సినిమా ఫంక్షన్లలో ప్రసంగాల భలేగా వుంటాయి. ప్రేమలు పొంగిపోతాయి. అభిమానాలు అవధులు దాటుతాయి. కానీ తెరవెనుక వినిపించే సంగతులు వేరుగా వుంటాయి.
నిన్నటికి నిన్న వాల్తేర్ వీరయ్య సినిమా ఫంక్షన్ లో భలే మాటలు వినిపించాయి. అన్నయ్య సినిమా అంటే చాలు చేసేస్తా అన్నారు రవితేజ. మెగాస్టార్ కోసం డేట్ లు అడ్జస్ట్ కూడా చేసుకుని నటించారు అంటూ తెగ చెప్పుకువచ్చారు దర్శకుడు బాబీ. అంతే కాదు. మైత్రీ మూవీస్ అస్సలు డబ్బు గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్లారన్నారు.
కానీ తెరవెనుక గుసగుసలు వేరుగా వున్నాయి. సుమారు 44 నిమిషాల పాటు సినిమాలో కనిపించే ఈ ప్రత్యేక పాత్ర కోసం రవితేజ 17 కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. 12 కోట్ల నుంచి బేరం ప్రారంభమై ఆఖరికి 17 కోట్ల దగ్గర నిర్మాతలు ఓకె అన్నారని టాక్.
అలాగే మెగాస్టార్ సినిమా అనగానే ఊర్వశి రౌతాలా ఎగిరి గంతేసి, ఒక్క ఫోన్ కాల్ తో ఓకె చెప్పారన్నది బాబీ వెర్షన్. ఆమె కూడా చిరంజీవి సినిమాలో నటించడం తన డ్రీమ్ అన్నట్లు చెప్పుకువచ్చారు.
కానీ తెరవెనుక సంగతి వేరే అని వినిపిస్తోంది ఇండస్ట్రీలో. ఈ సాంగ్ చేయడానికి ఊర్వశి రౌతాలా ఒకంతట ఒప్పుకోలేదు. దర్శకుడు బాబీ కిందా మీదా పడడం, మరో దర్శకుడు సంపత్ నంది ద్వారా ఊర్వశి రౌతాలాను ఒప్పించడం జరిగింది. టాలీవుడ్ లో అంతే.