దేశంలో వినియోగించిన కరోనా నివారణ వ్యాక్సిన్ డోసేజుల సంఖ్య వంద కోట్లను దాటేసింది. రమారమీ 180 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరం అనుకుంటే, అందులో సగానికన్నా కాస్త ఎక్కువ పరిమాణంలో వ్యాక్సిన్ డోసులను వినియోగించారు. కరోనాపై పోరులో దీన్నొక కీలక పరిణామంగా చెబుతున్నారంతా. అటు ప్రభుత్వం, ఇటు వ్యాక్సిన్ కంపెనీలు, వైద్య పరిశోధకులు ఈ పరిణామం పట్ల ఉత్సాహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
వినియోగించిన వంద కోట్ల వ్యాక్సిన్ డోసులతో చాలా మందికి కనీసం ఒక డోసు వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. అనేక మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ కూడా పూర్తయ్యింది. అయితే ఇంకా రెండో డోసు వ్యాక్సిన్ పొందాల్సిన వారి సంఖ్య గణనీయంగా ఉంది. అటు ఇటుగా ఇంకా ఎనభై కోట్ల వ్యాక్సిన్ డోసులను వినియోగించాల్సి ఉంది. ఇదే ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న అతి పెద్ద సవాల్!
ఉత్పత్తి విషయంలో ఎనభై కోట్ల టార్గెట్ ను అందుకోవడం కష్టం కాకపోవచ్చు. అయితే వాటిని ప్రజలకు వేయడం విషయంలోనే అసలైన కష్టం ఉన్నట్టుగా ఉంది. ప్రజలు ఇప్పుడు కరోనా వ్యాక్సినేషన్ విషయంలో అంత ఆసక్తితో లేరు! ప్రత్యేకించి కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. వ్యాక్సిన్ వేయించుకోవడం పట్ల వారు అనాసక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు. రెండో డోసుకు వారి వంతు వచ్చినా కొన్ని కోట్ల మంది దాన్ని తీసుకోవడం లేదు! అలాగే ఇప్పటి వరకూ ఫస్ట్ డోసు వేయించుకోని వయోజనుల సంఖ్య కూడా గట్టిగా ఉంది.
విద్యావంతులు, చదువు లేకపోయినా అవగాహన ఉన్న వారు, ఉద్యోగులు, కరోనా భయం ఉన్న వారు… వీరంతా వ్యాక్సిన్ రెండు డోసుల విషయంలో మొహమాట పడటం కానీ, వెనుకడుగు వేయడం కానీ జరగడం లేదు. రెండు డోసుల వ్యాక్సినేషన్ పొంది ఉండటం అనేది.. తమకు తప్పనిసరి కావడం వల్ల కూడా చాలా మంది వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.
అయితే.. వ్యాక్సిన్ పట్ల ఇప్పటికీ భయం ఉన్న వారు, ఫస్ట్ డోస్ వేయించుకున్నప్పుడు జ్వరం తదితర ఇబ్బందులు పడ్డ వారు, కరోనా అంటే ఆది నుంచి లైట్ తీసుకున్న వారు.. వ్యాక్సిన్ కు దూరంగా ఉంటున్నారు. వీరిని పట్టి మరీ వ్యాక్సిన్ వేయడం ప్రభుత్వాధికారులకు, వైద్య సిబ్బందికి చాలా కష్టతరంగా మారింది.
ఏదేమైనా డిసెంబర్ నాటికి దేశంలో వయోజనులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయడం అంత తేలికగా అయితే కనపడటం లేదు. మరో 60 రోజుల సమయం ఉందనుకున్నా… ఆలోపు వీలైనంతగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వచ్చినా, ప్రజలను ఒప్పించి వాటిని వినియోగం అయ్యేలా చూసుకోవడం మాత్రం తేలికైన పనేమీ కాదు. ఉన్నంతలో ఊరట ఏమిటంటే, కనీసం ఒక డోసు వ్యాక్సిన్ ను వీలైనంత మందికి అందించడం, రెండో డోసు వ్యాక్సినేషన్ ను కూడా కొంతమందికి అందించగలగడం.
ఇక అక్టోబర్ లో మూడో వేవ్ అనే అంచనాలు కూడా నిజం కాకపోవడం మరో ఊరట. అక్టోబర్ నెలాఖరుకు చేరుకునే సరికి.. దేశంలో కరోనా కేసుల సంఖ్య అత్యంత కనిష్ట స్థాయికి చేరుతూ ఉంది. సెకెండ్ వేవ్ మొదలయ్యాకా.. ఇది కనిష్ట స్థాయి. ఫస్ట్ వేవ్ ముగిసిన తర్వాత కేసుల సంఖ్య ఎలా తగ్గిందో, ఇప్పుడు అదే స్థాయిలో కేసుల సంఖ్య కనిష్ట స్థాయికి చేరింది. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ప్రజల్లో చాలా మందికి కరోనా వచ్చి వెళ్లిపోవడం, ఇలాంటి వారి సంఖ్య అధికారిక గణాంకాల కన్నా చాలా ఎక్కువ ఉందని వివిధ పరిశోధనలు చెబుతున్నాయి.
ఎక్కువ శాతం మంది ప్రజల్లో కరోనాను ఎదుర్కొనగల యాంటీబాడీలు ఏర్పడ్డాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి. అలాగే వ్యాక్సినేషన్ కూడా కొత్త కేసుల తీవ్రతను తగ్గించడంలో గణనీయంగా పనిచేసి ఉండవచ్చు. ఇక కొంతమందిలో సహజసిద్ధమైన ఇమ్యూనిటీ పని చేసి ఉండవచ్చు. అలాగే.. కరోనా వైరస్ న్యూ మ్యూటెంట్లు తన తీవ్రతను పెంచేలా ఏమీ మారకపోయి ఉండవచ్చు. ఎలాగైతేనేం.. మూడో వేవ్ తో భయపెడుతుందనే అంచనాలతో వార్తల్లో నిలిచిన అక్టోబర్ చాలా ప్రశాంతంగానే పూర్తవుతూ ఉంది.
ఇక జనజీవనం విషయానికి వస్తే.. చాలా రొటీన్ దశకు వచ్చింది. మాల్స్ కళకళలాడుతున్నాయి. రోడ్లు రద్దీగా కనిపిస్తూ ఉన్నాయి. పండగ సీజన్లలో ప్రయాణాలు, షాపింగులు పూర్వపు స్థితికి చేరుతున్నాయి. ఒక రకంగా ప్రజలు కరోనాను పూర్తి లైట్ తీసుకుని ముందుకు సాగుతున్నారు. మరో నెల రోజుల పాటు పరిస్థితులు ఇలాగే సాగితే, కరోనా కేసుల సంఖ్య మరింతగా తగ్గుముఖం పట్టి, జీరో రేంజ్ కు చేరితే… మరింత ఊరట లభించినట్టే. ఇక రోజు రోజుకూ జనజీవనం మరింత పూర్వపు స్థితికి చేరే దిశగా సాగే పరిస్థితి కనిపిస్తూ ఉంది.