బాబు పల్లకీ మోయడానికి బీజేపీ నాట్ రెడీ!

పల్లకీ మోయడం అంటేనే కనీసం ఇద్దరు బోయీలు కావాల్సిందే కదా? మరి చంద్రబాబునాయుడు పల్లకీ మోస్తూ.. ఆయనను ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీలోకి తీసుకుని రావాలంటే.. అంత బాధ్యతల బరువున్న పల్లకీ మోయడానికి ఎందరు బోయీలు…

పల్లకీ మోయడం అంటేనే కనీసం ఇద్దరు బోయీలు కావాల్సిందే కదా? మరి చంద్రబాబునాయుడు పల్లకీ మోస్తూ.. ఆయనను ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీలోకి తీసుకుని రావాలంటే.. అంత బాధ్యతల బరువున్న పల్లకీ మోయడానికి ఎందరు బోయీలు కావాలి? ఒకే ఒక్క బోయీ ఉంటే సరిపోదు కదా? కానీ ప్రస్తుతానికి అందుకు సిద్ధంగా ఉన్నది, ఉబలాటపడుతున్నది.. ఒకే ఒక్క బోయీ పవన్ కల్యాణ్! తనకు తోడుగా మరో బోయీగా బిజెపిని కూడా తెచ్చుకోవాలనేది పవన్ కల్యాణ్ కోరిక. కానీ ఆయన కోరిక మాత్రం ఫలించేలా లేదు. పవన్ కల్యాణ్ ఎన్నిరకాల హస్తిన మంత్రాలు పఠించినా, రాష్ట్ర నాయకులందరినీ బైపాస్ చేస్తూ ఢిల్లీ టీమ్ తో మాత్రమే మాట్లాడుతూ బైపాస్ రాజకీయం నడిపినా ఆయన కోరిక మాత్రం తీరేలా కనిపించడం లేదు. 

తాజాగా విజయవాడలో తెలుగుదేశం పార్టీ.. జగన్ ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడానికి ఒక సమావేశం నిర్వహించింది. ఎజెండా.. జగన్  మీద బురదచల్లడం ఒక్కటే అయినప్పటికీ.. అఖిలపక్ష సమావేశం అని దానికి పేరు పెట్టారు. ప్రభుత్వమే రాష్ట్రంలో రాజకీయ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నది లాంటి చవకబారు పాయింట్లు అందులో పెట్టారు గానీ.. వాస్తవంలో.. జగన్ మీద బురద చల్లడానికి ఏయే పార్టీలు తమ వెన్నంటి ఉండబోతున్నాయి. ఎవరిమీద తాము డిపెండ్ కావొచ్చు అని క్రాస్ చెక్ చేసుకోవడమే. ఈ సమావేశం విషయంలో పవన్ కల్యాణ్ చాలా అతితెలివిగా వ్యవహరించారు. 

తెలుగుదేశం తరఫున రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో సమావేశం జరుగగా.. తనది, నాదెండ్లది కూడా కేవలం మోడీ స్థాయి మాత్రమే అని భావించుకునే పవన్ కల్యాణ్ తమ పార్టీ తరఫున ద్వితీయ శ్రేణి నాయకుల్ని పంపారు. కాంగ్రెస్ కూడా అదే పనిచేసింది. కానీ వామపక్షాల తరఫునుంచి మాత్రం కీలక నాయకులు హాజరయ్యారు. అందరూ కలిసి జగన్ ని ఆడిపోసుకున్నారు.

అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే.. ఈ అఖిలపక్ష సమావేశానికి బిజెపి హాజరు కాలేదు. సరిగ్గా రెండే రోజుల క్రితం జనసేన నాయకులతో కలిసి వాజపేయి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నేతలు, జనసేనతో కలిసి జగన్ ప్రభుత్వం మీద పోరాడుతాం అని పెద్ద మాటలేచెప్పారు. కానీ.. తెలుగుదేశం ఆధ్వర్యంలో జనసేన కూడా పాల్గొన్న సమావేశానికి మాత్రం డుమ్మా కొట్టారు. కనీసం తృతీయశ్రేణి నాయకులను కూడా సమావేశానికి పంపలేదు. 

తెలుగుదేశం అనేది తమకు ఎన్నటికీ అంటరాని పార్టీ అనే స్పష్టమైన సంకేతాలు ఇవ్వడానికే బిజెపి గైర్హాజరు అయినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబునాయుడు కూడా 2014 లాగా మూడు పార్టీలు కలిసి పోటీచేసి.. అదే మ్యాజిక్ ను రిపీట్ చేసి మళ్లీ అధికారంలోకి రావాలని కలగంటూ ఉండవచ్చు గాక.. అందుకే ఆయన మోడీ పట్ల, బిజెపి పట్ల అతిమెత్తటి ధోరణితో విధేయతతో మెలగుతుండవచ్చు గాక.. కానీ, ఆయన కలలు నెరవేర్చడానికి బిజెపి సిద్ధంగా లేదనేది స్పష్టం. మరి ఈ సంగతి పవన్ కల్యాణ్ కు ఎప్పటికి అర్థమవుతుందో ఏమో?