పీపుల్ మీడియా టైమ్ నడుస్తోంది

టాలీవుడ్ లో పెద్ద బ్యానర్లు అంటే మైత్రీ..హారిక..దిల్ రాజు అంటూ టక్కున చెప్పేస్తారు సినిమా అభిమానులు. కానీ మరో బ్యానర్ కూడా సైలంట్ గా పెద్ద బ్యానర్ గా మారుతోంది. చేతిలో చిన్న, పెద్ద…

టాలీవుడ్ లో పెద్ద బ్యానర్లు అంటే మైత్రీ..హారిక..దిల్ రాజు అంటూ టక్కున చెప్పేస్తారు సినిమా అభిమానులు. కానీ మరో బ్యానర్ కూడా సైలంట్ గా పెద్ద బ్యానర్ గా మారుతోంది. చేతిలో చిన్న, పెద్ద 16 సినిమాలు వున్నాయి. ప్రభాస్ తో సినిమా, పవన్ తో సినిమా. ఇంకా చాలా. అదే పీపుల్ మీడియా. ప్రస్తుతం ఆ బ్యానర్ టైమ్ నడుస్తోంది.

కార్తికేయ 2. సినిమా విడుదల ముందు విపరీతమైన టెన్షన్. చేసిన ఖర్చుకు, వచ్చిన రాబడికి చూసుకుంటే మైనస్ నే. కేవలం థియేటర్ లో సినిమా ఆడడం మీదే ఆశలు. ఎక్కవకు అమ్మడం..వెనక్కు ఇవ్వడం ఇలాంటి తలకాయనొప్పలు ఎందుకని రీజనబుల్ గా అమ్మేసారు. నైజాం మూడుకోట్లకు కాస్త అటు ఇటుగా ఇస్తామన్నా ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. జస్ట్ అడ్వాన్స్ మీద రిలీజ్ చేసారు. జాక్ పాట్ కొట్టింది. ఆంధ్రలో ఓవర్ ఫ్లోస్, నైజాం, హిందీలో స్వంత విడుదలతో డబ్బులే డబ్బులు. హీరో, దర్శకుడు, ముగ్గురు నిర్మాతలు హ్యాపీగా లాభాలు సంపాదించారు.

ధమాకా..విడుదలకు ముందు పైకి ఏమీ రాకున్నా, సినిమా ఎలా వుంటుందో, రెగ్యులర్ మాస్ ఎంటర్ టైనర్లను ఈ మధ్య ఆదరించడం లేదు అన్న బెరుకు. ఆంధ్ర ఏరియాను 11 కోట్ల రేషియోలో బిజినెస్ క్లోజ్ చేసారు. నిజానికి రవితేజ సినిమాలు ఫ్లాపులవుతున్నాయి కనుక ఈ రేట్. అదే హిట్ అయితే వేరే. తీరా విడుదల దగ్గరకు వచ్చాక ఎందుకయినా మంచింది. వస్తే ఓవర్ ఫ్లోస్ వస్తాయని 11 నుంచి తొమ్మిది కోట్లకు తగ్గించుకుని ఇచ్చారు సినిమాను.

అలాగే నైజాంలో ఆరు కోట్ల అడ్వాన్స్ మీద స్వంతగా విడుదల చేసుకున్నారు. నైజాంలో మొదటి నాలుగు రోజుల్లోనే ఆరుకోట్ల పాతిక లక్షలు వచ్చింది. అంటే ఇక ఏం వచ్చినా లాభాలే. ఇప్పుడు ఈ సినిమాకు ఇద్దరే భాగస్వాములు..విశ్వప్రసాద్..వివేక్ కూచిభొట్ల. నైజాంలో15 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే ఒక్క నైజాంలోనే నిర్మాతలు ఇద్దరికీ చెరో నాలుగు కోట్ల వంతున లాభాలు రావచ్చు.

గోపీచంద్-శ్రీవాస్ రామబాణం, అవసరాల శ్రీనివాస్-నాగశౌర్య ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి సినిమాలో త్వరలో ఈ సంస్థ నుంచి రాబోతున్నాయి.