నలుగురిలో చెప్పుకోవాల్సి వస్తే మాత్రం.. తన గురించి తాను ‘రాజకీయ అపర చాణక్యుడు’గా , మేధావిగా వర్ణింపజేసుకునే చంద్రబాబునాయుడు.. వార్ధక్యం కారణంగా తన బుర్రలో గుజ్జు అయిపోయిందని భయపడుతున్నారో ఏమో గానీ.. 2024 ఎన్నికల కోసం వ్యూహాలకు రాబిన్ శర్మ మీద ఆధారపడుతున్నారు. సదరు రాబిన్ శర్మకు తెలుగుదేశం పార్టీ ఎన్ని వందల కోట్ల ప్యాకేజీ దఖలు చేసుకుంటున్నదో గానీ.. కొండంత రాగం తీసి లొల్లాయి పాట పాడినట్టుగా.. ఆయన సుదీర్ఘ కసరత్తు తర్వాత.. పార్టీ కార్యకర్తలు ప్రజల్లో ఇంటింటికి తిరిగి వారి సమస్యల గురించి తెలుసుకుని, వాటి ద్వారా మేనిఫెస్టో తయారు చేయాలనే అత్యంత పాచి అయిడియాను అందించారు. ఆయన అందించిన అయిడియాతో అమలవుతున్న కార్యక్రమమే ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అనేది!
ఈ కార్యక్రమాన్ని జనవరి మొదటివారానికి ముగించాలనేది చంద్రబాబునాయుడు ప్లాన్. నిజానికి ఊర్లలో ఊరేగింపులు చేయడమూ.. చంద్రబాబు నాయుడు బహిరంగ సభలు పెట్టడమూ ‘ఇదేం ఖర్మ’ లక్ష్యం కాదు. ప్రజల సమస్యల్ని సేకరించడం మాత్రమే. ఈ కార్యక్రమాన్ని హడావుడిగా ఇప్పుడు చేపట్టడమూ జనవరి ప్రారంభానికెల్లా పూర్తిచేయాలనుకోవడం వెనుక చినబాబు కోసం పెద్ద స్కెచ్చే ఉంది.
చినబాబు నారా లోకేష్ సంక్రాంతి తరువాత పాదయాత్ర ప్రారంభించబోతున్నాడు. ఆయన కుప్పంలో ప్రారంభించి ఇచ్చాపురం దాకా నడవాలనుకుంటున్నాడు. అయితే.. దొడ్డిదారిలో మంత్రి అయి.. వక్రరాజకీయం నడపాలనుకుని ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయిన ఈ చినబాబుకు జనం కష్టాలు ఏం తెలుస్తాయి? అందుకే.. ముందుగా సమస్యల్ని సేకరించి.. వాటిని లిస్టులు తయారుచేసి, చినబాబు అడుగుపెట్టే ముందే.. ఆయా ఊర్లకు సంబంధించిన సమస్యల లిస్టు మొత్తం.. ఆయన ఎదుట సిద్ధంగా ఉంచితే.. ఆయన పాదయాత్రలో భాగంగా.. ఆ సమస్యలన్నింటినీ ప్రస్తావిస్తూ.. ప్రజలందరూ తన వద్దకు వచ్చి ఆ సమస్యల్ని మొరపెట్టుకున్నట్టుగా బిల్డప్ ఇవ్వాలనేది చంద్రబాబు కోరిక.
కానీ వాస్తవంలో ఇదేం ఖర్మ కింద ఇళ్లకు తెలుగుదేశం వాళ్లు వస్తే.. వాళ్లకు సమస్యలు నివేదించుకోవడానికి జనం సిద్ధంగా లేరు. ఇంకో రకంగా చెప్పాలంటే.. వారికి చెప్పుకునే సమస్యలే లేవు. నిజంగా సమస్యలుంటే.. వాటిని వినిపించుకోడానికి వాలంటీర్లు, వైసీపీ గృహసారథులు లాంటి వ్యవస్థలున్నాయి. సమస్య ఉన్న ప్రజలు అధికారంలో ఉన్నవాళ్లకు నివేదించుకుంటారా? ఎప్పుడో మేం గెలిచి పరిష్కరిస్తాం అని సోది చెప్పే వాళ్లకు నివేదించుకుంటారా? అందుకే ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం ఫెయిలవుతోంది. వారు అంచనా వేసినట్టుగా సమస్యలు రావడం లేదు.
ఇదేం ఖర్మ ఫెయిలైతే.. ఆటోమేటిగ్గా చినబాబు పాదయాత్ర కూడా ఫెయిలవుతుందని చంద్రబాబులో భయం ఉంది. చినబాబు.. స్థానిక సమస్యల్ని ప్రస్తావించకుండా ఏదో వాకింగ్ చేసినట్టుగా యాత్ర చేస్తే దానివల్ల ఏ ప్రయోజనమూ లేదనేది అసలు భయం. మరి ఈ కష్టాలనుంచి వారు ఎలా గట్టెక్కుతారో చూడాలి.