎంతగా గాలి లెక్కలు చెప్పారో అర్థం చేసుకోవచ్చు. అమరావతిలో 50వేల రూపాయలు ఖర్చు పెడితే అందులో 40నుంచి 50 శాతం పన్నుల ద్వారా సమకూర్చుకోవచ్చని కూడా సెలవిచ్చారాయన. అలాంటి అమరావతిని వైసీపీ చేతులారా చెడగొట్టిందని మొసలి కన్నీరు కార్చారు. ఎంతసేపు బాబు అమరావతిని దాటి బైటకు రాలేకపోవడమే ఆశ్చర్యకరమైన విషయం.
సంక్షోభ సమయంలో ప్రజలు తనని ఎన్నుకున్నారని, గురుతరమైన బాధ్యతను తనపై పెట్టారని గుర్తు చేసుకున్నారు బాబు. మరి అదే లాజిక్ జగన్ కి కూడా ఉంది కదా. ఆయనపై కూడా గురుతర బాధ్యత పెట్టి ప్రజలు ఎన్నుకున్నారు కదా, ఏకంగా 151సీట్లు కట్టబెట్టారు కదా, ఆ గురుతర బాధ్యత నెరవేర్చాల్సిన పని జగన్ దే కదా? మరి మధ్యలో చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడటం దేనికి? జగన్ పని జగన్ ని చేసుకోనివ్వచ్చు కదా? ఇంకా తానే సీఎంని అనుకుంటూ రోజు తప్పించి రోజు ప్రెస్ మీట్లు పెట్టి జనాల్ని చావగొడితే ఎలా?
ఇక తాజా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు రాజీనామాలపై మరోసారి వైసీపీని ప్రశ్నించారు. అయితే గతంలో లాగా 48గంటల డెడ్ లైన్, డిమాండ్ లాంటివేవీ లేవు.. బాబ్బాబు రాజీనామా చేయండి ప్లీజ్ అంటూ బతిమిలాడుకున్నట్టు అడిగారు. అసెంబ్లీని రద్దుచేయండి, పోటీచేసి గెలవండి నేనిక అమరావతి మాటే ఎత్తను అన్నారు.
ఎలాగూ 2024 ఎన్నికలు జరుగుతాయి కదా.. అప్పటిదాకా ఓపిక పడితే చంద్రబాబుకి ప్రజలు ఏమనుకుంటున్నారో తేలిపోతుంది కదా. అయితే అంతవరకు బాబు ఆగలేకపోతున్నారు. ఆక్ ఈజ్ పాక్.. పాక్ ఈజ్ ఆక్ అంటూ రోజుకో చెత్త లాజిక్ తో జనాల్ని చంపేస్తున్నారు.