ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిన, వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేసిన టీడీపీ… అధికారం పోగానే పరిరపక్షణ పేరుతో కొత్త డ్రామాలకు తెరలేపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ఆధ్వర్యంలో విజయవాడలో ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం… ప్రజాస్వామ్య పరిరక్షణ అనే అంశంపై అఖిలపక్ష సమావేశం జరిగింది. టీడీపీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగడం, వామపక్షాలు, రాబోయే కాలంలో కలిసి పోటీ చేయనున్న పార్టీలు హాజరు కావడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఆప్, టీడీపీ అనుబంధ ప్రజాసంఘాల నేతలంతా హాజరయ్యారు. అంతా కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు చేయడం గమనార్హం. అధికారం లేకపోతేనే టీడీపీకి ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం, ఆ పార్టీకి ప్రతిపక్షాలు వంత పాడడం విమర్శలకు దారి తీసింది. వీరి ప్రజాస్వామ్య పరిరక్షణపై సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి.
విద్యుత్ ఉద్యమంలో అమాయకుల ప్రాణాల్ని బలిగొన్నవాడు, నాయీ బ్రాహ్మణుల తోక కత్తెరిస్తానని వెటకరించిన ముఖ్యమంత్రి, ప్రజాసంఘాల్ని తొక్కేస్తానని నీలగిన నేత, ఏ ఇజమూ లేదు… టూరిజమే అసలు ఇజమని అవాకులు, చెవాకులు పేలినవాడు…ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ అని రంకెలేస్తు న్నాడంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. బషీర్‌బాగ్ కాల్పుల్లో కార్యకర్తల ప్రాణాలు పోవడానికి కారణమైన చంద్రబాబు రాక్షస పాలనను తమకు అనుకూలంగా వామపక్షాలు మరిచిపోవడం వారికే చెల్లిందని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు.
23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు వైసీపీ పార్లమెంట్ సభ్యుల్ని తమ పార్టీలో చేర్చుకోవడంతో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చిన పార్టీ ఆధ్యర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అఖిలపక్షం సమావేశం నిర్వహించడం హాస్యాస్పదం అని నెటిజన్లు తూర్పారపడుతున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ వ్యతిరేక శక్తులను ఏకం చేయడానికే ప్రజాస్వామ్య పరిరక్షణ అనే ముసుగు తగిలించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.