అగ్రరాజ్యం అమెరికాలో సైతం గలీజు రాజకీయాలకు తక్కువేం కాదని తెలుస్తోంది. దీనికి నిదర్శనం కమలాహారిస్‌పై సాగుతున్న దుష్ప్రచారమే. అమెరికాలో నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారతీయ-ఆప్రో అమెరికన్ మహిళ కమలాహారిస్ ఎంపికైంది. దీంతో తమకు బలమైన పోటీ ఇవ్వడమే కాకుండా, ఓటమికి కారణమవుతారనే ఉద్దేశంతో ఆమెపై కుట్రలకు తెరలేపారు.
కమలా అమెరికాలో పుట్టలేదని, ఉపాధ్యక్ష పదవికి అర్హురాలు కాదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్గం పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది. కమల నైతికంగా, మేధోపరంగా దిగజారిన మనిషి అని అత్యంత దిగువ స్థాయి ఆరోపణలకు తెగబడ్డం చూస్తే ఆశ్యర్యం, ఆందోళన కలగక మానవు. అందులోనూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం విమర్శలకు దారి తీసింది.
‘అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసే అర్హత కమలకు లేదని చెప్తున్నారు. ఈ మాటలు అన్నది ఏ సాదాసీదా వ్యక్తో అయి ఉంటే పట్టించుకునే వాన్ని కాదు. కానీ గొప్ప ప్రతిభావంతుడైన, ఉన్నత విద్యావంతుడైన న్యాయవాది కమలాకు అర్హత లేదంటున్నాడు. అది నిజమోకాదో నాకైతే తెలియదు. కానీ ఆమెను ఎంపిక చేసుకునేముందు డెమోక్రాట్లు ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఉండాల్సింది. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన విషయం. దీన్ని నేను పరిశీలిస్తా’ అని ట్రంప్ మీడియాతో చెప్పుకొచ్చారు. మన దేశంలోనే దరిద్రమైన రాజకీయాలు అనుకుంటే…అగ్రరాజ్యంలోనూ మనకేం మాత్రం తీసిపోని విధంగా క్షుద్ర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇదిలా ఉండగా ట్రంప్ పార్టీ రిపబ్లికన్ల ఆరోపణలను జో బిడెన్ బృందం తిప్పికొట్టింది. కమలా పుట్టుక వివరాలపై ఏ మాత్రం అర్థంపర్థంలేని వివాదాలు సృష్టిస్తున్నారని బిడెన్ ప్రచార జాతీయ కమిటీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ప్రకారం అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు చేపట్టే వ్యక్తులు 1787 తర్వాత అమెరికాలోనే జన్మించి పుట్టుకతో సహజ పౌరసత్వం పొందినవారై ఉండాలి. కమలా హారిస్ 1964 అక్టోబర్ 20న కాలిఫోర్నియాలోని ఆక్లాండ్‌లో జన్మించారు’ అని తెలిపారు.
కమలా అభ్యర్థిత్వంపై సాగుతున్న దుష్ప్రచారం చూస్తుంటే…ఆమె అంటే ట్రంప్ ఎంతగా భయపడుతున్నారో తెలిసిపోతోంది. ఇప్పటికే ట్రంప్ పరాజయం తప్పదని అనేక సర్వేలు చెబుతున్నాయి. బహుశా ఆ ఒత్తిడిలో ఎంత దారుణమైన దుష్ప్రచారానికైనా వెనుకాడేలా లేరు.