ఆంధ్రా లీడర్లు బూతులు తిట్టుకుంటే కేటీఆర్ కు బాధ ఎందుకో …!

తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు వారు అధికార పార్టీవారు కావొచ్చు, ప్రతిపక్ష నాయకులు కావొచ్చు ప్రతిరోజూ పచ్చి బూతులు తిట్టుకోవడం వారి దినచర్యలో భాగమైపోయింది. రోజూ పొద్దున్నే లేచి పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం,…

తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు వారు అధికార పార్టీవారు కావొచ్చు, ప్రతిపక్ష నాయకులు కావొచ్చు ప్రతిరోజూ పచ్చి బూతులు తిట్టుకోవడం వారి దినచర్యలో భాగమైపోయింది. రోజూ పొద్దున్నే లేచి పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, అన్నం తినడం ఎంత సహజమో ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం అంత సహజం. 

యేవో కొంపలు మునిగిపోతున్నాయని, ప్రపంచం నాశనమై పోతోందని మనం ఏడవడం అనవసరం. బూతుల విషయంలో ఏపీ, తెలంగాణా నాయకుల్లో ఎవరూ తక్కువ కాదు. కాకపొతే ఏపీ నాయకులు బాగా ముదుర్లు. దేశ ముదుర్లు కూడా. ఎచటైతేనేం …ఎచటైనేం పోటీబడి కాటులాడ ఎచటైతేనేం అన్నాడు కాళోజి. కాబట్టి తిట్టుకోవడానికి ప్రత్యేకంగా ఒక వేదిక అక్కరలేదు. బహిరంగ సభలు, ప్రెస్ మీట్ లు, పుణ్యక్షేత్రాలు, ప్రభుత్వ కార్యక్రమాలు …ఎక్కడైనా రాజకీయాలు మాట్లాడటమే, దాని వెంబడి బూతులు తిట్టడమే. 

 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెరిగిపోయిన బూతుల ప్రవాహంపై తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ ఆవేదన చెందుతున్నాడు. . ‘ఏపీలో ఆ బూతులేంటి.?’ అంటూ బాధ పడ్డాడు.  ముఖ్యమంత్రుల్ని తిట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వుంటుందని అన్నాడు. 

పాపం …తెలంగాణలో నాయకులంతా పత్తిత్తులైనట్లు మాట్లాడాడు కేటీఆర్.   తెలంగాణ ఉద్యమంలో  టీఆర్ఎస్ అధినేత కేసీయార్, అప్పటి దేశ ప్రధాని మన్మోహన్ సింగ్‌ని ‘చప్రాసి’ అన్నారు.  అప్పట్లో అదో పెను దుమారం. సోనియాగాంధీని దెయ్యమన్నారు.. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతల్ని నానా రకాలుగా తిట్టారు. ఏమన్నా అంటే, ‘మా తెలంగాణలో ఇంతే.. మా భాష గిట్లనే వుంటది..’ అని సెలవిచ్చేవారు కేసీయార్. కేటీయార్  కూడా తక్కువోడేమీ కాదు.

 తెలంగాణ ఉద్యమంలో ఎందరో పోలీస్ అధికారులపై నోరు  పారేసుకున్నాడు.  ‘ఆంధ్రా లం.. కొడుకులు..’ అన్న మాట తెలంగాణ నేతల నుంచి చాలా సులువుగా వచ్చేసింది. అలాంటి తెలంగాణ నాయకులు, ఇప్పుడు ఆంధ్రా రాజకీయాల గురించి మాట్లాడుతూ, నీతులు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఔను, ఆంధ్రప్రదేశ్ సిగ్గు పడాల్సిందే.. ఎందుకంటే, రాష్ట్రంలో బూతు రాజకీయాల గురించి దేశమంతా చర్చించుకుంటోంది మరి.

అన్నట్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలోనూ బూతుల ప్రవాహం మామూలుగా లేదు. రేవంత్ రెడ్డి, కేటీయార్, మంత్రి మల్లారెడ్డి.. ఇలా లిస్టు పెద్దదే. రాజకీయాల్లో అంతే.. బూతులు లేనిదే రాజకీయాల్లేవ్. ఇప్పుడు. ఇదో రాజకీయ దౌర్భాగ్యమంతే. 

మొన్నటికి మొన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వర్సెస్ మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వ్యవహారం పెద్ద రచ్చకు దారితీసింది. బండి సంజయ్ విమర్శలకు మైనంపల్లి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బూతులతో నోటికి పనిచెప్పారు. అది ముగిసిందనుకునేలోపే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి మల్లా రెడ్డి మధ్య బూతుల యుద్ధం నడిచింది. 

ఒకడుగు ముందుకేసి తొడలు కొట్టుకుని సవాళ్లు చేసుకునే వరకూ వెళ్లిపోయింది. ఒకరిపై మరొకరు నోరుపారేసుకోవడంపై జనాలు ముక్కున వేలేసుకుంటున్నా నేతల తీరులో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఇప్పట్లో వస్తుందా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న. 

అయితే ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సీఎం కేసీఆర్‌ను ఎంతమాట పడితే అంత అంటున్నారంటూ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.  ఆయన కాలి గోటికి కూడా సరిపోని వాళ్లు కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డాడు.  రాజకీయాల్లో భాష సభ్యతతో ఉండాలని అందరు నేతలకూ సూచించాడు.  

రాజకీయ విమర్శల్లో అభ్యంతరకర భాష వాడకూడదన్న కేటీఆర్ వ్యాఖ్యలు బాగానే ఉన్నా.. అసలు అది మొదలుపెట్టిందెవరనే దగ్గరికొచ్చింది వ్యవహారం. ప్రత్యర్థులను కేసీఆర్ బూతులు తిడుతూ.. అదే తెలంగాణ యాస, భాష, ఆవేదన అని చెప్పుకొచ్చారు. ఇప్పుడెందుకు తట్టుకోలేకపోతున్నారో.  రాష్టం విడిపోయినప్పుడు ఏపీ సీఎం గా ఉన్న చంద్రబాబును కేసీఆర్ పరమ భయంకరంగా తిట్టారు. ఇవన్నీ కేటీయార్ కు గుర్తు లేనట్లున్నాయి. 

రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అదే విషయంపై విపరీతమైన ట్రోలింగ్ చేస్తోంది. తండ్రి బూతులు తిడుతుంటే.. కొడుకు సుద్దులు చెబుతున్నారంటూ సోషల్ మీడియాని హోరెత్తిస్తోంది. ‘ప్రత్యర్థి పార్టీల నాయకులపై బూతులు మొదలుపెట్టింది మీరే కదా. ముందు మార్పు మీ ఇంటి నుండే మొదలవ్వాలి మిస్టర్ కేటీఆర్’ అంటూ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అవి కాస్త తెలంగాణ గ్రూపుల్లో వైరల్‌గా మారాయి. ఆంధ్రా, తెలంగాణా నాయకుల బూతుల చరిత్ర చెప్పుకోవాలంటే మాహాభారతమంత గ్రంథమే అవుతుంది.