అధికారంలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తల్లో దూకుడు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా సహజమైన పరిణామం. రాజకీయ, సామాజిక వాతావరణం కూడా దానికి అనుగుణంగా ట్యూన్ అయి ఉంటుంది. కాబట్టి అధికార పార్టీ నాయకులు కొన్ని సందర్భాల్లో రెచ్చిపోయి వ్యవహరిస్తున్నా సరే.. ప్రజల్లో ఆ విషయాలు పెద్దగా చర్చకు రావు. కానీ.. అధికారపార్టీ కార్యకర్తలు రెచ్చిపోవడం అనేదానికి కూడా ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే మళ్లీ పార్టీనే అభాసు పాలవుతుంది. హద్దు దాటిన సంగతులను విపక్షాలు గోబెల్స్ లాగా పదేపదే ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి తమ శక్తివంచన లేకుండా పాటుపడుతుంటాయి. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ కు కూడా అలాటి ఇరకాటమే ఎదురవుతోంది.
తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం మీద చర్చ పేరుతో ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. మళ్లీ కొత్తగా మీడియాలో కనిపించాలనే వారి ఉబలాటం తప్ప.. ఇలాంటి సమావేశాల్లో ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ప్రతిరోజూ ప్రభుత్వం మీద వేస్తున్న నిందలనే అన్నీ వరుసకట్టి మళ్లీ ఒకే జాబితాగా వినిపించారు. కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. ఎక్కడెక్కడైతే వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు శృతి మించి వ్యవహరించారో అలాంటివి ఎక్కువ చర్చకు వచ్చాయి. పార్టీ పరువుకు దెబ్బకొడుతున్నాయా అనేరీతిలో చర్చలు సాగాయి.
పెద్ద ఉదాహరణ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం. ఎమ్మెల్సీ స్వయంగా డ్రైవరు మృతదేహాన్ని వారి ఇంటికి డోర్ డెలివరీ చేసిన తర్వాత.. ఆ మరణంలో ఆయనకు పాత్ర ఉన్నదని రాష్ట్రమంతా నమ్ముతోంది. పైగా ఆ డ్రైవరు దళితుడు. ప్రతిపక్షాలు నిందలు వేయడానికి ఇంకో అదనపు అంశం అన్నమాట. ఆయన అరెస్టు అయి సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత బెయిలు పొందారు. అనంతబాబు జైలునుంచి విడుదల కావడం అనే సందర్భాన్ని వైసీపీ కార్యకర్తలు ఓ పండగ లాగా సెలబ్రేట్ చేసుకున్నారు. చాలా ఘోరమైన పరిణామం ఇది. ప్రజలకు చాలా తప్పుడు సంకేతాలు పంపే పరిణామం.
కంపేర్ చేసినప్పుడు.. జగన్మోహన్ రెడ్డి బెయిలు మీద వచ్చినప్పటికంటె వైభవంగా అనంతబాబు బయటకు రాగానే సన్మానాలు, పాలాభిషేకాలు లంటి కల్లోలం జరిగింది. జగన్ పరిస్థితి వేరు.. ఆయన కుట్రపూరితమైన ఆరోపణల పర్యవసానంగా జెయిల్లో ఉండాల్సి వచ్చింది. అవినీతిగా అభివర్ణించబడిన కట్టుకథల పుణ్యం అది. ఆయనను అన్యాయంగా జైల్లో పెట్టారనే బాధలో ఉండిపోయిన అభిమానులు బయటకు రాగానే ఆ హర్షాన్ని ఆనందాన్ని పంచుకున్నారు. కానీ అనంతబాబు సంగతేమిటి? ఆయన జగన్ అంతటి నాయకుడా? పైగా నేరం ఎలాంటిది? ఓ దళితుడి హత్య కేసుకు సంబంధించినట్టిది. బెయిలు వస్తే కార్యకర్తలు సంతోషించవచ్చు. కానీ.. ఈ వేడుకలు చేసుకోవడం అనేది.. మాంసం తిన్న సంగతి జనానికి తెలిసేలా ఎముకలు మెడలో వేసుకుని తిరిగినట్టుగా ఉంటుంది.
నిజం చెప్పాలంటే అధికారంలో ఉన్న పార్టీ మరింత బాధ్యతగా ఉండాలి. తమను ఎవ్వరూ ఒక మాట అనగల ఆస్కారం ఇవ్వకుండా ఉండాలి. అనంతబాబు వ్యవహారం కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. రాష్ట్రంలో వేర్వేరు చోట్ల వేర్వేరు సందర్భాల్లో వైసీపీ శ్రేణులు కొంచెం అతిగా రెచ్చిపోతుండడం జరుగుతోంది. గుడివాడ గొడవ కూడా అలాంటిదే. నిజానికి ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికల సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. పార్టీ శ్రేణులను కాస్త కంట్రోల్ చేసుకోవడం అవసరం.
వీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. ఇవి చిన్న చిన్న విషయాలే కావొచ్చు.. కానీ వీటినే భూతద్దంలో చూపిస్తూ పార్టీ కేరక్టర్ ను దెబ్బతీయడానికి విపక్షాలు ఎప్పుడూ కుట్రపూరితంగా ఆలోచనలు చేస్తుంటాయి. వారు నిందలు వేసిన తర్వాత.. వాటిని తిప్పికొట్టడం, మాటల్లో ఎదురుదాడికి దిగడం లాంటి కష్టాలకంటె.. అసలు నిందలు వేయడానికి ఆస్కారం ఇవ్వకుండా కార్యకర్తల అత్యుత్సాహాన్ని కాస్త అదుపులో పెట్టుకోవడంలో నాయకులు శ్రద్ధ పెడితే పార్టీకి చాలా మంచిది.