హీరోహీరోయిన్లు, విలన్లు పాపులర్ అయినంతగా క్యారెక్టర్ ఆర్టిస్టులు పాపులర్ అవ్వలేరు. కొన్ని సినిమాల్లో సదరు ఆర్టిస్టులు పోషించిన పాత్రలు బాగా క్లిక్ అవుతాయి. కానీ వాళ్ల పేర్లు అడిగితే మాత్రం చాలామంది ఠక్కున చెప్పలేని పరిస్థితి.
అలా ఎన్నో మంచి పాత్రలు పోషించి, ఆశించిన స్థాయిలో క్రేజ్ అందుకోలేకపోయిన నటుడు రాజబాబు. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, శ్రీకారం, సముద్రం, సింధూరం లాంటి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ పోషించిన రాజబాబు కన్నుమూశారు.
64 ఏళ్ల రాజబాబు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఇండస్ట్రీలో అంతా ఆప్యాయంగా బాబాయ్ అని పిలుస్తారు. అంత సరదాగా, కలుపుగోలుగా ఉండే వ్యక్తి రాజబాబు.
అటు సినిమా రంగానికి, ఇటు టీవీ రంగానికి అత్యంత ఆప్తుడు బాబాయ్ రాజబాబు. ఎన్ని మంచి సినిమాల్లో నటించారో, అదే స్థాయిలో టీవీ సీరియల్స్ లో కూడా కనిపించారు. ఓ సీరియల్ లో పోషించిన పాత్రకు ఏకంగా నంది అవార్డ్ కూడా అందుకున్నారు. ఒక దశలో టీవీలో ఓ వంటల కార్యక్రమం కూడా చేశారీయన.
1995లో వచ్చిన ఊరికి మొనగాడు సినిమాతో సినిమా రంగానికి పరిచయమయ్యాడు రాజబాబు. అంతకంటే ముందు ఎన్నో నాటకాలు వేశారు. చేసినవి చిన్నచిన్న పాత్రలే అయినప్పటికీ తన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు రాజబాబు. దాదాపు 60కి పైగా సినిమాల్లో నటించారు రాజబాబు.