మిత్రపక్షమైన బీజేపీతో సంబంధం లేకుండా త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికల్లో జనసేన తలపడునుందా? అంటే ఔనని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ మేరకు తమ అధినాయకుడు పవన్‌కల్యాన్ సంకేతాలు ఇచ్చినట్టు జనసేన నాయకులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్ అధ్యక్షతన జనసేన జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.
వివిధ కారణాలతో ఆగిపోయిన పురపాలక ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్న నేపథ్యంలో పవన్‌కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. త్వరలో జరిగే పురపాలక ఎన్నికల్లో ప్రతి డివిజన్, వార్డుల్లో పార్టీ తరపున అభ్యర్థుల్ని నిలబెట్టాలని తీర్మానించారు. దీంతో జనసేన నాయకుల్లో ఉత్సాహం రెట్టింపైంది.
పార్టీ బలోపేతం కావాలంటే ఎన్నికల్లో పోటీ తప్పనిసరని జనసేనాని అన్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇదే సందర్భంలో బీజేపీ, టీడీపీలను పవన్‌కల్యాణ్ ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదని జనసేన నాయకులు చెప్పడం గమనార్హం.
ఇటీవల జరిగిన పురపాలక ఎన్నికల్లో కొన్ని చోట్ల బీజేపీతో పొత్తు వల్ల తాము నష్టపోయామని జనసేన నాయకులు బహిరంగంగానే విమర్శించారు. ఎక్కడెక్కడ ఏ విధంగా పార్టీ నష్టపోయిందో జనసేన అధికార ప్రతినిధి మహేశ్ అప్పట్లో మీడియా సమావేశంలో వివరించిన సంగతి తెలిసిందే.
ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకుని సొంతంగానే బరిలో దిగాలని పవన్‌కల్యాణ్ సంకేతాలు ఇచ్చినట్టు నాయకులు చెబుతున్నారు. దీంతో బీజేపీకి మరోసారి పవన్ ఝలక్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రియాక్షన్ ఏంటో తెలియాల్సి వుంది.