ప్రధాని మోడీ చర్యలు టీడీపీ అధినేత చంద్రబాబును హర్ట్ చేశాయని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు. కలవాలని కోరితే నాలుగు దశాబ్దాలకు పైబడి రాజకీయ సీనియార్టీ కలిగిన చంద్రబాబుకు అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు మోడీ స్పందించక పోవడం ఏంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఒకప్పుడు గుజరాత్‌కే మోడీ పరిమితమైన రోజుల్లో చంద్రబాబు ఢిల్లీలో చక్రాలు, బొంగరాలు తిప్పిన సంగతుల్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
ఏపీలో జగన్ ప్రభుత్వ తీరుతో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లుతోందని, గంజాయి సాగు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు ఫిర్యాదు చేసేందుకు బాబు నేతృత్వంలోని టీడీపీ బృందం ఢిల్లీకి వెళ్లనున్న విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం రాష్ట్రపతిని కలిసి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నారు. రాష్ట్రపతితో పాటు ప్రధాని మోడీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాలను కూడా కలిసి ఇదే ఫిర్యాదు చేయాలని టీడీపీ భావిస్తోంది.
అయితే అటు వైపు నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. దీంతో టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. ఏదో ఒక సాకుతో బీజేపీ పెద్దల్ని ప్రసన్నం చేసుకునేందుకు ఆడుతున్న డ్రామాగా ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. గతంలో తనపై తిరుపతిలో దాడిని అమిత్‌షా గుర్తించుకున్నారని, అందుకే బాబును చూసేందుకు ఇష్టపడలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక ప్రధాని మోడీ విషయానికి వస్తే….బాబు పేరు ప్రస్తావిస్తే చాలు వినడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు.
ఈ నేపథ్యంలో బాబు నేతృత్వంలోని టీడీపీ బృందం ఢిల్లీ పర్యటకు వెళుతోంది. ప్రస్తుతానికి మోడీ, అమిత్‌షాల అపాయింట్ మెంట్ నిరాకరణ టీడీపీ బృందానికి తీవ్ర ఆగ్రహం, నిరాశ కలిగిస్తోందన్నది వాస్తవం. అపాయింట్‌మెంట్ ఇవ్వాలని అడుక్కుంటున్నా కనికరించని బీజేపీ అహంకారంతో విరవీగుతోందని టీడీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో మండిపడుతున్నారని సమా చారం. ఢిల్లీ వెళ్లిన తర్వాత అపాయింట్‌మెంట్ లభిస్తే మాత్రం… ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించినంత ఆనందం అని చెప్పక తప్పదు.